Advertisement

Advertisement


Home > Politics - Opinion

ప్రతి అడుగూ ఆచితూచి!

ప్రతి అడుగూ ఆచితూచి!

చేపడుతున్న సంక్షేమపథకాలు ఎంత గొప్పవైనా కావొచ్చు. వాటివలన ప్రజల జీవితాలకు ఎంతగానైనా మేలు జరుగుతుండవచ్చు. కానీ ఎన్నికల ముంగిట్లో సమీకరణాలు వేరుగా ఉంటాయి. కేవలం ప్రజలకు మంచి చేయడం ఒక్కటే మళ్లీ గెలిపిస్తుందని అనుకోవడం భ్రమ. రాబోయే ఏడాదిలోవేసే ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సి ఉంది. తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ముందుగా సాన పట్టాల్సి ఉంది. 

ప్రత్యర్థులు కట్టగట్టుకుని పొంచి ఉన్నారు. జగన్ ఓటమిని కోరుకుంటూ కొత్త బలాలను కూడగట్టుకుంటున్నారు. అనైతిక బంధాలకు సిద్ధపడుతున్నారు. వీరి ఎత్తుగడల పట్ల పాలకపక్షం అప్రమత్తంగానూ ఉండాలి. 

తెదేపా-జనసేన పొత్తుల గురించి బహుధా చర్చ జరుగుతున్నది. అదే సమయంలో తమ పార్టీ కార్యకర్తల్లో వేడి పుట్టించడానికి విపక్ష నేతలు మధ్యంతరం వస్తుందనే పాట పాడుతున్నారు. పొత్తులు కుదిరినా కుదరకపోయినా, మధ్యంతరం వచ్చినా రాకపోయినా గెలుపు వైఎస్సార్ సీపీ దక్కుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయితే దానిని జగన్ ‘టేకిట్ గ్రాంటెడ్’ గా తీసుకోకూడదు. రాబోయే ఏడాది కాలం మరింత జాగ్రత్తగా ఉంటూ పార్టీకి విజయాన్ని అందించాలి. 

ఎమ్మెల్యేల్లో కొందరి పరిస్థితి దారుణంగా ఉంది. ఖచ్చితంగా ఓడిపోయే స్థితిలో పదోశాతం మంది ఉన్నారు. వారి పట్ల నిర్దయగానూ, నిర్దాక్షిణ్యంగానూ వ్యవహరించి ముందడుగు వేస్తే తప్ప పార్టీని కాపాడుకోవడం కష్టం అవుతుంది. 

రాష్ట్రంలో అందరూ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశారు. నాలుగేళ్లు సాగించిన సంక్షేమ పాలన ఒక ఎత్తు.. ఈ ఏడాదిలో చేయవలసిన రాజకీయం ఇంకో ఎత్తు. ఈ ఏడాదిలో ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సిన అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి స్వతహాగా అందరినీ కలుపుకుపోయే తత్వం. ఆశ్రిత పక్షపాతి అనొచ్చు. తన టీమ్ మొత్తం దిగ్విజయంగా మళ్లీ సెకండిన్నింగ్స్ కొనసాగించాలనే కోరిక ఎక్కువ. ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో వెల్లడించారు. 

గడపగడపకు ప్రారంభించిన తర్వాత.. ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో ‘మీరందరూ మళ్లీ గెలవాలి’ అనే అభిలాషను సీఎం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల, వారసులకు అప్పగించాలనే కోరికవల్ల కొందరు పోటీకి ఇష్టపడకపోయినా.. ‘తప్పదు, ఈ దఫా మీరు పోటీచేయాల్సిందే.. మార్పు చేర్పులు ఉంటే వచ్చే సారికి చూద్దాం’ అని జగన్ చాలా స్పష్టంగానే వారికి చెప్పారు. అదే సమయంలో.. వారికి ధీమా మరీ ఎక్కువైపోకుండా.. ప్రతి నియోజకవర్గంలోనూ విడతలు విడతలుగా తాను సర్వేలు చేయిస్తున్నానని.. సర్వేల ఫలితాలను బట్టి మాత్రమే అభ్యర్థిత్వాలు ఖరారు అవుతాయని, పనితీరు బాగాలేదని సర్వేల్లో తేలిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లు ఇచ్చేది లేదని కూడా సంకేతాలు ఇచ్చారు. 

మరి జగన్ చేయించుకుంటున్న సర్వే ఫలితాలు ఎలా సాగుతున్నాయి. ఏం చెబుతున్నాయి. సర్వే ఫలితాలను తన వద్దనే ఉంచుకుని వెనుకబడి ఉన్నవారిని జగన్ ఎలర్ట్ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎవరి పరిస్థితి ఎలా ఉన్నదనే విషయంలో గ్రేట్ ఆంధ్ర కూడా ఒక  సర్వే చేయించింది. ఈ సర్వే ఫలితాలలో కనీసం పన్నెండు మంది వరకు  ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారు. 

ఓ సారి ఆ జాబితా పరిశీలిద్దాం.. తాడికొండ- ఉండవిల్లి శ్రీదేవి, అమలాపురం- పినిపె విశ్వరూప్, సంతనూతలపాడు- టిజెఆర్ సుధాకర్ బాబు, కదిరి- పి.వెంకట సిద్ధా రెడ్డి, ఉదయగిరి- ఎం.చంద్రశేఖర్ రెడ్డి, పొన్నూరు-కిలారి వెంకట రోశయ్య, పెనుకొండ- మాలగుండ్ల శంకరనారాయణ, మచిలీపట్నం- పేర్ని వెంకటరామయ్య, అనకాపల్లి- గుడివాడ అమర్నాధ్, సత్తెనపల్లి- అంబటి రాంబాబు, భీమిలి- ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వెంకటగిరి- ఆనం రామనారాయణరెడ్డి ఈ జాబితాలో ఉన్నారు. 

ఈ జాబితాలో ఉన్న ఓడిపోగల వీరులపై జగన్ కొంత వరకు అలర్ట్ అయ్యారనే చెప్పాలి. ఎమ్మెల్యే అయిన నాటినుంచి పార్టీ పరువు తీస్తున్న తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి విషయంలో జగన్ అందరికంటె ముందు అలర్ట్ అయ్యారు. అక్కడ చాలా కాలం కిందటే వేరే ఇన్చార్జిని నియమించారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ఆమె ఉండదనే సంకేతాలను పార్టీ శ్రేణులకు, అభిమానులకు అందించారు. తద్వారా.. ప్రజల్లో ఆమె వల్ల రాగల చెడ్డపేరు పార్టీకి అంటుకోకుండా జాగ్రత్త తీసుకున్నారు. 

అదే జగన్మోహన్ రెడ్డి.. వెంకటగిరి ఆనం రామనారాయణ రెడ్డి విషయంలో అలసత్వం ప్రదర్శించారని చెప్పాలి. ఆనం కూడా తనకు మంత్రి పదవి దక్కలేదనే దుగ్ధతో ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ల నుంచి కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకే పాల్పడుతూ వచ్చారు. అయితే పెద్దాయన అనే ఉద్దేశంతో జగన్ మిన్నకుండిపోయారు. ఎటూ ఆనం ఓటమి కూడా ఖరారుగా తన సర్వేలలో తేలుతున్నప్పటికీ.. ఆయనను మార్చడం గురించి శ్రద్ధ పెట్టలేదు. చివరికి ఆనం వ్యాఖ్యలు శృతిమించి పార్టీకి నష్టం చేసే పరిస్థితి వచ్చిన తర్వాత మాత్రమే.. అక్కడ పార్టీకి వేరే ఇన్చార్జిని నియమించారు. 

ఈ వివరాలను గమనిస్తే.. సుమారు పన్నెండు నియోజకవర్గాల్లో పార్టీ ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి ఉండగా.. రెండు నియోజకవర్గాల విషయంలో మాత్రం జగన్ ఇప్పటికే మేలుకున్నారని అనిపిస్తుంది. 

ప్రతి అడుగూ ఆచితూచి..

నిజానికి ఈ జాగ్రత్త సరిపోదు. ఎన్నికలు ఇంకా కేవలం ఏడాది దూరంలో మాత్రమే ఉన్నాయి. ఇక్కడినుంచి ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సి ఉంటుంది. అడేగే తడబడకూడదు. నిర్ణయాలు తీసుకోవడంలో శషబిషలు ఉండకూడదు. మొగమాటాలు పార్టీకి చేటు చేస్తాయి. 

ఏక్షణంలో ఎన్నికలు వచ్చినా.. వైఎస్సార్ కాంగ్రెస్ ఢంకా బజాయించి మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. అయితే ఆ నమ్మకాన్ని అలుసుగా తీసుకోకూడదు. పార్టీ శ్రేణులను మరింతగా ఉత్సాహంగా పనిచేయించే విషయంలో దృష్టిపెట్టాలి. 

ప్రభుత్వంపై బురద చల్లడం అనేది చాలా కామన్ సంగతి అయిపోయింది. అయితే ఊపిరి సలపనివ్వకుండా అన్నివైపులా నుంచి జగన్ మీద దాడి చేస్తున్నారు. ఒకవైపు నారా తండ్రీ కొడుకులు, మరోవైపు వారి దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఎవ్వరూ నోటికి పనిచెప్పకుండా క్షణం కూడా గడపడం లేదు. రాష్ట్రంలో ఏ చిన్న అవాంఛనీయం సంఘటన జరిగినా సరే.. దానిని ప్రభుత్వానికి ముడిపెట్టి అనుచితరీతిలో భ్రష్టు పట్టించడానికి వారు దిగజారి మాట్లాడుతున్నారు. 

నారా కుయుక్తులు ఎదుర్కోవాలి..

ప్రతిపక్షాలు అందరూ ఒక్కటవుతున్నారనే సంగతి ఆల్రెడీ తేలిపోయింది. ‘జగన్ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదు’ అనే నినాదంతో.. రెండేళ్లుగా పవన్ కల్యాణ్ చంద్రబాబు పల్లకీ మోయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. పవన్ ను ఒక బ్రహ్మాస్త్రంలాగా ప్రయోగించి.. బిజెపితో కూడా తన పల్లకీ మోయించుకోవాలని చంద్రబాబునాయుడు అనుకున్నారు. పవన్ కల్యాణ్ ద్వారా నరేంద్రమోడీ వద్దకు రాయబారం కూడా నడిపారు. పచ్చమీడియాలో.. మోడీ తనను నెత్తిన పెట్టుకుంటున్నట్టుగా, తనకు అనల్ప ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా బాకా ఊదించుకున్నారు. కానీ, అవేమీ వర్కవుట్ కాలేదు. 

చంద్రబాబునాయుడు రాజకీయాలను తీవ్రంగా ద్వేషించే సోము వీర్రాజును ఎన్నికలు అయ్యేదాకా పార్టీ సారథిగా కంటిన్యూ చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించిన తర్వాత.. తన పాచిక పారదని చంద్రబాబుకు అర్థమైంది. కొత్త ఎత్తులు వేశారు. వాటి ఫలితమే.. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరడం. 

ఒకవైపు మోడీ భజన చేస్తూనే, మరోవైపు తెలుగుదేశంలో చేరడం అనేది తాజా చంద్ర కుయుక్తి అనుకోవాలి. బిజెపి ఎటూ తనతో కలవడం లేదు గనుక.. ఆ పార్టీలోని కొందరు కీలక నాయకులను ఫిరాయింపజేసి తనతో కలిపేసుకోవడం ఆయన ప్లాన్. అయితే మోడీ ఆగ్రహించకుండా, వారితో తరచుగా మోడీ భజన కూడా చేయిస్తుండడం అతి తెలివి. 

బిజెపి నుంచి వస్తున్న వారు తెలుగుదేశం కంటె, జనసేనతో ఎక్కువ టచ్ లో ఉండే వాళ్లు. ఎక్కువ అనుబంధం కలిగి ఉండే వాళ్లు. అయినా సరే.. వాళ్లు జనసేనలోకి వెళ్లకుండా తెలుగుదేశంలోకి వస్తున్నారంటే.. అది చంద్రబాబు అతి తెలివి మాత్రమే. జనసేన బిజెపికి మిత్రపక్షం గనుక.. ఇక్కడ రాజీనామా చేసి అక్కడకు వెళితే కామెడీగా ఉంటుంది. అందువల్ల తన పార్టీలో చేర్చుకుంటున్నారు. చంద్రబాబు– దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ తో కలిసి మిలాఖత్ కుట్ర రాజకీయాలు నడుపుతున్నారనడానికి ఇదొక పెద్ద నిదర్శనం.

ఇలాంటి మాయోపాయాలు అనేకం వర్తమాన రాజకీయాల్లో చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటి పట్ల కూడా జగన్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ్టి రోజుల్లో రాజకీయం అంటే ఎలా అయిపోయిందంటే.. కేవలం ప్రజలకు మంచి చేయడం మాత్రమే కాదు.. ప్రత్యర్థుల కుట్రలను ఎదుర్కోవడం కూడా ఒక పెద్ద ప్రయాస అయిపోతోంది. 

ఎంత మంచి చేస్తున్నా సరే.. దాని గురించి దుష్ప్రచారం చేయగల ఘనులు బోలెడుమంది తయారవుతున్నారు. వాటన్నింటినీ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే జగన్ రాబోయే ఏడాది రోజుల పాటు ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సి ఉంటుంది. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావాలంటే మరింత అప్రమత్తత అవసరం. 

..ఎల్ విజయలక్ష్మి

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా