సినిమాల కంటే వివాదాలతో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కానీ మాట్లాడాల్సిన విషయాలపై మాట్లాడకుండా, బీజేపీకి లాభించే అంశాలను మాత్రమే నెత్తికెత్తుకుని తన సినీ గ్లామర్‌ను దుర్వినియోగం చేస్తున్నారనే అభిప్రాయాలు క్రమంగా బలపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో యువతులపై అత్యాచారాలు దేశమంతా కదిలించినా… కంగనా మాత్రం నోరు మెదపలేదు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో షూటింగ్‌ల్లో బిజీగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో కంగనా రనౌత్‌పై ప్రముఖ సీనియర్ నటి షబానా ఆజ్మీ ఘాటుగా స్పందించారు. ముంబై మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనాపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బాలీవుడ్‌కు తానే స్త్రీ వాదాన్ని, జాతీయ వాదాన్ని నేర్పించానన్న కంగనా వ్యాఖ్యలపై షబానా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకనైనా అలాంటి మాటలకు ఫుల్స్టాప్ పెట్టి, తన పని తాను చేసుకుంటే మంచిదని కంగనాకు హితవు చెప్పారు.
కంగనాపై ఇంత వరకూ ఏ నటి లేదా నటుడు చేయనంత ఘాటు విమర్శలు షబానా చేశారు. ఇంకా ఆమె ఏమన్నారో తెలుసు కుందాం. ప్రతిరోజూ వార్తల్లో పతాక శీర్షికన ఉండననే భయం ఆమెను పట్టుకున్నట్టుందని ఎద్దేవా చేశారు. అందుకే అన్ని వేళలా వార్తల్లో నిలిచేందుకే వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు కంగనా చేస్తోంటోందని షబానా విరుచుకుపడ్డారు. కంగనా మంచి నటని, నటనపై దృష్టి కేంద్రీకరిస్తే మంచిదని హితవు చెప్పారు.
నిజమైన సమస్యల నుంచి దృష్టిని మళ్ళించే క్రమంలో ఒక ప్లాన్ ప్రకారం కంగనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని షబానా మండిపడ్డారు. గతంలో యాంటి నేషనల్ అంటూ షబానా ఆజ్మీతో పాటు ఆమె భర్త జావేద్ అక్తర్‌పై కంగనా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కంగనాపై షబానా ఘాటు విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది.