అవంతి మార్క్‌ పాలిటిక్స్‌

మంత్రిగా ఏడు నెలల పాలనలో సొంత పార్టీలో ఒంటరి అయిన  అవంతి శ్రీనివాసరావు ఇపుడు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. ఎమ్మెల్యేలను చేరదీసే పనిలో పడ్డారు. ఈ మధ్యనే ఎమ్మెల్యేలకు అవంతి శ్రీనివాసరావు  ఆత్మీయ విందు…

మంత్రిగా ఏడు నెలల పాలనలో సొంత పార్టీలో ఒంటరి అయిన  అవంతి శ్రీనివాసరావు ఇపుడు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. ఎమ్మెల్యేలను చేరదీసే పనిలో పడ్డారు. ఈ మధ్యనే ఎమ్మెల్యేలకు అవంతి శ్రీనివాసరావు  ఆత్మీయ విందు ఇవ్వడం ద్వారా ప్రసన్నం చేసుకున్నారు.

తాను అందరివాడినని చెప్పుకున్నారు. ఇక, సొంత సామాజికవర్గం కూడా మంత్రి పట్ల గుర్రుగా ఉంది. దాంతో,  ఆయన ఆత్మీయ సమారాధన పేరిట భారీ ఎత్తున హడావుడి చేశారు. వారితో కలసి విందారగించి తాను సొంతమనిషిని అనిపించుకుంటున్నారు.. జీవీఎంసీ ఎన్నికలు ముందుండం, జిల్లా మంత్రిగా వైసీపీని గెలిపించాల్సిన బాధ్యత తనపైన ఉండడంతో అవంతి ఇపుడు దారిలోకి వస్తున్నారని అంటున్నారు.

పైగా, స్ధానిక ఎన్నికలలో గెలిపించకపోతే మంత్రి పీఠానికే ముప్పు అని అధినేత, ముఖ్యమంత్రి జగన్‌ మంత్రులందరికీ కచ్చితమైన హెచ్చరికలు జారీ చేయడంతో అవంతి వంటి వారు ముందు జాగ్రత్తపడుతున్నారని అంటున్నారు.

పైగా, జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న కురసాల కన్నబాబుకు జిల్లాపై పట్టు ఉండడంతో పాటు, వైసీపీ నేతలు అవంతి మీద ఫిర్యాదు చేయడంతో ఆయన సైతం మంత్రిగారికి పద్దతి మార్చుకోవాలని చెప్పాలని ప్రచారం సాగుతోంది. మొత్తానికి చూసుకుంటే అవంతి ఇపుడు తాను మారిన మనిషిని అంటున్నారు.

అయితే, జిల్లాలో అధికారులతో సైతం మంచిగా మెలగడంతో పాటు, జిల్లా పాలనను గాడిలో పెట్టడంలో కూడా అవంతి నేర్పు బయటపడుతుందని అంటున్నారు. చూడాలి అవంతి ఎలా జిల్లా రాజకీయాలలో తనదైన మార్కును చాటుకుంటారో.