పురంధేశ్వ‌రి…ఏ ఎండ‌కు ఆ గొడుగా త‌ల్లి?

ఏ పార్టీ అధికారంలో ఉంటుందో అక్క‌డ వాలిపోయే వ‌ల‌స రాజ‌కీయ నేత‌గా ద‌గ్గుబాటు పురంధేశ్వ‌రికి పేరు. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే పురంధేశ్వ‌రికి రాజ‌కీయాల్లో ప‌ద‌వులు త‌ప్ప ఏ సిద్ధాంతం ఉండ‌ద‌నే అభిప్రాయం…

ఏ పార్టీ అధికారంలో ఉంటుందో అక్క‌డ వాలిపోయే వ‌ల‌స రాజ‌కీయ నేత‌గా ద‌గ్గుబాటు పురంధేశ్వ‌రికి పేరు. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే పురంధేశ్వ‌రికి రాజ‌కీయాల్లో ప‌ద‌వులు త‌ప్ప ఏ సిద్ధాంతం ఉండ‌ద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.  మూడు రాజ‌ధానుల ఏర్పాటుపై జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యాన్ని ఆమె త‌ప్పు ప‌డుతున్నారు. దీంతో ముఖ్య విశాఖ‌వాసులు, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే రాయ‌లసీమ వాసులు కూడా ఆమెను ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి ప‌నికొచ్చే రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంతాలు…రాజ‌ధానుల‌కు అర్హ‌త‌లేవా అంటూ ఆ ప్రాంత వాసులు నిల‌దీస్తున్నారు.

దివింగ‌త ఎన్టీఆర్ కుమార్తెగా పురంధేశ్వ‌రి గురించి తెలుగు వారికి ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. ఆమె ప్ర‌కాశం జిల్లా కోడ‌లు. కానీ విశాఖప‌ట్నం నుంచి ఆమె 2009లో ఎంపీగా కాంగ్రెస్ అభ్య‌ర్థిగా గెలుపొందారు. యూపీఏ-2లో కేంద్ర‌మంత్రిగా ప‌నిచేశారు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్‌పై ప్ర‌జాగ్ర‌హాన్ని ప‌సిగ‌ట్టిన ఆమె బీజేపీలో చేరారు.

2014లో టీడీపీ పొత్తులో భాగంగా ఆమె క‌డ‌ప జిల్లా రాజంపేట పార్ల‌మెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. వైసీపీ అభ్య‌ర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చేతిలో ఓట‌మిపాల‌య్యారు. ఆ త‌ర్వాత 2019లో ఆమె తిరిగి విశాఖ‌ప‌ట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె త‌మ్ముడు బాల‌కృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా అనంత‌పురం జిల్లా హిందూపురం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. నంద‌మూరి కుటుంబ స‌భ్యుల‌కు రాజ‌కీయాలు, ప‌ద‌వుల కోసం మాత్రం రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర కావాలి?  రాజ‌ధానుల విష‌యానికి వ‌స్తే మాత్రం ఏవేవో రూల్స్ చెబుతున్నారు.

ప్ర‌భుత్వానికి మాత్ర‌మే భూములు ఇచ్చార‌ని, పార్టీల‌కు కాద‌ని  జ‌గ‌న్ స‌ర్కార్‌కు పురంధేశ్వ‌రి  హితవు చెబుతుండ‌డం ఉత్త‌రాంధ్ర వాసుల్లో ఆగ్ర‌హం తెప్పిస్తోంది. రాజ‌ధానిని మార్చ‌కుండా జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఒత్తిడి తేవాల‌ని ఆ ప్రాంత రైతులు శ‌నివారం కేంద్ర‌మాజీ మంత్రి పురంధేశ్వ‌రిని కోరారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు బీజేపీ మొద‌టి నుంచి మ‌ద్ద‌తు ఇస్తోంద‌న్నారు.   కేంద్రం ఎన్ని నిధులిచ్చినా చంద్ర‌బాబు గ్రాఫిక్స్‌కు ప‌రిమితం అయ్యార‌ని ఆమె విమ‌ర్శించారు.  మ‌రి అమ‌రావ‌తిలో గ్రాఫిక్స్ త‌ప్ప ఏమీ లేన‌ప్పుడు అక్క‌డే రాజ‌ధానిని కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఏంటి? అధికార‌, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు జ‌గ‌న్ స‌ర్కార్ చ‌ర్య‌లు తీసుకుంటుంటే పురంధేశ్వ‌రికి వ‌చ్చిన ఇబ్బంది ఏంట‌ని వారు నిల‌దీస్తున్నారు.