ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని భీమిలి అని వైఎస్సార్‌సీపీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని ఆయన చెప్పారు. విశాఖ జిల్లా చినగదిలి మండలం కొమ్మాదిలో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో శనివారం విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలనే నిర్ణయం చరిత్రాత్మకమైందన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఇక్కడ పరిపాలన పరమైన రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధిలో వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించాలని సీఎం జగన్ నిర్ణయిస్తే…దానికి టీడీపీ నేతలు అడ్డంకిగా తయారయ్యారన్నారు.
విశాఖలోనే సీఎం క్యాంప్ కార్యాలయం, మంత్రుల నివాసాలు ఉంటాయన్నారు. సచివాలయం ఇక్కడే ఉంటుందన్నారు. ప్రభుత్వ భూముల కోసం అన్వేషిస్తున్నామన్నారు.
భీమిలి ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాస్ ముఖ్యమంత్రికి సహకరించి రాజధానిలో అన్ని మౌళిక వసతుల కల్పనకు చొరవ తీసుకోవాలని సూచించారు.
అలాగే రానున్న రోజుల్లో 13 జిల్లాలు 25 జిల్లాలు అయ్యే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. వీటిని అన్ని రకాలుగా సమానంగా అభివృద్ధి చేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు.