మహానగరం-చంద్రబాబు కాన్సెప్ట్ – అందిపుచ్చుకున్న జగన్

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల కొత్త విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాధిచడం సహజంగానే ఏపీ అంతటా చర్చనీయాంశం అవుతోంది. ఇందులో ఆయన రాజకీయ  ఉద్దేశాలు ఏమిటి? పరిపాలనపరమైన లక్ష్యాలు ఏమిటి?…

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల కొత్త విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాధిచడం సహజంగానే ఏపీ అంతటా చర్చనీయాంశం అవుతోంది. ఇందులో ఆయన రాజకీయ  ఉద్దేశాలు ఏమిటి? పరిపాలనపరమైన లక్ష్యాలు ఏమిటి? అన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. రెండు, మూడు జిల్లాలలో కొన్నివర్గాలకు మినహాయించి మిగిలిన రాష్ట్రం అంతటికి దీనిపై వ్యతిరేకత రాదు.

పైగా పెద్ద ఎత్తున సానుకూలత ఏర్పడే పరిస్థితిని జగన్ తెచ్చుకున్నారు.  గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ పరిసరాలలో రాజధానిని ప్రతిపాధించినప్పుడు జగన్ మద్దతు ఇచ్చిన మాట నిజమే. ఇప్పుడు ఆయన మాట మార్చినట్లు అవుతుందని టిడిపి వాదిస్తోంది. జగన్ ఈ విమర్శను ఎదుర్కోవడానికి వీలుగా ఇక్కడ శాసన వ్యవస్థ రాజధాని ఉంటుందని అన్నారు. 

ఇది అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి గాని, ఇతరత్రా ఆస్తుల విలువలు బాగా పెరగాలని ఆశించేవారికి గాని పెద్దగా రుచించకపోవచ్చు. ఇప్పుడు జగన్ కు ఈ కొత్త ఆలోచనలకు అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడే అని చెప్పాలి. అదెలాగో పరిశీలించవచ్చు. వచ్చిన గొప్ప సదవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. అసలు రాజధాని అంటే ఏమిటన్నదానిపై ఒక స్పష్టత లేకుండా వ్యవహరించారు.

భూమి స్వరూపాలు, స్వభావాల గురించి పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు చెత్త బుట్టలో పడేశారు. ఎవరైనా, అదేమిటి? ఇదేమిటి అని అడిగితే అందరిని రాజధానికి వ్యతిరేకం అని బెదిరించేవారు. దానికి తోడు ఓటు కు నోటు  కేసులో పట్టుబడిన తర్వాత రాత్రికి,రాత్రే చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిపోవల్సి వచ్చింది. 

చంద్రబాబు రాజధాని విజయవాడ పరిసరాలలో వస్తుందని అని చెప్పి, ఆయన స్పెక్యులేషన్ కు అవకాశం ఇచ్చి చాలామందికి నష్టం చేశారు. కొందరు టిడిపి నేతలు, చంద్రబాబు సన్నిహితులు మాత్రం రాజధాని ఎక్కడ వస్తుందో అక్కడ పరిసరాలలో కొనుగోలు చేసుకోగలిగారు. తద్వారా వారిలో కొందరు లాభపడ్డారు. ఆ తర్వాత లాండ్ పూలింగ్ తంతుకు శ్రీకారం చుట్టారు.

ప్రభుత్వ భూములు ఉన్న ప్రదేశాలను వదలిపెట్టి ప్రైవేటు భూముల సేకరణకు పూనుకున్నారు. కొందరు రైతును భయపెట్టారు. మరికొందరి పంటలను తగులపెట్టారు. కొంతమంది స్వచ్ఛందంగా ఇచ్చారు. అసలు అంత భారీగా వేల ఎకరాల భూమి తీసుకోవడం సరికాదని, అది గుదిబండ అవుతుందని ఎందరు చెప్పినా ఆయన పెడచెవిన పెట్టారు. మూడు పంటల పండే భూములు అన్న కనికరం కూడా లేకుండా చంద్రబాబు వ్యవహరించారు.

ఆ తర్వాత అనేక  శంకుస్థాపనల ప్రహసనాలు గావించారు. ఏదో జరిగిపోతోందన్న భ్రమలు కల్పించడానికి విశ్వయత్నం చేశారు. విశేషం ఏమిటంటే టిడిపి ఆఫీస్ ను మాత్రం జాతీయ రహదారిపక్కన నిర్మించుకుని, తాత్కాలిక భవనాల పేరుతో సచివాలయం, అసెంబ్లీ ఎవరికి అందుబాటులో లేని చోట సుమారు ముప్పై, నలభై కి.మీ.దూరంలో నిర్మించారు.

సరైన రోడ్డు, డొంక లేని చోట నిర్మాణం చేశారు. అవి కూడా చాలీచాలని భవనాలు కావడం మరో ప్రత్యేకత. అదే శాశ్వత స్థాయిలో జాతీయ రహదారికి కాస్త దగ్గరలో ఈ భవనాలను నిర్మించి ఉంటే ఇవ్వాళ ఈ పరిస్థితికి ఆస్కారం ఉండేది కాదు. చంద్రబాబు చేసిన నిర్వాకాలన్ని ఆయన చేసిన పాపాలుగా పరిగణించి ప్రజలు ఘోరంగా ఓడించారు. అయినా చంద్రబాబు తన వాదన వదలలేదు. తాను ఏదో అంతర్జాతీయ నగరం నిర్మాణం చేసేవాడినని ప్రచారం చేపట్టారు. 

అసలు అంత పెద్ద నగరం అయితేనే పదమూడు జిల్లాలకు ఆదాయం వస్తుందని ప్రచారం చేశారు. అందుకు లక్షల కోట్ల రూపాయలు అవసరం అని మాత్రం చెప్పరు. ముఖ్యమంత్రి జగన్ కు ఒక రకంగా చంద్రబాబే ఐడియా ఇచ్చినట్లయింది. పెద్ద నగరాలైతేనే ఆదాయ వనరు అవుతుందని చంద్రబాబు చేసిన ప్రచారం జగన్ కు ఉపయోగపడింది. లక్ష కోట్లో, రెండు లక్షల కోట్లో వ్యయం చేసి కొత్త నగర నిర్మాణం చేయడం సాద్యం కాదు కనుక.

ఐదువేల కోట్లు పెట్టి బాగా పెరిగిన విశాఖపట్నంలో ఎక్జిక్యూటివ్ రాజధాని పెడితే మంచిదని ఆయన భావించినట్లు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు అసలు మాట్లాడడానికి లేదు. ఎందుకంటే పెద్ద నగరాలుగా మార్చితే, ఏపీకి ఒక పెద్ద రాజధాని నగరం ఉంటే అదే అందరిని పోషిస్తుందన్నది ఆయన వాదన. ఆ వాదన నిజమే అయితే అందుకు విశాఖ బాగా స్యూట్ అయ్యే నగరం అవుతుంది. 

మహానగరం కాన్సెప్ట్ తో పాటు అధికార, అభివృద్ది వికేంద్రీకరణ వాదన కూడా జగన్ కు లాభం తెచ్చినట్లయింది. అయినా చంద్రబాబు తన విమర్శలు వదలలేదు. పైగా కొత్తగా అమరావతి సెల్ప్ ఫైనాన్సింగ్ నగరంగా అభివృద్ది చేస్తున్నామని ప్రచారం చేయడం ఆరంభించారు. వాస్తవంగానే సెల్ప్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అయితే కేంద్రాన్ని లక్ష కోట్లు ఇవ్వాలని చంద్రబాబే గతంలో ఎందుకు కోరారన్నదానికి ఆయన సమాధానం చెప్పరు.

నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏ ప్రభుత్వం కూడా లక్ష లేదా రెండు లక్షల కోట్లు ఖర్చు చేయలేదు. కేంద్రం ఇవ్వలేదు. అంటే దాని ప్రకారం అమరావతి నగరం చంద్రబాబు చెబుతున్న స్థాయికి చేరుకోవాలంటే కొన్ని దశాబ్దాలు ఆగాలి. అన్ని ఏళ్లు ఇతర ప్రాంతాలలో అసలు అభివృద్ది జరగడం కూడా కష్టమే అవుతుంది. 

ఎందుకంటే ప్రభుత్వ ఆదాయంలో సింహభాగం అమరావతిలోనే ఖర్చు చేయడానికి సరిపోతుంది. ఇప్పటికే ఏపీని చంద్రబాబు రెండున్నర లక్షల కోట్ల అప్పుల పాలు చేశారు. ఇంకా ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేయాలో తెలియని పరిస్థితి. ఈ నేపధ్యంలో జగన్ వ్యూహాత్మకంగా విశాఖను కార్యనిర్వాహక రాజధాని ఆలోచనను తెరపైకి తెచ్చారు. దాంతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర నుంచి తూర్పు గోదావరి వరకు ఆయనకు సానుకూల సంకేతాలు వచ్చాయి.

ప్రతిపక్ష టిడిపికి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ వంటివారు దీనికి అనుకూలంగా ప్రకటనలు చేశారు. అలాగే రాయలసీమ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని కర్నూలుకు హైకోర్టు ప్రతిపాధన చేయడంతో రాయలసీమలో అంతా సంతోషపడ్డారు. ఎటు తిరిగి ఈ మొత్తం ప్రక్రియ జీర్ణించుకోలేనిది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటివారే. 

నిపుణుల కమిటీ నివేధిక రాకుండానే జగన్ ఈ ఆలోచనలను బయటపెట్టడం మంచిదేనా అన్న చర్చ ఉంది. ఈ విమర్శను ఆయన భరించవలసిందే. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే అమరావతిలో చంద్రబాబు టైమ్ లో సేకరించిన భూముల రైతులకు ఎలా ప్లాట్లు ఇస్తారు? వారి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. కొన్ని గ్రామాల వారు నిరసనలు చెబుతున్నారు. తప్పు లేదు.

కాని వారిలో కొందరు ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారట. అది చాలా తప్పు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి జగన్ వచ్చి వెళితే పసుపు నీళ్లు చల్లి కొందరు అక్కడ తమ దురహంకారం చూపారు. అలా అవమానించడం వల్ల ఇప్పుడు నష్టం జరుగుతోందని నమ్ముతున్నవారు కూడా ఉన్నారు. కాని జగన్ ఆలోచన రాయలసీమ, ఉత్తరాంద్రలను కూడా సంతృప్తి పరచడం కావచ్చు. 

అమరావతిలో శాసనసభ, శాసనమండలి ఉంటాయని జగన్  సూచన ప్రాయంగా చెప్పారు. ఇవి కాకుండా ప్రభుత్వం తీసుకున్న భూమి ఉంది కనుక, ఇక్కడ నుంచి సచివాలయం తరలిస్తే, ప్రత్యామ్నాయంగా ఏమి చేస్తారన్నదానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడు పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక్కడ మరో విషయం గమనించాలి. గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఈ పరిణామం వ్యతిరేకత తెచ్చేది అయితే ప్రజలలో నిరసనలు బాగా వచ్చేవి. అదేమీ లేదు.

కేవలం భూములు ఇచ్చిన కొన్ని గ్రామాలలో కొంత మంది మాత్రమే చేశారు. అలాగే టిడిపి నేతలు దేవివేని ఉమ వంటివారు కాస్త హడావుడి చేశారు. అయినప్పటికీ, నిరసనలు ఉన్నా, లేకున్నా, ప్రభుత్వం కృష్ణా, గుంటూరు జిల్లాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రణాళికలను ఇక్కడ ప్రకటించాలని చెప్పక తప్పదు. 

రాజకీయంగా చూస్తే ఉత్తారంద్ర, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిలో కొంత భాగం వరకు అలాగే రాయలసీమ, నెల్లూరు,ప్రకాశం జిల్లాలో కొంత భాగం వరకు జగన్ కు కలిసివచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృష్ణ, గుంటూరు జిల్లాలలో కొంత వ్యతిరేకత రావచ్చు. అయితే ప్రత్యామ్నాయ ప్రణాళిక సమగ్రంగా ఉంటే అది తగ్గవచ్చు.

ఇదంతా తెలుగుదేశం పా్ర్టీకి పెద్ద చిక్కే అవుతుంది. అసలే రాయలసీమలో టిడిపి కునారిల్లితే ఇప్పుడు హైకోర్టు నిర్ణయంతో మరింత కుదేలు అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు టిడిపి ఎమ్మెల్సీలుగా ఉన్న శమంతకమణి, కె.ఇ.ప్రభాకర్ వంటివారు కర్నూలులో హైకోర్టు పెట్టాలని డిమాండ్ చేసేవారు. అలాంటివారు ఇప్పుడు సైలెంట్ అవ్వాల్సి వస్తోంది. బిజెపి కూడా రాయలసీమకు హైకోర్టు ఇవ్వాలని తీర్మానం చేసింది. 

అందువల్ల ఆ పార్టీ కూడా మద్తతు ఇవ్వకతప్పదు. కాకపోతే సచివాలయం మార్చవద్దని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖ పేరును కార్యనిర్వాహక రాజధాని అన్న మాట బయటకు రాగానే ఉత్తరాంద్ర అంతటా విపరీతమైన ఆనందం కనిపించింది. ఇది కూడా టిడిపికి పెద్ద షాకే. టిడిపికి 2019లో మినహాయించి, అంతకుముందు జరిగిన అన్ని ఎన్నికలలో టిడిపికి బాగా పట్టు ఉన్న ప్రాంతంగా ఉత్తరాంద్ర నిలబడింది. దానిని జగన్ దెబ్బకొట్టినట్లయింది. 

ఇక  నిపుణుల కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందో తెలియదు. అందులో ఉన్న సిఫారస్ లు వచ్చాక మరింత స్పష్టత వస్తుంది. ఈలోగా జగన్ అసెంబ్లీలో ప్రకటన చేయడంతో రాజకీయంగా పెద్ద చర్చగా మారింది. మొత్తం మీద తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా విశాఖ, అమరావతి, కర్నూలులో నిర్మాణాలు ఒక ఏడాది,రెండేళ్లలో పూర్తి చేసి అన్ని కార్యకలాపాలు సజావుగా నిర్వహించగలిగితే జగన్ ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. పైగా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం కూడా బాగా అందుబాటులోకి వచ్చినందున ఏ ఆఫీస్ ఎక్కడ ఉన్నా పనులకు ఆటంకం ఉండకపోవచ్చు. 

అయితే జగన్ ప్రతిపాదనలు అమలులో ఏమాత్రం గందరగోళం జరిగినా ఆయనకు రాజకీయంగా నష్టం వాటిల్లుతుంది. ఇప్పటివరకు అన్ని ప్లాన్ ప్రకారం చేసుకుంటూ జగన్ ముందుకు వెళుతున్నందున, ఇందులో కూడా సపలం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల భయం కావచ్చు.

-కొమ్మినేని శ్రీనివాసరావు