హామీలు ఇచ్చేటప్పుడు స్టడీ చేయరా ?

ఈ కాలపు రాజకీయ నాయకులకు ఎంతసేపూ ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలనే యావ తప్ప మరో ఆలోచన ఉండదు. నాయకులు ఎన్నికల సమయంలో, అధికారంలోకి వచ్చాక వివిధ సందర్భాల్లో అనేక హామీలు ఇస్తుంటారు. ఇలా…

ఈ కాలపు రాజకీయ నాయకులకు ఎంతసేపూ ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలనే యావ తప్ప మరో ఆలోచన ఉండదు. నాయకులు ఎన్నికల సమయంలో, అధికారంలోకి వచ్చాక వివిధ సందర్భాల్లో అనేక హామీలు ఇస్తుంటారు. ఇలా ఎందుకు ఇస్తారంటే ప్రజలను ఆకర్షించడం కోసం. పార్టీలు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలు తయారుచేసే సంగతి అందరికీ తెలుసు. అవన్నీ హామీలే.

అధికారంలోకి వస్తే ఫలానా పనులు చేస్తామని చెబుతారు. వాటిల్లో చాలా డొల్ల హామీలు ఉంటాయి. ప్రజలను ఆకర్షించే అంశాలు మేనిఫెస్టోలో చాలా చేరుస్తారు. ఇవన్నీ ఓట్లు రాలడానికి ఇచ్చే హామీలు కాబట్టి ముందుగా ఏమాత్రం అధ్యయనం చేయరు. ఒకవేళ అధికారంలోకి వస్తే అప్పుడు వాటిని అమలు చేయడానికి మల్లగుల్లాలు పడుతుంటారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చే ఏ పార్టీ కూడా నెరవేర్చదు.

కానీ చెప్పిన పనులే కాకుండా చెప్పని పనులు కూడా చేశామని పాలకులు గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి పాలకులు ఎవరైనా ఆవేశంగా హామీలు ఇవ్వడం కాదు, ఇచ్చే ముందు నిపుణులతో కూర్చొని సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసి అప్పుడు హామీలు ఇవ్వాలి. లేకపోతే అబాసు పాలవుతారు. ఇక అసలు విషయమేమిటంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి రాగానే  సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. 

కానీ రెండున్నరేళ్లయినా అది అమలు కాలేదు. కారణమేమిటంటే సీపీఎస్ రద్దు ప్రభుత్వానికి భారంగా పరిణమిస్తుంది. సీపీఎస్ కు సంబంధించిన సాంకేతిక అంశాలు తెలుసుకోకుండా జగన్ దాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారట. చావు కబురు చల్లగా చెప్పినట్లుగా జగన్ కుడి భుజం, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ సంగతి చల్లగా చెప్పారు. సీపీఎస్ రద్దు చేస్తే ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని సజ్జల అన్నారు.

అంటే అది ప్రభుత్వానికి పెను భారమన్నట్లే కదా. సీపీఎస్ రద్దు చేస్తే ఉద్యోగులకు పెన్షన్ ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నామన్నారు. అంటే దీన్నిబట్టి ఏం అర్ధమైంది ? హామీ ఇచ్చే ముందు సీపీఎస్ రద్దువల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి అనేది జగన్ స్టడీ చేయలేదు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ అసెంబ్లీలో ఆవేశంగా చెప్పారు. కొంతకాలం కిందట ఆ బిల్లును రద్దు చేశారు. సాంకేతిక అంశాలను సరి చేసి మళ్ళీ బిల్లు తెస్తామన్నారు.

అంటే సరిగా స్టడీ చేయలేదని అర్ధమవుతోంది. చాలా ఆవేశంగా శాసనమండలిని రద్దు చేయాలని తీర్మానం చేశారు. కొంతకాలం తరువాత మండలిలో వైసీపీకి బలం పెరుగుతుందని తెలుసు. అయినప్పటికీ వెనకా ముందు చూసుకోకుండా రద్దు తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.

అక్కడ జాప్యం జరగడంతో ఈలోగా మండలిలో వైసీపీ బలం పెరిగింది. ఇప్పుడు రద్దు తీర్మానం ఉపసంహరించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి అనాలోచిత హామీలు ఇస్తుంటుంది. అనాలోచిత నిర్ణయాలు చేస్తుంటుంది. అందుకే ఇప్పటి రాజకీయ నాయకులు రాజనీతిజ్ఞులు, దార్శనికులు కాలేకపోతున్నారు.