ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ఉద్వేగానికి లోనయ్యారు. పులివెందులలోని భాకరాపురంలో వైఎస్సార్ ఆడిటోరియంలో సోమవారం డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో ఈ ఘటన చోటు చేసుకొంది. ముందుగా ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి సీఎం జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సభలో తండ్రి ఈసీ గంగిరెడ్డితో తన జ్ఞాపకాలను వైఎస్ భారతి నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కంటతడి పెట్టారు. తండ్రి గొప్పతనాన్ని భారతి ఆవిష్కరించారు. తండ్రి గురించి భారతి మాటల్లోనే…
‘మా నాన్న ఈసీ గంగిరెడ్డి మనసున్న డాక్టర్. ఆయన హస్తవాసి మంచిదన్న పేరుంది. ప్రజా వైద్యుడిగా నాన్నకు మంచి గుర్తింపు ఉంది. క్రమశిక్షణ, విలువలు పాటించి నాన్న అందరికీ అదర్శంగా నిలిచారు.
ప్రతి రోజూ 300 మంది రోగులకు వైద్య సేవలు అందించే వారు. రోజూ పనిలో ఎంత బిజీగా ఉన్నా ఎవరైనా కలవడానికి వస్తే..నాన్న ఆప్యాయంగా పలకరించే వారు. తనకు వ్యతిరేకంగా ఉన్నా.. వారితో ప్రేమగా మాట్లాడేవారు. వైద్యం కోసం వచ్చేవారిని ఆత్మీయులుగా భావించేవారు. పేదలకు వైద్య సేవలు అందించేం దుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. నాన్న మరణం మాకు తీరని లోటు’అని వైఎస్ భారతి చెప్పుకొచ్చారు.
అనారోగ్యంతో బాధపడే పిల్లల్ని ఈసీ గంగిరెడ్డి దగ్గరికి తీసుకెళితే బతికిస్తారనే పేరు రాయలసీమలో బాగా ప్రాచుర్యంలో ఉంది. అలాంటి గొప్ప డాక్టర్, మానవతా వాది చనిపోవడం ఒక్క ఆయన కుటుంబానికే కాకుండా ప్రతి ఒక్కరికీ తీరని లోటని చెప్పొచ్చు.
ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎంతో పాటు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, ఎంపీలు విజయసాయిరెడ్డి , వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి , ఎమ్మెల్యేలు , వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.