వైసీపీ సర్కార్ ఏర్పడిన తరువాత తొలిసారిగా టాలీవుడ్ నుంచి జగన్ కి వెల్లువలా అభినందనలు వస్తున్నాయి. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన పట్ల అందరి కంటే ఎక్కువగా టాలీవుడ్ లోనే భారీ స్పందన లభిస్తోంది.
మరీ ముఖ్యంగా విశాఖను పరిపాలనా రాజధానిని చేస్తామని జగన్ చెప్పడాన్ని టాలీవుడ్ ప్రముఖులు స్వాగతిస్తున్నారు. టాలీవుడ్ పెద్ద, మెగాస్టార్ చిరంజీవి అయితే జగన్ నిర్ణయం అభివ్రుధ్ధికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు.
ఇంతకాలం వెనకబాటుతనంలో అనేక ప్రాంతాలు ఇబ్బందులు పడ్డాయని, వాటికి సరైన మార్గం పాలనపరమైన వికేంద్రీకరణేనని ఆయన జగన్ కి పూర్తి మద్దతుగా మాట్లాడారు.
విశాఖలో పరిపాలనా రాజధాని అంటే ఓ విధంగా టాలీవుడ్ పంట పండినట్లేనని అంటున్నారు. విశాఖ బీచ్ రోడ్ ని ఆనుకుని సినీ ప్రముఖులు అప్పట్లో పెద్ద ఎత్తున భూములు కొన్నారు.
వాటిలో స్టూడియోలు కట్టాలని కూడా చాలా ఆలోచనలు చేశారు. ఇక రాష్ట్ర విభజన తరువాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో విశాఖ ప్రాధాన్యత కూడా ఒకింత తగ్గింపోయింది.
ఈ నేపధ్యంలో ఎపుడో 20 ఏళ్ళ క్రితమే కట్టిన రామానాయుడు స్టూడియో కూడా వేస్ట్ గా పడి ఉంది. ఇపుడు విశాఖకే రాజధాని రావడంతో ముందుగా మేలు జరిగేది టాలీవుడ్ కేనని అంటున్నారు. సాగరతీరానికి అభిముఖంగా సినీ ప్రముఖులు కొన్న భూముల ధరలకు ఒక్కసారి రెక్కలు రావడం ఖాయం.
ఇక ఇక్కడ స్టూడియోలు కడతారా, సినీ పరిశ్రమను అభివ్రుధ్ధి చేస్తారా అన్నది ప్రభుత్వ విధానం బట్టి ఉంటుంది. ఓ విధంగా చిత్ర పరిశ్రమను ఇక్కడకు తీసుకువచ్చినా కూడా టాలీవుడ్ కే లాభం. మొత్తానికి జగన్ సర్కార్ తీసుకున్నా ఈ కీలక నిర్ణయం వల్ల టాలీవుడ్ పంట పండిందని అంటున్నారు.