సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏపీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు వింటే ‘ఔరా’ అనిపించేలా ఉన్నాయి. ఇంతకూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. రాజధాని కేసుకు సంబంధించి సోమవారం హైకోర్టులో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అంశానికి సంబంధించి పలు అభ్యర్థనలతో దాఖలైన అనుబంధ వ్యాజ్యాలపై మంగళవారం నుంచి రోజువారీ విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
ఇందులో భాగంగా నేటి నుంచి విచారించాల్సిన అనుబంధ వ్యాజ్యాలను ఇతర వ్యాజ్యాల నుంచి వేరుపరిచింది. ఈ విధంగా వేరు చేసిన వాటిల్లో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యాజ్యాలు కూడా ఉన్నాయి. రాజధాని వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా రాజధాని తరలింపునకు సంబంధించిన అనుబంధ వ్యాజ్యాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా , ప్రధాన వ్యాజ్యా లను మాత్రం భౌతిక విచారణ ద్వారా విచారిస్తామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ త్రిసభ్య ధర్మాసనానికి ఓ అభ్యర్థన చేశారు.
అదేంటంటే… రాజధాని తరలింపు వ్యాజ్యాలకన్నా ముందు పేదలకు ఇళ్ల స్థలాల మంజూరుకు సంబంధించిన వ్యాజ్యాలను విచారించాలని ఏజీ విన్నవించారు. అంతేకాదు, పేదల ఇళ్ల స్థలాల వ్యాజ్యాలపై త్వరగా విచారణ జరపాలని హైకోర్టును సుప్రీంకోర్టు కోరిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి ఏజీ తీసుకెళ్లారు.
ఏజీ అభ్యర్థనపై త్రిసభ్య ధర్మాసనం స్పందిస్తూ… సుప్రీంకోర్టు చాలా చెబుతుందని, వాటన్నింటిపై తామేం చేయాలని ప్రశ్నించింది. ముందు రాజధాని తరలింపు వ్యవహారాన్నే తేలుస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. మరి ధర్మాసనం వ్యాఖ్యలను ఎవరెవరు ఎలా తీసుకుంటారో మరి!