ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన అధిపతులు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల మౌనం రాయలసీమకు శాపంగా మారిందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు ఎలాగైనా సాగు, తాగునీటిని ఇవ్వాలని జగన్ సర్కార్ గట్టి పట్టుదలతో ఉంది. దీంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ సర్కార్ చేపట్టింది. దీనిపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని ఆదేశించాలని కోరుతూ కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా పాలక ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి.
మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో సీమ ఎత్తిపోతల పథకంపై రాజకీయ పార్టీల వైఖరి అందుకు భిన్నంగా ఉంది. రాయలసీమ నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కనీస నైతిక మద్దతు ఇవ్వకపోగా, మౌనంతో తెలంగాణకు పరోక్షంగా అండగా నిలిచారనే విమర్శలు లేకపోలేదు.
మరో ప్రతిపక్ష పార్టీ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దేనిపై స్పందిస్తారో, దేనిపై మౌనంగా ఉంటారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కనీసం తన రాజకీయ పంథా ఏంటో పవన్‌కైనా అర్థమవుతోందో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మాట ఎందుకు అనాల్సి వస్తున్నదంటే … బీజేపీ -జనసేన మిత్రపక్ష పార్టీలు. సమస్యలపై కలిసి పోరాటం చేస్తామని, ఇద్దరిదీ ఒకే మాట, ఒకే బాట అన్నట్టు ముందుకు సాగుతామని పొత్తు కుదిరిన సందర్భంలో రెండు పార్టీల ముఖ్యనాయకులు సంయుక్త ప్రకటన చేశారు. కానీ ఆచరణకు వస్తే … మచ్చుకైనా అలాంటివి కనిపించడం లేదు. ఎవరి దారి వారిదే అన్నట్టు బీజేపీ – జనసేన నేతలు వ్యవహరిస్తున్నారు.
కృష్ణా, గోదావరి నదీ బేసిన్‌ల పరిధిలో నెలకొన్న జల వివాదాలపై చర్చించేం దుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం మంగళవారం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంట లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు కె.చంద్రశేఖర్‌రావు, వై.ఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు.
ట్రిబ్యునల్ కేటాయించిన జలాలు మా రాష్ట్ర హక్కు … వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా దుర్భిక్ష రాయల సీమ, నెల్లూరు జిల్లాల్లో తాగు, సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామన్న విషయాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు స్పష్టం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారు.
మరోవైపు అపెక్స్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ ఓ ప్రకటన విడుదల చేయడంతో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ఓ లేఖ రాశారు. రాయలసీమకు నీటి తరలింపు అంశంలో ఆంధ్రప్రదేశ్‌కు మద్దతు ఇవ్వాలని ఆ లేఖలో కోరడం విశేషం.
మరి బీజేపీ మిత్రపక్ష పార్టీగా జనసేన వైఖరి ఏంటి? పేరుకు బీజేపీతో పొత్తు కుదుర్చుకుని, విధానాల పరంగా టీడీపీ ఎజెండాను జనసేన మోస్తోందనే విమర్శలకు తాజాగా అపెక్స్ కమిటీ సమావేశంపై పవన్‌కల్యాణ్ మౌనమే నిదర్శనమంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చే సరికి ఏపీ సర్కార్‌కు ఏపీ బీజేపీ శాఖ గట్టిగా మద్దతు పలుకుతుందనేందుకు తాజాగా ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటనతో పాటు కేంద్రానికి రాసిన లేఖను ఉదహరిస్తున్నారు.
బీజేపీ ప్రకటనలో ఏముందో చూద్దాం.
‘పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకు నీటి సరఫరా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిమితులకు లోబడి వ్యవహరిస్తుంది. రాజకీయ లబ్ధి కోసం కేంద్రంపై చేసే విమర్శలను తెలంగాణ సీఎం కేసీఆర్ తక్షణమే ఉపసంహరించుకోవాలి. అపెక్స్ కమిటీ మీటింగ్‌లో రాయలసీమ అంశంతో పాటు కృష్ణా, గోదావరి నదులపై పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టుల విష యంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీటుగా స్పందించాలి.
రాయలసీమ ప్రాంతానికి న్యాయబద్ధంగా నీటి కేటాయింపులు జరగాలి. అందుకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహకారాన్ని కోరుతున్నాం. రాష్ట్రాల అభివృద్ధి తప్ప ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉండరాదు. రాష్ట్రాల్లో వ్యతిరేక భావనలు పెంచడం బీజేపీ విధానం కాదు’ అని ఆ పార్టీ తేల్చి చెప్పింది.
ఈ ప్రకటనకు తోడు కేంద్రమంత్రికి సోము వీర్రాజు మరో లేఖ రాయడం విశేషం. ఆ లేఖలో ఏముందంటే… ‘పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా వ్యవహరించిన తీరులోనే అపెక్స్ కమిటీ భేటీలో రాయలసీమకు నీటి తరలింపు అంశంలో ఆంధ్రప్రదేశ్‌కు మద్దతివ్వాలి. రెండు రాష్ట్రాలకు నష్టం జరగకుండా నీటి కేటాయింపులు జరపాలి’ అని లేఖలో కోరారు.
కనీసం బీజేపీతో కలిసి సంయుక్తంగా జనసేన ప్రకటన విడుదల చేసి వుంటే పవన్‌కల్యాణ్ గౌరవం పెరిగేది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని విజయవంతంగా ప్రభుత్వం చేపడితే ముఖ్యమంత్రి జగన్‌కు రాజకీయంగా ఎక్కడ మంచి పేరు వస్తుందో ననే భయంతో చంద్రబాబు మౌనంగా ఉంటూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. బాబు పంథానే పవన్ కూడా అనుసరించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబుకు ఆ ప్రాంతమంటే విపరీతమైన అక్కసును పెంచుకున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు.
ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో 52 అసెంబ్లీ సీట్లలో కేవలం మూడింటిలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో రాజకీయంగా తనను ఆదరించని సీమ కరవును పారదోలేందుకు తాను మాత్రం ఎందుకు సహకరించాలనే కుట్ర, విషపూరిత ఆలోచనలు ఆయనలో ఉన్నాయి. బాబు మాటను పవన్ జవదాటరని ఎప్పటి నుంచో అందరూ చర్చించుకుంటున్న మాటే.
ఇప్పుడు మరోసారి అది నిజమేనని పవన్ మౌనంతో ఓ సందేశాన్ని ఏపీ సమాజానికి పంపారు. జగన్‌పై రాజకీయ కక్షను కరవు ప్రాంతంపై ప్రదర్శిస్తూ తమ అక్కసు తీర్చుకుంటున్నారనే విమర్శలకు బాబు, పవన్‌ల మౌనం మరింత బలం కలిగిస్తోంది.
29 గ్రామాల రాజధాని రైతుల కోసం మాత్రం జోలెపట్టే చంద్రబాబు … తమ ప్రాంతానికి సాగు, తాగునీటి విషయమై జరుగుతున్న కీలక అపెక్స్ సమావేశానికి ప్రతిపక్ష నేతగా దిశానిర్దేశం చేయాల్సింది పోయి మౌనంగా ఉండడం ఏంటని సీమ సమాజం ఆగ్రహంతో ఊగిపోతోంది.
సీమపై మాటల్లో ప్రేమ చూపే పవన్‌కల్యాణ్ కూడా బాబు విధానాల్నే అనుసరించడంపై సీమ రైతాంగం మండిపడుతోంది. ఇప్పటికైనా తెలంగాణ రాజకీయ పార్టీల స్ఫూర్తితో సీమ కరవు కాటకాలను పారదోలేందుకు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఏపీ బీజేపీ శాఖ చూపిన చొరవ ప్రశంసనీయం. కనీసం మిత్రపక్షమైన బీజేపీతోనైనా కలిసి రావడానికి పవన్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు.