సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ రాజ్యసభ సభ్యుడు, ఎన్నికల తర్వాత బీజేపీ సభ్యుడిగా రూపాంతరం చెందిన సీఎం రమేష్‌నాయుడి ఆచూకీ తెలపాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం తీవ్ర రచ్చనీయాంశమైందని, దానిపై ఆయన వైఖరేంటో తెలుసుకోవాలని ఏపీ ప్రజలు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.
సీఎం వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ట్విట్టర్‌లో సీఎం రమేష్ రాతల రూరంలో కనిపించాడు. జగన్‌కు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఆయురారోగ్యాలతో నిండు నూరుళ్లు ఆనందంగా జీవించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్టు సీఎం రమేష్ ఏపీ సీఎంకు ట్వీట్ చేశాడు. ఇది తప్ప, ఇటీవల కాలంలో సీఎం రమేష్ ఉనికే లేదు.
మరోవైపు సీఎం రమేష్‌తో పాటు బీజేపీలో చేరిన సుజనాచౌదరి రోజురోజుకూ రెచ్చిపోతున్నాడనే అభిప్రాయం బలపడుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అండ చూసుకుని ఏపీలో అధికార పార్టీపై బెదిరింపులు, హెచ్చరికలు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారనే వాదన సొంత పార్టీ బీజేపీ నేతల నుంచే వినిపిస్తోంది.
ఏపీ రాజధానిని మారిస్తే చూస్తూ ఊరుకునేది లేదని జగన్ సర్కార్‌పై బెదిరింపులకు పాల్పడుతుంటే, మరోవైపు రాయలసీమలోని ప్రొద్దుటూరు నివాసైన సీఎం రమేష్ తన ప్రాంతానికి హైకోర్టు రావడంపై స్పందనా రాహిత్యంతో ఉండడం సమంజసమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క అమరావతిలోనే అన్నీ ఉండాలని సుజనాచౌదరి హెచ్చరిస్తుంటే, ఆయనతో పాటు బీజేపీలో చేరిన సీఎం రమేష్ తన ప్రాంతంపై అభిమానం ప్రదర్శించలేరా అని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నారు.
ఇంతకూ సీఎం రమేష్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? రాయలసీమకు మంచి చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా, లేదా అని అడుతున్న వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అయ్యా సీఎం రమేష్ గారూ మీరు ఎక్కడున్నా రాయలసీమ వాసులకు ఒక్కసారి కనిపించండి. మీ కోసం రాయలసీమ వాసులు బెంగ పెట్టుకున్నారు. నిద్రాహారాలు మానేశారు. రావయ్యా స్వామి త్వరగా. లేదంటే ఆచూకీ తెలిపితే సీమ ప్రజలే నీ దగ్గరికి వస్తారు.