దిశ ఘటన తరహాలోనే తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతికి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. హైదరాబాద్ శివార్లలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నేరేడ్ మెంట్ లో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న నర్సయ్య, ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఎప్పట్లానే ఆరోజు కూడా కార్మికులంతా విధులు ముగించి తమ ఇళ్లకు బయల్దేరుతున్నారు. అదే సమయంలో కార్మికుల గుంపులోని ఓ మహిళా కార్మికుల్ని నర్సయ్య ఆపాడు. చిన్న సిమెంట్ వర్క్ ఉంది, అది పూర్తి చేసి వెళ్లమని పురమాయించాడు. ఆ మహిళ తన గ్యాంగ్ ను వీడి అక్కడే ఉండిపోయింది.
సిమెంట్ పని కోసమని సదరు మహిళను సమీప ప్రాంతంలో చాలా లోపలకు తీసుకెళ్లాడు నర్సయ్య. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత, ఆమెకు బలవంతంగా మద్యం పట్టించాడు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో, అపస్మారక స్థితికి చేరుకున్న కార్మికురాలికి మరుసటి రోజు ఉదయం వరకు మెళుకువ రాలేదు.
పొద్దున్న ఇంటికి చేరుకున్న బాధితురాలు, తనకు జరిగిన అన్యాయాన్ని బంధువులకు చెప్పింది. దీంతో అంతా కలిసి కీసర పోలీస్ స్టేషన్ కు చేరుకొని కాంట్రాక్టర్ నర్సయ్యపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నర్సయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడ్ని రిమాండ్ కు తరలించారు.