రాజధాని అమరావతిపై జనసేనాని పవన్‌కల్యాణ్ డ్రామాలకు అన్న చిరంజీవి చెక్ పెట్టారు. జగన్ సర్కార్ మూడురాజధానుల ఏర్పాటుపై మొగ్గు చూపిన తరుణంలో ఒక్క రాజధాని రైతుల మినహా మరెక్కడా నిరసన గళం వినపించలేదు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్ నిర్ణయానికి సానుకూల స్పందన వస్తోంది. అంతెందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఎక్కడా మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడకపోవడం గమనార్హం. అమరావతి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారే తప్ప మూడు రాజధానుల విషయమై మౌనం పాటించారు.
కానీ అన్నీ ఉన్న వారు అణగి ఉంటే ఏమీ లేని పవన్ ఎగిరెగిరి పడుతున్నారు. జగన్ ప్రకటనతోనే ఏదో పోయినట్టు వరుస ట్వీట్లతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని పవన్ విశ్వ ప్రయత్నం చేశారు. ఒక్క రాజధానికే దిక్కులేదని, మూడు రాజధానులు ఎలా అభివృద్ధి చేస్తారని ఆయన ప్రశ్నించారు. అంతే కాదు అన్నం, పరమాన్నం అంటూ రాజధానుల ప్రకటనపై అవహేళన చేశారు.
ఈ నేపథ్యంలో పవన్ అన్న చిరంజీవి శనివారం రంగప్రవేశం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తూనే ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. జగన్ సర్కార్‌కు చిరంజీవి మద్దతు పలకడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. పవన్ ట్వీట్స్ జగన్ సర్కార్‌తో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.
మొదటి నుంచి చిరంజీవి హూందాగా వ్యవహరిస్తారని పేరు ఉంది. ఎదుటి వారి పట్ల చాలా మర్యాదగా, ప్రేమగా, గౌరవంగా నడుచుకునే చిరంజీవిని ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. కానీ పవన్ పరిస్థితి అందుకు భిన్నమైందనే వాదన ఉంది. అందుకే పవన్ అదో టైప్ అని అంటారు. ఆయనకు దేనిపట్లా స్థిరాభిప్రాయం ఉండదని అతన్ని ఫాలో అవుతున్న వారు చెబుతారు. చిరు ప్రకటనతోనే పవన్ రాజధానుల విషయమై ఆచితూచి మాట్లాడుతున్నారనిపిస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటుపై జీఎన్ రావు కమిటీ పూర్తి నివేదిక, దానిపై కేబినెట్ నిర్ణయం తర్వాత స్పందిస్తామని పవన్ ప్రకటించారు.
మొత్తానికి జగన్ సర్కార్‌పై దూకుడుగా పోతున్న పవన్‌కు చిరు తన ప్రకటనతో బ్రేక్ వేసినట్టైంది.