విశాఖ నుంచే పల్లె నిద్ర

ఏపీ సీఎం జగన్ విశాఖకు వచ్చేస్తున్నారు. ఈ వార్త చాలా సార్లు చదివినట్లు గుర్తు అనుకుంటే ఈసారి పప్పులో కాలేసినట్లే. ఈసారి పక్కాగా జగన్ విశాఖకు వస్తున్నారు. ముహూర్తం కూడా కన్ ఫర్మ్ అయింది.…

ఏపీ సీఎం జగన్ విశాఖకు వచ్చేస్తున్నారు. ఈ వార్త చాలా సార్లు చదివినట్లు గుర్తు అనుకుంటే ఈసారి పప్పులో కాలేసినట్లే. ఈసారి పక్కాగా జగన్ విశాఖకు వస్తున్నారు. ముహూర్తం కూడా కన్ ఫర్మ్ అయింది. ఉగాది నుంచి జగన్ విశాఖ వాసి అయిపోతున్నారు. మార్చి 22న జగన్ విశాఖకు తన మకాం మార్చేస్తున్నారు.

ఆయన ఉండేందుకు గెస్ట్ హౌస్ కూడా రెడీ చేసి పెట్టారు. విశాఖ పోర్ట్ వారు ఆధీనంలో ఉన్న గెస్ట్ హౌస్ లో వారంలో రెండు రోజుల పాటు జగన్ బస చేస్తారు. ప్రతీ సోమ మంగళవారాలు జగన్ విశాఖలో ఉంటూ వివిధ ప్రభుత్వ శాఖల  సమీక్షలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఉగాది నుంచి జగన్ పార్టీ పరంగా కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పల్లె నిద్ర పేరిట జగన్ ఒక రాత్రి ఉంటారు. ఆ కార్యక్రమం కూడా విశాఖ నుంచే మొదలవుతుంది అని అంటున్నారు. విశాఖలో రెండు రోజులు ఉన్న తరువాత బుధవారం పల్లె నిద్ర చేసుకుని గురువారం తాడేపల్లికి ఆయన చేరుకుంటారు. అక్కడ మూడు రోజుల పాటు పాలన ఉంటుంది అంటున్నారు.

జగన్ తాడేపల్లిలో నిత్యం చేసే సమీక్షలు అన్నీ ఇక మీదట విశాఖ నుంచి చేస్తారు అని అంటున్నారు. వర్కింగ్ డే ఆరంభం అయిన మండే నాడు జగన్ విశాఖలో ఉంటారు. అలా ఆయన విశాఖలో పాలన చేయడం ద్వారా రాజధాని కళను తీసుకువస్తారు అని అంటున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లుని ప్రవేశపెడతారు అని వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తూంటే జగన్ స్పీడ్ పెంచేశారు అని అంటున్నారు. విశాఖలో ఉగాది వేడుకలను ఈసారి జగన్ జరుపుకుంటారు అని అంటున్నారు.