పశ్చిమబెంగాల్‌లో ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూనే ఉంది. గవర్నర్ ఆదేశాలను ముఖ్యమంత్రి ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. దీంతో ఇదేం పద్ధతి అంటూ గవర్నర్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ దుస్థితి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. గవర్నర్ ఆదేశిస్తే అసలు చేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన చర్యలతో చెప్పకనే చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి పశ్చిమబెంగాల్ గవర్నర్ ధన్కర్, సీఎం మమతాబెనర్జీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ కౌన్సిలర్ మనీష్ శుక్లా హత్య వాళ్లిద్దరి వివాదానికి కారణమైంది. పశ్చిమబెంగాల్‌లో కౌన్సిలర్ హత్యకు నిరసనగా బరాక్‌పూర్ పట్టణంలో ఈ రోజు (సోమవారం) 12 గంటల పాటు బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది.
బెంగాల్‌లో శాంతిభద్రతలను కాపాడడంలో మమతా సర్కార్ విఫలమైందని బీజేపీ నేతలు విమర్శించారు. బెంగాల్‌లో టీఎంసీది రాజకీయ ఉగ్రవాదమని బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ యాక్టివ్ అయ్యారు. బీజేపీ కౌన్సిలర్ హత్యపై గవర్నర్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ కౌన్సిలర్ హత్యపై సీఎం మమతాబెనర్జీతో రాత్రి 10.47 గంటలకు మాట్లాడతానని చెప్పినట్టు గవర్నర్ తెలిపారు. అయితే తన అభ్యర్థనను సీఎం మమతా ఏ మాత్రం పట్టించుకోలేదని గవర్నర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు వేగంగా క్షీణిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ హత్యలు ఉండకూడదని తాను హెచ్చరిస్తున్నా మమతా సర్కార్ పట్టించుకోలేదన్నారు.
ఈ హత్యపై హోంకార్యదర్శి, డీజీపీ, పోలీసులు ఎవ్వరూ స్పందించ లేదని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కౌన్సిలర్ హత్య విషయమై రాత్రి 10:47 గంటలకు ముఖ్యమంత్రి మమతతో అర్జెంట్‌గా మాట్లాడాలని సమాచారం ఇచ్చినా ఏ మాత్రం స్పందించలేదని గవర్నర్ మండిపడ్డారు. ఇటీవల గవర్నర్ తన పరిధికి మించి ప్రవర్తిస్తున్నారని పశ్చిమబెంగాల్ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న వాళ్లు తమ అధికారాలేంటో తెలుసుకుని ప్రవర్తించాలని గవర్నర్‌కు ఇటీవల మమత హితవు చెప్పారు. తాజాగా గవర్నర్ ఆరోపణలతో వివాదం మరింత ముదిరినట్టే కనిపిస్తోంది.