భళా.. ఇది కూడా భయపెడుతుంది…

న్యాయవ్యవస్థ అసాధారణ రీతిలో కొరడా ఝుళిపించింది. ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడికి.. మరణించే వరకు జైలు శిక్ష విధించారు. ఇలాంటి కేసుల్లో మరణించే వరకు జైలు శిక్షలు కూడా నిందితుల్ని, ఇలాంటి నేరాలకు పాల్పడే…

న్యాయవ్యవస్థ అసాధారణ రీతిలో కొరడా ఝుళిపించింది. ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడికి.. మరణించే వరకు జైలు శిక్ష విధించారు. ఇలాంటి కేసుల్లో మరణించే వరకు జైలు శిక్షలు కూడా నిందితుల్ని, ఇలాంటి నేరాలకు పాల్పడే ఆలోచనలు ఉండేవారిని భయపెడతాయి.

దిశ హత్యోదంతంలో నిందితులను హైదరాబాదు పోలీసులు ఎన్ కౌంటర్ చేయగానే.. అలాంటి పరిష్కారాలకు ప్రజలు జై కొట్టారు. తప్పుడు వ్యక్తుల్లో భయం పుడుతుందని అనుకున్నారు. అలాంటి తప్పుడు మార్గాల్లోని శిక్షలు మాత్రమే కాదు.. చట్టబద్ధంగా ఇలాంటి శిక్షలు కూడా మార్పును తెస్తాయి.

ఉన్నావ్ అత్యాచారం ఘటనలో ఎన్నిన్ని రకాల ఘోరాలు జరగాలో అన్నీ జరిగాయి. మొత్తానికి మరణించే వరకు శిక్ష పడింది. నిర్భయ నిందితుల విషయంలో ఇంకా ఏమీ తేలలేదు. అయితే ఉన్నావ్ నిందితుడికి ఇప్పుడు శిక్ష విధించినది.. జిల్లా కోర్టు మాత్రమే. నిందితుడు.

ఈ శిక్షను  నీరుగార్చడానికి.. లేదా తప్పించుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. ఆయన హైకోర్టును ఆశ్రయించవచ్చు.. ఆ పిమ్మట సుప్రీం కు కూడా వెళ్లవచ్చు. ఎన్ని తలుపులైనా తట్టి.. నాటకం నడిపించవచ్చు.ఎన్నయినా చేయవచ్చు గాక.. ఇలాంటి కేసుల్లో శిక్షపడిన తర్వాత.. ఇక బెయిలు దొరికే అవకాశం లేకుండా చూడాలి.

జీవితాంతమూ పెరోల్ గానీ, ములాఖత్ లు గానీ లేకుండా చూడాలి. అలాంటి నేరాలు చేయడం అంటేనే.. ఇక జీవితం మొత్తం హరించుకపోతుందనే భయం సమాజంలో ఉండాలి. చాలా మంది జైకొట్టినప్పటికీ.. చంపడం, అది కూడా చట్టాన్ని అతిక్రమించి చంపడం అనేది అన్ని సందర్భాల్లోనూ పరిష్కారం కాకపోవచ్చు. కానీ.. చావు మేలనిపించేలా శిక్షలను పటిష్టం చేయాలి.

నేరం ఎంత పెద్దదయినా సరే.. బెయిలు తీసుకుని బాహ్య ప్రపంచంలో తిరిగే అవకాశం కల్పిస్తే.. శిక్ష పడిన తర్వాత కూడా.. ములాఖత్ ల పేరుతో బంధువులు, భార్యా పిల్లలతో ముచ్చట్లు చెప్పుకుంటూ జీవితం సాగించగల వెసులుబాటు యిస్తే.. కరడుగట్టిన వ్యక్తులు అంతగా భయపడకపోవచ్చు.