60 ఏళ్ల తర్వాత లోగో మార్చిన నోకియా

నోకియా.. ఈ పేరు చెప్పగానే నీలం రంగులో అక్షరాలు ఇలా ప్రత్యక్షమై, రెండు చేతులు అలా కలవడం గుర్తొస్తుంది. ఇప్పుడంటే చాలా రకాల స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి కానీ, ఒకప్పుడు మొబైల్ రాజ్యంలో నోకియానే…

నోకియా.. ఈ పేరు చెప్పగానే నీలం రంగులో అక్షరాలు ఇలా ప్రత్యక్షమై, రెండు చేతులు అలా కలవడం గుర్తొస్తుంది. ఇప్పుడంటే చాలా రకాల స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి కానీ, ఒకప్పుడు మొబైల్ రాజ్యంలో నోకియానే రారాజు. అలా ఆ లోగో అందరికీ గుర్తుండిపోతుంది.

ఇన్నాళ్లకు/ఇన్నేళ్లకు నోకియా తన లోగోను మార్చింది. అక్షరాల డిజైన్లలో మార్పుచేర్పులు చేయడంతో పాటు, మరీ ముఖ్యంగా ఆ నీలం రంగును వదిలించుకుంది. 60 ఏళ్ల సంస్థ చరిత్రలో, కంపెనీ లోగోను మార్చడం ఇదే తొలిసారి.

బార్సినోలాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ఈ లోగోను ఆవిష్కరించారు. టెలికం ఉపకరణాల తయారీలో మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్లేందుకు, మార్కెట్లో కొత్తదనం తీసుకొచ్చేందుకు లోగోను మార్చినట్టు సంస్థ ప్రకటించుకుంది.

టెలికం కంపెనీలకు ఉపకరణాలు, విడిభాగాలు అందించడంలో గణనీయమైన వృద్ధి సాధించిన నోకియా సంస్థ, త్వరలోనే తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించబోతున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా ఫ్యాక్టరీ ఆటోమేషన్, డేటా సెంటర్ల ఏర్పాటుపై నోకియా ప్రధానంగా దృష్టిసారిస్తోంది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీలకు గట్టిపోటీ ఇవ్వబోతోంది.

భారత్ ను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ గా పేర్కొన్న నోకియా, ప్రస్తుతం దేశంలో తమకు తక్కువ మార్జిన్ ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తామని చెబుతోంది. ఇక అమెరికాలో ఈ ఏడాది ద్వితీయార్థానికి మరింత బలపడతామంటోంది నోకియా. తాజా లోగో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.