అమ‌రావ‌తి ‘క‌మ్మ’ వాళ్ల‌దేనంటున్న ఆర్‌కే

అంద‌రూ ఊహించిన‌ట్టుగా ఈ వారం ఆంధ్ర‌జ్యోతి ‘కొత్త ప‌లుకు’ లో ‘కులంపై క‌క్ష‌…ప్ర‌జ‌ల‌కు శిక్ష‌’ శీర్షిక‌తో ఆర్‌కే రాజ‌ధాని విష‌య‌మై సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై విష‌పు సిరాతోనే రాశాడు. త‌న సామాజిక వ‌ర్గం సామూహిక…

అంద‌రూ ఊహించిన‌ట్టుగా ఈ వారం ఆంధ్ర‌జ్యోతి ‘కొత్త ప‌లుకు’ లో ‘కులంపై క‌క్ష‌…ప్ర‌జ‌ల‌కు శిక్ష‌’ శీర్షిక‌తో ఆర్‌కే రాజ‌ధాని విష‌య‌మై సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై విష‌పు సిరాతోనే రాశాడు. త‌న సామాజిక వ‌ర్గం సామూహిక ఆత్మ‌హ‌త్య‌కు ఈ త‌రం సాక్షీ భూతంగా నిల‌వ‌బోతోందా? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌ను చూస్తుంటే అవున‌నే అనిపిస్తోంద‌ని ఆర్‌కే ఆవేద‌నతో రాసుకొచ్చాడు.

సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తే త‌న‌ క‌మ్మ వాళ్లు ఎందుకు సామూహిక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డాల్సి వ‌స్తుందో…మేధావైన ఆర్‌కే స‌మాధానం చెప్పాలి. మిగిలిన సామాజిక వ‌ర్గాలు అక్క‌డ లేవా? మ‌రెందుకు వారి గురించి మాత్ర‌మే రాధాకృష్ణ గ‌గ్గోలు పెడుతున్నాడు? ఈ ఒక్క వాక్యం చాల‌దా అమ‌రావ‌తి ఎవ‌రి రాజ‌ధానో చెప్ప‌డానికి?

ఈ వారంత కొత్త పలుకులో అక్ష‌రం అక్ష‌రం కులం కంపు కొడుతోంది. కుల విద్వేషాల‌ను ర‌గుల్చుతోంది. ఈ వారం ఆయ‌న రాసిన ఆర్టిక‌ల్‌లో ఆణిముత్యాలేంటో తెలుసుకుందాం.

‘ఒక సామాజికవర్గంపై కోపంతో, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కసితో రాష్ట్రానికి భవిష్యత్‌ లేకుండా చేస్తున్నారా? అన్న భావన ఏర్పడుతోంది. కుల ద్వేషాలు, వ్యక్తిగత కక్షలతో రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నా నోరు విప్పడానికి సంకోచిస్తున్న మేధావులు కూడా రాజకీయ నాయకుల వలె రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. 13 జిల్లాలకు మధ్యలో ఉంటుందన్న కారణంగా అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే, ఆ విషయాన్ని మరుగునపరిచి కమ్మ సామాజికవర్గం కోసమే చంద్రబాబు అమరావతిని ఎంపిక చేశారని ప్రచారం చేస్తున్నా ఒక్కరు కూడా నోరు విప్పడం లేదు.  అమరావతి పట్ల సీమవాసుల్లో వ్యతిరేకత వ్యాపింపజేయడం వల్ల రాజధానికి భూములిచ్చిన రైతులు ఒంటరివారయ్యారు’ అని కొత్త‌ప‌లుకులో ‘క‌మ్మ‌’ని ప‌లుకులు ప‌లికాడాయ‌న‌.

సీమ‌వాసుల్లో వ్య‌తిరేక‌త ఉన్నంత మాత్రాన రాజ‌ధానికి భూములిచ్చిన రైతులు ఎలా ఒంట‌రి వార‌య్యారో అర్థం కావ‌డం లేదు. మ‌రి రాయ‌ల‌సీమేత‌ర ఉత్త‌రాంధ్ర‌తో పాటు మిగిలిన నాలుగు జిల్లాల మాటేమిటి? రాజ‌ధాని రైతుల‌కు వారెందుకు మ‌ద్ద‌తు నిల‌బ‌డ‌డం లేదో ఆర్‌కేనే స‌మాధానం చెప్పాలి. అంటే అక్క‌డ భూముల‌న్నీ క‌మ్మ సామాజిక వ‌ర్గం వారివేన‌ని రాధాకృష్ణ చెప్ప‌క‌నే చెప్పాడు.

ఆర్‌కే వ్యాసంలో ఉన్న సౌల‌భ్యం ఏమంటే ప్ర‌శ్న‌, జ‌వాబు రెండూ ఆయ‌నే చెబుతాడు. కేవ‌లం పాఠ‌కుడు గుర్తిస్తే చాలు. అలాంటిదే జ‌గ‌న్‌కు ఆయ‌నో ప్ర‌శ్న వేసి జ‌వాబు కూడా ప‌రోక్షంగా రాసుకొచ్చాడు. ఈ కింది వాక్యాల‌ను చ‌దివితే మీకే అర్థ‌మ‌వుతుంది.

‘ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టకూడదన్న ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నాననీ, అమరావతికి కనీసం 30 వేల ఎకరాలు ఉండాలనీ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌రెడ్డి నాడు వాదించగా, ఇప్పుడు ఆయన మంత్రులు ‘‘అంతెందుకు? 300 ఎకరాలు చాలులే’’ అంటుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?’ అని రాధాకృష్ణ ప్ర‌శ్నిస్తున్నాడు.

‘ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే! విశాఖను రాజధానిగా అభివృద్ధి చేయవద్దని చెప్పలేని స్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయి. వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్రవాసులకు ఆగ్రహం వస్తుందన్న భయం ఉంటుంది కదా? కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తు న్నామని చెప్పడానికి కూడా ఇదే కారణం!’ అని ఇంకోచోట ఆర్‌కే రాసిన ప‌లుకులివి.

2014లో రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో జ‌గ‌న్ మాట‌ల‌ను గుర్తు చేస్తూ ‘‘మాట తప్పను.. మడమ తిప్పను’’ అని ఘనంగా చెప్పుకొనే జగన్మోహన్‌రెడ్డికి అధికారంలోకి రాగానే నాలుక మడత పడింది, మడమ బెణికిందని ఆర్‌కే హేళ‌న చేస్తున్నాడు.

మ‌రి విశాఖను రాజధానిగా అభివృద్ధి చేయవద్దని చెప్పలేని స్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయ‌ని, వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్రవాసులకు ఆగ్రహం వస్తుందన్న భయం ఉంటుంది కదా? కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పడానికి కూడా ఇదే కారణమంటున్న రాధాకృష్ణ‌కు నాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్‌కు ఇదే భ‌యం ఉంటుంద‌ని ఎందుకు ఆలోచించ‌డం లేదు. అంటే జ‌గ‌న్‌కో నీతి, చంద్ర‌బాబుకో నీతా? ఇదేనా రాధాకృష్ణా మీ ‘క‌మ్మ‌నీతి?’

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టకూడదన్న ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నానని జ‌గ‌న్ చెప్పాడే త‌ప్ప దానిపై ప్రేమ‌తో కాద‌ని నాడు జ‌గ‌న్ చాలా స్ప‌ష్టంగా అసెంబ్లీ వేదిక‌గా చెప్పాడు. అమ‌రావ‌తిని కాపాడుకుంటాన‌ని నిన్న‌టి అసెంబ్లీలో రంకెలేసిన చంద్ర‌బాబు అదేమాటపై నిల‌బ‌డ‌మ‌ని చెప్పే ద‌మ్ము, ధైర్యం మీకున్నాయా ఆర్‌కే? అమ‌రావ‌తి త‌ప్ప మరే ప్రాంతాల‌ను రాజ‌ధానులుగా ఒప్పుకునే ప్ర‌శ్నే లేద‌ని చంద్ర‌బాబుతో ఓ మాట చెప్పించండి చూద్దాం. మరి ఇప్పుడు రైతుల నుంచి వేలాది ఎక‌రాలు తీసుకున్న చంద్ర‌బాబు వారికి అండ‌గా నిల‌బ‌డ‌క‌పోవ‌డం ‘‘మాట త‌ప్ప‌డం, మ‌డ‌మ తిప్ప‌డం’’గా అనిపించ‌లేదా?

అంత కోపం ఉంటే క‌మ్మ‌వారిని త‌రిమేయండి లాంటి రెచ్చ‌గొట్టే రాత‌లు ఆర్‌కే రాయాల్సిన‌వి కావు. రాష్ట్ర భవిష్యత్‌, ప్రజల ప్రయోజనాలతో ఆడుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్‌కే చెబుతున్న‌ట్టు ప్ర‌భుత్వాల‌కే కాదు ప‌త్రిక‌ల‌కు, చాన‌ళ్ల‌కు మంచిది కాదు. రాష్ట్రం పట్ల బాధ్యత ఉన్న మేధావులు, విజ్ఞులు ఎవరైనా ఉంటే నోరు తెరిచి జ‌గ‌న్‌కే కాదు రాధాకృష్ణ తప్పొప్పులను కూడా చెబితే మంచిది.