తెలుగు రాష్ట్రాలకు పాకిన నిరసన సెగ

ఎన్ఆర్సీ, సీఏఏ సెగలు తెలుగు రాష్ట్రాలకూ పాకాయి. శుక్రవారం నమాజు కోసం మసీదులకు వచ్చిన ముస్లింలంతా అట్నుంచి అటే జాతీయ జెండాలు చేతబట్టుకుని నిరసన ర్యాలీలు చేపట్టారు. హైదరాబాద్ లో ముస్లిం జనాభా అధికంగా…

ఎన్ఆర్సీ, సీఏఏ సెగలు తెలుగు రాష్ట్రాలకూ పాకాయి. శుక్రవారం నమాజు కోసం మసీదులకు వచ్చిన ముస్లింలంతా అట్నుంచి అటే జాతీయ జెండాలు చేతబట్టుకుని నిరసన ర్యాలీలు చేపట్టారు. హైదరాబాద్ లో ముస్లిం జనాభా అధికంగా ఉండే ప్రాంతాలతో పాటు.. మిగతా చోట్ల కూడా వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు ఈ బిల్లుకి వ్యతిరేకంగా కదిలారు.

ఇక ఏపీలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. కాంగ్రెస్, వామపక్షాలకు తోడు వైసీపీ నేతలు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. అయితే పార్లమెంట్ లో సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ బిల్లుకి మద్దతివ్వడం వైసీపీని ఇరుకున పడేసింది. పార్లమెంట్ లో మద్దతిచ్చి, ఇప్పుడీ ఆందోళనల్లో ఎలా పాల్గొంటారంటూ నేతల్ని నిలదీశారు మైనార్టీలు. దీంతో వారిది ఎటూ చెప్పుకోలేని పరిస్థితి అయింది.

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకి కూడా నిరసన సెగలు తగిలాయి. వైసీపీ ఎప్పుడూ ముస్లింలకు అండగా ఉంటుందని ఆయన ప్రకటన చేసినా, ప్రజలు ట్రోలింగ్ చేశారే తప్ప మద్దతు తెలపలేదు. కేవలం అసోం వరకే ఈ చట్టాన్ని పరిమితం చేస్తామని చెప్పిన బీజేపీ తర్వాత మాట మార్చిందని తప్పంతా ఆ పార్టీదేనంటూ వైసీపీ నేతలు వివరణ ఇచ్చుకుంటున్నారు.

అయితే ఈ విషయంలో రాష్ట్రంలోని టీడీపీ, జనసేన మాత్రం వైసీపీని విమర్శించే సాహసం చేయలేకపోతున్నాయి. ఎందుకంటే టీడీపీ కూడా బిల్లుకి మద్దతిచ్చింది, అటు జనసేనాని అమిత్ షాని, ఆయన నిర్ణయాలను ఆకాశానికెత్తేస్తున్నారు. దీంతో వామపక్షాలు, కాంగ్రెస్ కి మాత్రమే వైసీపీ టార్గెట్ అయింది.

అయితే అసలీ చట్టాలతో దేశంలో ఉన్న ముస్లింలెవరికీ ఇబ్బంది కలగదని, కేవలం శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం కోసమే వీటిని తీసుకొచ్చామని బీజేపీ చెబుతోంది. చట్టాలపై అవగాహన ఉన్నా లేకున్నా.. దేశవ్యాప్తంగా నిరసనలు మాత్రం రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు తారాస్థాయికి చేరుకోకముందే.. ఈ ఉదంతానికి తెరదించడం మంచిది.