ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి ప్రకటన చేయగానే కొంతమంది ఔత్సాహికులు ఓ ఫన్నీ వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ భర్త, మూడు రాజధానుల కారణంగా మూడు ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి వస్తుంది. దీంతో ఎంచక్కా మూడు పెళ్లిళ్లు చేసుకుని మూడు చోట్లా ఫ్యామిలీలు పెడతాడు.
మొదటి పది రోజులు ఒక రాజధానిలో, తర్వాత పది రోజులు ఇంకో రాజధానిలో, చివరి పది రోజులు మరో రాజధానిలో ఉన్న ఫ్యామిలీతో గడుపుతుంటాడు. ఫినిషింగ్ టచ్ ఏంటంటే.. జగన్ గారూ నాలుగో రాజధాని కూడా పెట్టండి, ఎంచక్కా ఇంకో పెళ్లి చేసుకుని వారానికో ఫ్యామిలీ దగ్గర ఉంటానని చెబుతాడు.
ఈ వీడియో చూసినవారెవరికైనా పవన్ కల్యాణ్ గుర్తుకురాక మానరు. అయితే పవన్ ఒకేసారి మూడు ఫ్యామిలీలు మెయింటెన్ చేయలేదు కానీ, మూడు పెళ్లిళ్లు అనే ప్రస్తావన వస్తేనే రాష్ట్రంలో అందరికీ గుర్తొచ్చే పేరు పవన్. వీడియో బైటకొచ్చిన రోజు.. ఇది సీఎం జగన్ ని ఎగతాళి చేస్తూ చేసిన వీడియో అని అందరూ అనుకున్నారు, కానీ రోజులు గడిచేకొద్దీ అసలు టార్గెట్ పవన్ కల్యాణేనని అంటున్నారంతా.
అసలీ వీడియో కాన్సెప్ట్ తయారు చేసిన వాళ్లకి పవన్ కల్యాణ్ గుర్తొచ్చారో లేదో కానీ, వీడియో బైటకొచ్చిన తర్వాత మాత్రం టార్గెట్ పవనే అయ్యారు. సీఎం జగన్ ప్రకటన తర్వాత పవన్ రియాక్షన్ చూసిన వెంటనే జనాలు జనసేనానిని ఓ ఆట ఆడేసుకున్నారు. ఇప్పుడీ వీడియో అడ్డం పెట్టుకుని, మరింతగా ట్రోల్ చేస్తున్నారు.
మూడు పెళ్లిళ్లు, మూడు రాజధానులు.. పాజిటివ్, నెగెటివ్ అనే అంశాల్ని పక్కనపెడితే.. మూడు రాజధానులతో పవన్ కల్యాణ్ కి మరింత పబ్లిసిటీ పెరిగింది.