ఉద్ధ‌వ్ ఠాక్రే భ‌విత‌వ్యం.. తేలాల్సింది ప్ర‌జాకోర్టులోనే!

కేంద్రంలో అధికారంలో ఉన్న వారితో శ‌త్రువుగా ఉండ‌టం క‌న్నా మిత్రులుగా ఉంటేనే ప్ర‌మాదం అధికంగా ఉన్న‌ట్టుంది! గ‌తంలో సోనియాగాంధీ ఢిల్లీ నుంచి దేశాన్ని ఆడించిన‌ప్పుడు అయినా, ఇప్పుడు మోడీ-అమిత్ షా ల ప్రాభ‌వంలో అయినా..…

కేంద్రంలో అధికారంలో ఉన్న వారితో శ‌త్రువుగా ఉండ‌టం క‌న్నా మిత్రులుగా ఉంటేనే ప్ర‌మాదం అధికంగా ఉన్న‌ట్టుంది! గ‌తంలో సోనియాగాంధీ ఢిల్లీ నుంచి దేశాన్ని ఆడించిన‌ప్పుడు అయినా, ఇప్పుడు మోడీ-అమిత్ షా ల ప్రాభ‌వంలో అయినా.. అధికంగా దెబ్బ‌తింటున్న‌ది వారితో కొంత‌కాలం స్నేహం చేసి, ఆ త‌ర్వాత దూరం అయిన‌వారే! అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ప్ర‌స్తుతానికి ఉద్ధ‌వ్ ఠాక్రే!

బాల్ ఠాక్రే శివ‌సేనానిగా ఉన్న‌ప్ప‌టి నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీకి అత్యంత మిత్ర పార్టీ శివ‌సేన అని కొత్త‌గా వివ‌రించ‌న‌క్క‌ర్లేదు ఎవ్వ‌రికీ! అదే కాషాయ తానులోంచి కొంత చించుకుని కాషాయం దుస్తులు ధ‌రించిన పార్టీ శివ‌సేన‌! బీజేపీ రామ సేన అయితే, ఠాక్రేల‌ది శివ‌సేన‌! అంతే తేడా.. బీజేపీ అడుగుల‌కు మ‌డుగులు ఎత్తిన పార్టీ! మ‌రాఠ గ‌డ్డ‌పై ఈ కూట‌మిలో పెద్ద‌న్న కూడా! అయితే ఏ ముహూర్తాన కేంద్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ సొంత మెజారిటీతో ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసుకునే స్థితికి వ‌చ్చిందో, అప్ప‌టి నుంచి మిత్రుల‌ను ప‌ట్టించుకోన‌క్క‌ర్లేద‌నే సిద్ధాంతం కూడా ఒంట‌ప‌ట్టించుకుంది!

పార్టీలో సీనియ‌ర్లు కాని వార‌య్యారు, వారంద‌రినీ ఒకేసారి సాగ‌నంప‌డానికి 75 యేళ్ల వ‌య‌సు రూల్ ను తీసుకు వ‌చ్చారు! మ‌ళ్లీ అవ‌స‌రార్థం ఆ సిద్దాంతంలోనూ వెసులుబాటు ఇచ్చుకున్నారు! బ‌హుశా రేపోమాపో న‌రేంద్ర‌మోడీకి కూడా 75 యేళ్ల వ‌య‌సు నిండితే ఆయ‌నను కూడా పీఠం దిగ‌మంటారా.. అంటే, ఇప్పుడు క‌మ‌ల‌నాథులు డైరెక్టుగా స్పందించ‌లేరు! ఆ రూల్ పెట్టింది మోడీ, అమిత్ షాలే కాబ‌ట్టి.. ఆ రూల్ వారికి వ‌ర్తించ‌క‌పోవ‌చ్చునేమో! కేవ‌లం పార్టీలోని సీనియ‌ర్లే కాదు, మిత్ర‌బేధం త‌లెత్తిన‌ప్పుడు కూడా వీరు మ‌రీ రూత్ లెస్ గా వ్య‌వ‌హ‌రిస్తార‌నే విష‌యం ఉద్ధ‌వ్ ఠాక్రేకు పూర్తిగా ఇప్ప‌టికి అవ‌గ‌తం అయిఉండ‌వ‌చ్చు!

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాకా ఐదారేళ్ల పాటు శివ‌సేన క‌ష్టంగా అయినా భ‌రించింది. కేంద్రంలో ప్రాతినిథ్యం ప‌రిమిత‌మే అయినా, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంలో త‌న పాత్ర‌ను అస్స‌లు ప‌ట్టించుకోక‌పోయినా శివ‌సేన త‌న తీరుకు విరుద్ధంగా భ‌రించింది. అయితే ఈ కూట‌మి రెండో సారి ప‌గ్గాలు చేప‌ట్టే అవ‌కాశం వ‌చ్చాకా శివ‌సేన  క‌య్యానికే కాలుదువ్వింది. అయితే బీజేపీ స‌హించ‌లేదు. ఎంత‌కైనా స‌రే అనే సంకేతాలు ఇచ్చింది. అజిత్ ప‌వార్ ను తీసుకు వ‌చ్చి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే అది విజ‌య‌వంతం కాలేదు. ఉద్ధ‌వ్ ఠాక్రే పంతం నెర‌వేరింది.

అయితే అవ‌కాశం చూసి షిండే రూపంలో తిరుగుబాటుదారుడిని త‌యారు చేసుకుంది క‌మ‌లం పార్టీ. అత‌డిని ఏకంగా సీఎంగా చేసింది. అయితే ఏదో ఒక ద‌శ‌లో ఈ సారి కూడా బీజేపీ వెన‌క్కు త‌గ్గుతుంద‌ని చాలా మంది అనుకున్నారు. అయితే అలాంటిదేమీ జ‌ర‌గ‌డం లేదు. శివ‌సేన తిరుగుబాటుకు మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆమోదం వేసి, షిండేతో సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయించినా, పార్ల‌మెంట్ లో తిరుగుబాటు వ‌ర్గాల‌కే గుర్తింపు ద‌క్కినా, ఆఖ‌రికి ఇప్పుడు శివ‌సేన పార్టీ పేరు, గుర్తుపై షిండే క్యాంపుకే ద‌క్కుతుంద‌ని సీఈసీ ప్ర‌క‌టించినా, ఇదంతా కేంద్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భావం అనే సామాన్యులు అనుకోవ‌డంలో పెద్ద వింత లేదు! కేంద్రంలో బీజేపీకి ఉన్న తిరుగులేని శక్తే ఇదంతా అని అంతా అనుకోవ‌చ్చు!

ఇక కోర్టులో కూడా ఉద్ధ‌వ్ ఠాక్రేకు ఊర‌ట ద‌క్కుతుంద‌నుకోవ‌డానికి ఏమీ లేన‌ట్టుగా ఉంది. శివ‌సేన గుర్తు, పేరుపై సీఈసీ నిర్ణ‌యం పై స్టే విధించ‌డానికి కోర్టు నిరాక‌రించింది. ఈ పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిగితే జ‌ర‌గొచ్చు! అయితే సీఈసీ నిర్ణ‌యం త‌ప్పు అని కోర్టు ఆదేశాలు ఇస్తుంద‌నే ఎక్స్ పెక్టేష‌న్లు పెద్ద‌గా ఏమీ లేవు! త‌న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకోవ‌డానికి ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద కూడా లాజిక్కులు ఉండ‌నే ఉంటాయి!

ఏతావాతా.. ఉద్ధ‌వ్ ఠాక్రేకు న్యాయం అంటూ ఏదైనా జ‌రిగితే అది ప్ర‌జా కోర్టులోనే జ‌ర‌గాలి. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌జాభిప్రాయాన్ని కోర‌వ‌చ్చు. అది కూడా బ‌హుశా కొత్త గుర్తు, కొత్త పేరుతోనో వెళ్లాల్సి రావొచ్చు. శివ‌సేన ఠాక్రే గ్రూప్ ప్ర‌జాద‌ర‌ణ‌ను పొందితే.. అప్పుడు అదే అస‌లు శివ‌సేన అవుతుంది. అయితే ఇక్క‌డ మ‌రో త‌మాషా షిండే గ్యాంగ్ ను బీజేపీ ఎంత వ‌ర‌కూ ఎంట‌ర్ టైన్ చేస్తుంద‌నేది! ప్ర‌స్తుతానికి ఉద్ద‌వ్ ను దెబ్బ‌తీయ‌డానికి షిండే గ్రూప్ బీజేపీకి బాగా ఉప‌యోగ‌ప‌డుతూ ఉంది. గుర్తును, పార్టీ పేరును దూరం చేయ‌డం బీజేపీ సాధించిన పెద్ద విజ‌యం! మ‌రి రేపు ప్ర‌జ‌లు ఎటు మొగ్గుతార‌నేదే అస‌లు కథ‌!