పుష్ఫ‌.. అటు తిరిగి, ఇటు తిరిగి ఈ పోలిక వ‌స్తోందా!

మొద‌ట్లో ఈ పోలిక రాలేదు కానీ.. అటు తిరిగి, ఇటు తిరిగి పుష్ఫ‌.. పుష్ప‌రాజ్.. చంద‌న సీమ‌కు చెందిన గంధ‌పు చెక్క‌ల దొంగ వీర‌ప్ప‌న్ గుర్తుకు వస్తున్నాడు. గంధం చెక్క‌ల స్మ‌గ్లింగ్ తో ద‌క్షిణ…

మొద‌ట్లో ఈ పోలిక రాలేదు కానీ.. అటు తిరిగి, ఇటు తిరిగి పుష్ఫ‌.. పుష్ప‌రాజ్.. చంద‌న సీమ‌కు చెందిన గంధ‌పు చెక్క‌ల దొంగ వీర‌ప్ప‌న్ గుర్తుకు వస్తున్నాడు. గంధం చెక్క‌ల స్మ‌గ్లింగ్ తో ద‌క్షిణ భార‌త‌దేశంలో త‌న పేరును మార్మోగించాడు వీర‌ప్ప‌న్. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుల్లోని స‌త్య‌మంగ‌ళం అడ‌వుల్లో మ‌కాం వేసి.. ద‌శాబ్దాల‌కు ద‌శాబ్దాలు రెండు రాష్ట్రాల పోలీసుల‌ను గ‌డ‌గ‌డ‌లాడించాడు వీర‌ప్ప‌న్. 

స‌త్య‌మంగ‌ళం అడ‌వుల్లో స‌మాంత‌ర రాజ్యాన్ని న‌డిపించాడు. వీర‌ప్ప‌న్ క‌థ ఇప్ప‌టికే ప‌లు సార్లు సినిమాగా తెర‌కెక్కింది. త‌మిళ‌, క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో వీర‌ప్ప‌న్ క‌థ ర‌క‌ర‌కాల కోణాల్లో తెర‌పైడి ఆడింది. వాట‌న్నింటిలోనూ కిల్లింగ్ వీర‌ప్ప‌న్ ద బెస్ట్ గా నిలిచింది. చాలా కాలం కింద‌టే కెప్టెన్ ప్ర‌భాక‌ర్ లో వీర‌ప్ప‌న్ క్రౌర్యాన్ని విల‌న్ పాత్ర‌కు అంట‌గ‌ట్టి త‌మిళ సెల్వ‌మ‌ణి ఒక హిట్టు కొట్టాడు.

ఇక పుష్ఫ ట్రైల‌ర్ విడుద‌ల అయ్యాకా..  ఎర్ర‌చంద‌నం దొంగ పాత్ర‌కు ఇచ్చిన బిల్డ‌ప్పు, అత‌డి అనుచ‌ర‌గ‌ణం అత‌డికి అండ‌గా నిలిచే తీరు… ల‌వ్ స్టోరీ.. ఇవ‌న్నీ అంతిమంగా వీర‌ప్ప‌న్ ను గుర్తుకు చేస్తూ ఉన్నాయి. ఎర్ర‌చంద‌నం దొంగ  అనే ప‌దానికి ప‌ర్యాయ‌ప‌దంగా నిలిచాడు వీర‌ప్ప‌న్. 

అయితే పుష్ప మేక‌ర్లు.. స‌త్య‌మంగ‌ళం బ్యాక్ డ్రాప్ నుంచి కాకుండా, శేషాచ‌లం అడ‌వులు, చిత్తూరు మండ‌లికం, పేర్ల‌ను ట‌చ్ చేస్తూ.. చాలా వ‌ర‌కూ వీర‌ప్ప‌న్ ను గుర్తుకు రాకుండా చూశారు. అయితే.. అంతిమంగా పుష్ప పాత్ర‌కు వీర‌ప్ప‌న్ తో పోలిక వ‌స్తోంది. వీర‌ప్ప‌న్ కు మీసం, పుష్ప‌కు గ‌డ్డం ప్ర‌ధాన తేడాగా క‌నిపిస్తూ ఉంది.

ఈ విష‌యాన్ని క‌న్న‌డ రిపోర్ట‌ర్లు డైరెక్టుగా అల్లు అర్జున్ నే అడిగారు. ఇది వీర‌ప్ప‌న్ క‌థేనా? అంటూ ఆరా తీశారు, అయితే అలాంటిది ఏమీ లేద‌ని, ఇది ప్యూర్లీ ఫిక్ష‌న్ అని అల్లు అర్జున్ స‌మాధానం ఇచ్చాడు. మ‌రి పుష్ప క‌థ‌, క‌థ‌నాల క్రియేష‌న్ కు సుకుమార్ అండ్ టీమ్ ఎంత క‌ష్ట‌ప‌డిందో కానీ.. అనూహ్యంగా వీర‌ప్ప‌న్ క‌థతో పోలిక వ‌స్తోంది. 

వాస్త‌వానికి వీర‌ప్ప‌న్ క‌థ‌ను ఇప్ప‌టికే పిప్పి పీల్చి చేశారు సినీ జ‌నాలు. కాబ‌ట్టి.. వీర‌ప్ప‌న్ క‌థ నుంచి తీసుకోవ‌డానికి ఏమీ లేద‌నే అనుకోవాలి.