కేంద్ర కేబినెట్ లో వైసీపీ చేరితే…? చేరకపోతే..?

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీ భేటీపై.. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు ఎజెండా జగన్ బైటకు చెప్పరు, ఊహాగానాలను ఆయన అసలే ఖండించరు. దీంతో కేంద్ర కేబినెట్ లో వైసీపీ…

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీ భేటీపై.. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు ఎజెండా జగన్ బైటకు చెప్పరు, ఊహాగానాలను ఆయన అసలే ఖండించరు. దీంతో కేంద్ర కేబినెట్ లో వైసీపీ చేరుతుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో వైసీపీ ఎన్డీఏలో చేరితే లాభం ఏంటి? నష్టం ఏంటి..?

ఎన్డీఏలో వైసీపీ భాగస్వామి అయితే కలిగే లాభాలు..

– వైసీపీకి కేబినెట్ బెర్త్ లు దక్కుతాయి. ఒక కేబినెట్ పదవి, రెండు సహాయ మంత్రి పదవులు దక్కుతాయని అంచనాలున్నాయి. అంటే రాష్ట్రానికి ఈ పదవుల వల్ల లాభం కలుగుతుంది. గత ఎన్డీఏలో టీడీపీ మంత్రి పదవులు అనుభవించి రాష్ట్రానికి ఏయే మేళ్లు చేసింది, తాము అధికారంలోకి వచ్చే ఏమేం చేశామని ప్రజలకు చెప్పుకునే అవకాశం లభిస్తుంది. వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి తోడు, కేంద్రంలో మంత్రి పదవుల ద్వారా వచ్చే అదనపు ప్రయోజనాలు వైసీపీకి తిరుగులేని ఆధిక్యాన్ని తెచ్చిపెడతాయి.

– ప్రత్యేక హోదా తేగలిగితే అదే అతి పెద్ద విజయం అవుతుంది. ఎన్డీఏతో చెలిమి చేసి ఎలాగోలా ఏపీకి ప్రత్యేక హోదా సాధించగలిగితే.. సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు. హోదా వల్ల రాష్ట్రానికి కలిగే లాభాలు.. పరోక్షంగా వైసీపీకి మేలు చేస్తాయి.

– రాష్ట్రానికి అదనపు నిధులు తెచ్చుకునే వెసులుబాటు ఉంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా.. తమ పార్టీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు అదనపు నిధులు మళ్లించడం సహజంగా జరిగేదే. తద్వారా ఆ రాష్ట్రంలో మరింత పలుకుబడి సాధించే అవకాశం ఉంటుంది, పక్కనే ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా అదో కనువిప్పు అవుతుంది. ఇప్పుడు ఎన్డీఏలో వైసీపీ భాగస్వామి అయితే.. కేంద్రం నుంచి అదనపు నిధులు డిమాండ్ చేసి మరీ సాధించుకోవచ్చు.

– బడ్జెట్ లో కూడా అదనపు కేటాయింపులు జరుపుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రైల్వే పనులు ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. ఇక రహదారులు, విమానాశ్రయాలు, పోర్ట్ లు.. ఇలా కేంద్రంతో కలసి చేపట్టే ఏ పనికైనా అదనంగా అధికారికంగా కేటాయింపులు ఉంటాయి. పోలవరం నిధుల విడుదలలో జాప్యం కూడా ఉండదు.

– కేంద్రంతో సుహృద్భావ వాతావరణం ఉంటుంది. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం.. కేంద్రంతో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతోంది. స్థానికంగా పట్టు కోసం కేసీఆర్ అలాంటి ప్రణాళిక వేసుకున్నా… అంతిమంగా కేటాయింపులు లేక నష్టపోయేది మాత్రం ప్రజలే. వైసీపీ బీజేపీతో చెలిమి చేస్తే.. దాని ప్రభావం కచ్చితంగా రాష్ట్ర అభివృద్ధిపై కనిపిస్తుంది.

– పలు కేంద్ర ప్రభుత్వ పథకాలు మన రాష్ట్రంలో మరింత మెరుగ్గా అమలవుతాయి. కేంద్ర పథకాలలో ప్రజల్ని మరింత ఎక్కువగా భాగస్వాముల్ని చేసి, అత్యథిక ప్రయోజనం పొందేలా చేయొచ్చు. తద్వారా రాష్ట్ర ఖజానాపై భారం కూడా తగ్గే అవకాశముంది.

– గత ప్రభుత్వం చేసిన అవినీతి పూర్తి స్థాయిలో బైటపెట్టే అవకాశం ఉంది. అమరావతి పేరుతో చంద్రబాబు, ఫైబర్ గ్రిడ్ పేరుతో లోకేష్ చేసిన అవినీతి బండారాన్ని బజారుకీడ్చొచ్చు. సీబీఐ ఎంక్వయిరీ వేస్తే టీడీపీ హయాంలో జరిగిన లోటుపాట్లన్నీ బైటకొచ్చేస్తాయి.

నష్టాలూ ఉన్నాయి..

– వైసీపీ ఎన్డీఏలో చేరితే ఒనగూరే లాభాలతో పాటు, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు పూర్తిగా రివర్స్ అవుతారు. ఇన్నాళ్లూ బీజేపీతో చెలిమిపై ఆశలు పెట్టుకున్న బాబుకి.. వైసీపీ ఎత్తుకి పై ఎత్తు వేయడానికి ఇప్పటినుంచే అవకాశం దొరికినట్టవుతుంది. హిందూత్వ అజెండా వదిలేసి, అప్పుడు బాబు మరో కొత్త అజెండాతో ఎన్నికలకు వెళ్తారు.

– బీజేపీపై ఉన్న వ్యతిరేకత వైసీపీని కూడా పట్టుకుంటుంది. వరుసగా రెండు దఫాలు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సహజంగా గత ఎన్నికల్లోనే బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందని, నోట్ల రద్దు అంశం లాంటివి ఇబ్బంది పెడతాయని అనుకున్నారంతా. కానీ బలహీన ప్రతిపక్షం.. బీజేపీ నెత్తినపాలు పోసింది. ఈ దఫా ఎన్నికలనాటికి కూడా ఎంతోకొంత ప్రతికూలత ఉండొచ్చు. ఆ ప్రతికూలత కాస్తా వైసీపీపై పడొచ్చు.

– సీట్ల త్యాగం పెద్ద తలనొప్పి. వచ్చే ఎన్నికలనాటికి ఎలాగూ మిత్రపక్షం బీజేపీతో కలసి పోటీ చేయాలి. ఒకవేళ జనసేన కూడా కూటమిలో ఉంటే.. వారికి కూడా త్యాగం చేయాలి. దీంతో వైసీపీలో లుకలుకలు రాకమానవు. అసంతృప్తులంతా టీడీపీ వైపు ఆకర్షితులైతే అది మరో సమస్యగా మారుతుంది.

– మైనార్టీల ఓటుబ్యాంకు దూరమయ్యే అవకాశం. వైఎస్సార్ హయాం నుంచి మైనార్టీలు వారి కుటుంబానికి అండగా నిలబడ్డారు. వైసీపీ పెట్టిన తర్వాత కూడా మైనార్టీలు జగన్ కి పెద్ద బలం, బలగం అయ్యారు. అలాంటి మైనార్టీలు ఎన్డీఏతో వైసీపీ చెలిమి చేస్తే ఎలా స్పందిస్తారనేది అనుమానమే.

– అన్నింటికంటే ముఖ్యమైన అంశం ప్రత్యేక హోదా. కేంద్రంలో చేరితో హోదా తెచ్చుకోవడం ఈజీ అవుతుందనేది ఎంత లాజికల్ గా ఉందో, ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్న బీజేపీతో దోస్తీ చేయడం వైసీపీకి అంతే నష్టం కూడా తెచ్చిపెడుతుంది. ప్రతిపక్షాలు దీన్ని ఓ అస్త్రంగా మలుచుకునే అవకాశాలే ఎక్కువ.

వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి