బూతు మాటలు, అరాచకాలు, దౌర్జన్యాలు వీటి మీద టీడీపీ తమ్ముళ్ళు ఇపుడు తాపీగా కూర్చుని బాగా సుద్దులు చెబుతున్నారు. చాన్స్ దొరికింది కదా అన్నట్లుగా రెచ్చి మరీ మైకుల ముందుకు వచ్చి నీతి వాక్యాలు బాగానే వల్లిస్తున్నారు.
హన్నన్నా. ఇది కాదా..అన్యాయం, అక్రమం అంటూ తెగ నిట్టూరుస్తున్నారు. ప్రజా ప్రతినిదులు ఎలా ఉండాలంటే అంటూ లెక్చర్లు కూడా దంచుతున్నారు. మరి తమకే రివర్స్ లో నీతి పాఠాలూ, ధర్మ పన్నాలూ చెబుతూంటే ఎంతవరకూ సహిస్తారు వైసీపీ నేతలు. అందుకే వారు కూడా కౌంటర్లేస్తున్నారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడే నీతులు చెప్పాలి మరి.. ఆయన నర్శీపట్నం పోలీస్ స్టేషన్ లో చేసిన దౌర్జన్యం జనాలు మరచిపోయారనుకుంటున్నారా అని వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ పాత కధలు వినిపించారు. తాజాగా ఆయన ఒక మహిళా కమిషనర్ మీద వాడిన తిట్ల పురాణం గురించి కూడా ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారు.
ఇక శ్రీకాకుళంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగడాల గురించి జనమే చెప్పాలని మంత్రి సీదరి అప్పలరాజు అంటున్నారు. అధికారుల మీద దుర్భాషలాడే కూన, అచ్చెన్నల నుంచి వైసీపీ నీతులు నేర్చుకోవాలా అంటూ బాగానే వెటకారం ఆడారు మంత్రి గారు.
మునిగిపోయే టీడీపీ నౌకకు నాయకులమని సంబరాలు చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇవన్నీ సరే కానీ నిన్ననే కదా టీడీపీ మాజీ ఎంపీ సబ్బం హరి మునిసిపల్ అధికారుల మీద వాడిన తిట్ల పురాణాన్ని లోకమంతా చూసింది.
మరి ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ విశాఖలో రాజధాని కోసం తన పార్టీ వారితో మాట్లాడిన దాన్ని పట్టుకుని చిలవలు పలవలూ చేస్తున్న తమ్ముళ్ళ విష ప్రచారానికి వైసీపీ చూపించిన ఫ్లాష్ బ్యాక్ కధలతోనైనా అడ్డుకట్ట పడుతుందా అన్నది చూడాలి.