అయ్యో చంద్రబాబు.. ఇంత నీరసమైన ప్రసంగమా?

మంచో చెడో తెలియదు గానీ.. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ ను సారథిగా నియమించిన తర్వాత.. ఆ పార్టీకి కొంత జోష్ వచ్చింది. ఆయన సంపదల పరంగా పుష్కలంగా ఉన్నవాడు గనుక.. పార్టీ…

మంచో చెడో తెలియదు గానీ.. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ ను సారథిగా నియమించిన తర్వాత.. ఆ పార్టీకి కొంత జోష్ వచ్చింది. ఆయన సంపదల పరంగా పుష్కలంగా ఉన్నవాడు గనుక.. పార్టీ భారాన్ని మోయడానికి ముందు వెనుక చూడడం లేదు. కొన్నాళ్లు గడిచిన తర్వాత.. ఆయనకు తత్వం బోధపడితే పరిస్థితిలో మార్పు వస్తుందేమో తెలియదు. 

కాసాని జ్ఞానేశ్వర్ పుణ్యమా అని.. చంద్రబాబునాయుడు తెలంగాణలో కూడా తన పార్టీ బతికే ఉన్నదనే భావనను అప్పుడప్పుడూ పొందగలుగుతున్నారు. తాజాగా ఆయన తెలంగాణలో ఇంటింటికీ తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాసాని పూనుకుంటున్నారు గనుక.. కార్యక్రమానికి జెండా ఊపేసి.. ఓ ధర్మోపన్యాసం ఇవ్వడం మాత్రమే చంద్రబాబు పని. 

నిజానికి ఈ ఇంటింటికీ తెలుగుదేశం అనే కార్యక్రమం.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమానికి కాపీ. ఏమాత్రం సిగ్గుపడకుండా.. జగన్ కాన్సెప్టును కాపీ చేసుకున్నారు. అక్కడంటే జగన్మోహన్ రెడ్డి సర్కారు రాష్ట్రంలో ప్రతి పేద ఇంటికి ఏదో ఒక ప్రభుత్వ పథకం అందేలాగా కార్యక్రమాలు చేపడుతున్నది గనుక.. ఇలా వెళ్లగలరు. కానీ తెలంగాణలో రెండు దశాబ్దాలుగా చితికిపోయి శవాసనం వేసి ఉన్న తెలుగుదేశం నాయకులు.. ఏం చెప్పడానికి ఇంటింటికీ వెళ్లగలరు. అసలే తెలుగుదేశాన్ని, తెలంగాణ వ్యతిరేక పార్టీగా ఇక్కడి ప్రజలు ద్వేషిస్తున్నారు. అందుకే ఆ పార్టీకి సమర్థంగా సమాధి కట్టేశారు. అయినా చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలకు ఒక హితోపదేశం చేశారు. 

ఇలాంటి ఆపత్సమయాలకోసం చంద్రబాబునాయుడు వద్ద రెడీమేడ్ స్క్రిప్టు ఒకటి ఉంటుంది. ఎన్టీఆర్ తెలంగాణ గడ్డమీదనే తెలుగుదేశం పార్టీ పెట్టారు. సంక్షేమం అనేది తెలుగుదేశంతోనే ప్రారంభం అయింది. సైదరాబాద్ ఘనత నాదే. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి రామారావు ఆనాడు తెలుగుదేశం పెట్టారు.. లాంటి పనికిమాలిన విషయాలను తన ప్రసంగంలో పార్టీ కార్యకర్తలకు ఉద్బోధించి.. ఇంటింటికీ వెళ్లి ఇదే విషయాలు చెప్పాలని ఆయన ఉపదేశం చేస్తున్నారు. 

రామారావు పార్టీ ఎక్కడ పెడితే ప్రజలకు ఏంటి? ఆయన రెండు రూపాయల బియ్యం వంటి సంక్షేమానికి శ్రీకారం చుట్టారు అంతవరకు ఓకే. కానీ, తెలంగాణ కోసం ప్రత్యేకించి తెలుగుదేశం ఏం చేసిందని ఏం చెప్పుకుంటారు. చీటికీ మాటికీ హైటెక్ సిటీ అని చెప్పుకునే చంద్రబాబు ఆ ప్రాంతాభివృద్ధిని కూడా సీమాంధ్రుల కోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంగానే ఇప్పటికీ పలువురు గుర్తిస్తారు. పైగా.. సైబరాబాద్ ఏర్పడడంలో చంద్రబాబు కృషికంటె అదివరకటి కాంగ్రెసు నేతల కృషి కూడా ఉన్నదనే వారూ ఉన్నారు. 

ఇలాంటి సమయంలో.. పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే..  వారిని ఉత్తేజితుల్ని చేసే మాటలుండాలి. పాపం వయసుపైబడిన చంద్రబాబునాయుడు వద్ద అలాంటి స్క్రిప్టు లేదు. ఏదో ఉబుసుపోని మాటలతోనే వారికి ప్రేరణ ఇవ్వాలనుకుంటున్నారు. ఇలాంటి నీరసనమైన మాటలను చంద్రబాబునుంచి.. తెలంగాణ ప్రజల లోగిళ్లలోకి మోసుకువెళ్లడం వల్ల, అసలే శవాసనంలోని ఆ పార్టీ లేచి మనగలుగుతుందా? అనేది సందేహం.