సోషల్ మీడియా దెబ్బకు సౌత్ ఇండియా స్టార్ శ్రుతిహాసన్ దారికొచ్చారు. అగ్ర హీరో కమల్‌హాసన్ కుమార్తెగా తెరంగేట్రం చేసిన శ్రుతిహాసన్ తన నటనా ప్రతిభతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.
లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, వృతిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకోవడం చూశాం. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ మెప్పు కోసం మాట్లాడిన మాటలు ఆమెకు చిక్కులు తెచ్చాయి.
హిందీ సినిమాల గురించి శ్రుతిహాసన్ గొప్పగా చెప్పుకెళ్లారు. దీంతో ఇంత కాలం ఆమెను అభిమానిస్తున్న తమిళ, తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు కోపం వచ్చింది. శ్రుతి హాసన్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. బాలీవుడ్ మెప్పు కోసం హిందీ సినిమాలను ప్రశంసిస్తే … మరి తెలుగు, తమిళంతో పాటు సౌత్ ఇండియాలోని ఇతర సినిమాలను తక్కువ చేయడం కాదా? అంటూ నిలదీయ సాగారు.
తనకు సోషల్ మీడియాలో డ్యామేజీ జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన శ్రుతి … అభిమానుల ఆగ్రహానికి తప్పును సరిదిద్దుకున్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
“జాతీయ స్థాయి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను తెలుగు, సౌత్ భాషలకు సంబంధించి మాట్లాడని మాటలను కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాంటి వార్తల్లో నిజం లేదు. రేసు గుర్రం, గబ్బర్ సింగ్ చిత్రాల్లో నటించినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతు న్నాను.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో నేను నటించిన గబ్బర్ సింగ్ చిత్రం నా జీవితాన్నే మార్చేసింది. తెలుగు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ నా గుండెల్లో భాగం అని, ఆ ఇంటర్వ్యూలో కేవలం హిందీ సినిమా కోసం చెప్పానే కానీ ఎక్కడా తెలుగు వర్సెస్ హిందీ అన్నట్టుగా చెప్పలేదు” అని శ్రుతి స్పష్టత ఇచ్చారు. ట్రోల్ చేస్తే తప్ప తప్పును సరిదిద్దుకోని పరిస్థితి చిత్రపరిశ్రమలో కనిపిస్తోంది. అదేదో మాట్లాడేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే ఈ తిప్పలు ఉండేవి కాదు కదా!