బాలకృష్ణ చిత్రాలకి బిజినెస్ బాగా పడిపోయింది. ఒకప్పుడు చిరంజీవికి సమవుజ్జీ అనిపించుకున్న బాలకృష్ణ ఇప్పుడు చిరంజీవి మార్కెట్‌లో సగం కూడా చేయడం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలకి వచ్చిన చేదు ఫలితంతో బాలకృష్ణ చిత్రాలపై భారీగా వెచ్చించడానికి బయ్యర్లు వెనుకాడుతున్నారు. అయితే తన మార్కెట్ రియాలిటీ ఏమిటనేది రియలైజ్ అవడానికి బాలకృష్ణ సుముఖంగా లేరు.
రూలర్ చిత్రానికి పది కోట్ల పారితోషికం డిమాండ్ చేసారని, బాలయ్య అడిగితే ఇక నిర్మాత ఎదురు చెప్పడానికి, బేరమాడడానికి ఏమీ వుండదు. అతనికే పది కోట్లు ఇస్తే ఇక సినిమా బడ్జెట్ ఎంతవుతుంది? బాలకృష్ణతో నటించడానికి మామూలు హీరోయిన్లు కూడా ఎక్కువే డిమాండ్ చేస్తుంటారు. దర్శకుడు కనుక నిర్మాత గురించి ఆలోచించకపోతే ఇక ఆ చిత్రం బడ్జెట్ రికవర్ చేయడం చాలా కష్టం.
రూలర్‌కి నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా క్రేజ్ ఏమీ రాలేదు. ఓవర్సీస్ బిజినెస్ అయితే అసలు జరగలేదు. తెలుగు రాష్ట్రాలలో కూడా పలు చోట్ల అడిగిన రేట్లు రాక నిర్మాత స్వయంగా విడుదల చేసుకోక తప్పలేదు.
స్వీయ నిర్మాణంలోనే సినిమాలు చేస్తానని చేయాలని భావించిన బాలకృష్ణ అది ఎంత భారమో తెలుసుకుని నిర్మాణం పక్కన పెట్టారు. కానీ నిర్మాతల శ్రేయస్సుని మాత్రం ఆలోచించకుండా తన మార్కెట్‌కి మించి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.