ఏపీ ఉద్యోగులపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందా..?

ప్రభుత్వ ఉద్యోగులు తమకి కావాల్సినవేవో తాము అడగాలి, తమ డిమాండ్లు తీర్చాలని మాత్రమే ప్రశ్నించాలి. కానీ ఏపీలో పరిస్థితి అలా లేదు. పీఆర్సీ కోసం ఉద్యమం చేస్తున్న ఉద్యోగుల్లో చాలామంది జగన్ ప్రభుత్వ పథకాలను…

ప్రభుత్వ ఉద్యోగులు తమకి కావాల్సినవేవో తాము అడగాలి, తమ డిమాండ్లు తీర్చాలని మాత్రమే ప్రశ్నించాలి. కానీ ఏపీలో పరిస్థితి అలా లేదు. పీఆర్సీ కోసం ఉద్యమం చేస్తున్న ఉద్యోగుల్లో చాలామంది జగన్ ప్రభుత్వ పథకాలను విమర్శిస్తున్నారు. 

అమ్మఒడి ఎవరడిగారంటూ ప్రశ్నిస్తున్నారు. ఉచిత పథకాలకు ధారపోసే డబ్బుల్ని తమకి జీతాల రూపంలో పెంచి ఇవ్వొచ్చు కదా అంటున్నారు. పీఆర్సీ పెంచమంటే పెంచకుండా.. సామాజిక పింఛన్లు ఎందుకు పెంచారంటూ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రజల్లో నిజంగానే పలుచన అవుతున్నారు.

రాజు అందరి క్షేమాన్నీ చూడాలి. ఓ వర్గాన్ని మాత్రమే రంజింపజేయాలంటే కుదరదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా.. జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చూస్తున్నారు. కానీ ఉద్యోగులు మాత్రం తాము బాగుంటే చాలనుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం..?

అమ్మఒడికి డబ్బులెక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించే హక్కు ఉద్యోగులకు లేదు, పీఆర్సీ సంగతి పట్టించుకోకుండా హడావిడిగా పింఛన్లు ఎందుకు పెంచారని అడిగే అధికారం కూడా ఉద్యోగులకు లేదు. కానీ ప్రతిపక్షాల మాయలో పడి ఉద్యోగులు విచక్షణ కోల్పోతున్నారని అనిపిస్తోంది. 

ఉద్యోగి అంటే ఒక్కరే కాదు, మాకూ కుటుంబాలున్నాయి, బంధువులున్నారు, వారికీ ఓట్లు ఉన్నాయంటూ గతంలో బెదిరింపు ధోరణిలో మాట్లాడటం కూడా సరైన పద్ధతి కాదు. దీనిపై ఇప్పటికే తీవ్ర విమర్శలు చుట్టుముట్టాయి. అలాగని న్యాయబద్ధమైన డిమాండ్లను సాధించుకోవడంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయొద్దని ఎవరూ చెప్పరు.

ఉద్యోగుల వ్యతిరేకి జగన్ అనే ముద్ర వేయడానికి ఇటీవల ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వేలాది కుటుంబాలకు న్యాయం చేసింది ఎవరు..? సచివాలయాల ద్వారా లక్షల ఉద్యోగాలు కల్పించి ఆయా కుటుంబాల్లో వెలుగు నింపింది ఎవరు..? వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే.. రాష్ట్ర పరిస్థితిని కూడా ఉద్యోగులు ఆలోచించేవారు. కరోనా కష్టకాలంలో లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయి దిగాలు పడ్డారు.

కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే నెల నెలా జీతాలు అందుకుంటూ ఆందోళన లేకుండా గడిపారు. జీతాల పెంపు విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఒకరకంగా వితండవాదంతో ప్రజల దృష్టిలో పలుచన అవుతున్నారు.