మూడేళ్ల క్రితం వెంకటేష్ బర్త్‌డేకి త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమా అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు హారిక హాసిని రాధాకృష్ణ. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఈ వెంకీ బర్త్‌డేకి అలాంటి పోస్టర్ కూడా ఏదీ వదల్లేదు.
నిజానికి త్రివిక్రమ్‌తో వెంకటేష్ కాంబినేషన్‌కి చాలా క్రేజ్ వుంది. ఎఫ్ 2 చిత్రంలో వెంకీ కామెడీకి కురిసిన కాసుల వర్షం చూస్తే త్రివిక్రమ్ మరోసారి 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' లాంటిది వెంకీతో తీస్తే ఆకాశమే హద్దవుతుంది.
అయితే త్రివిక్రమ్ వంద కోట్ల పైచిలుకు మార్కెట్ వున్న హీరోలతో తప్ప మిగతా వారితో అసలు సినిమాలే చేయడం లేదు. త్రివిక్రమ్‌తో పని చేయాలనే కోరిక వున్న యువ హీరోలు పరిశ్రమలో చాలా మందే వున్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం 'క్రీమ్'తో చేస్తున్నాడే తప్ప కిందకి దిగనంటున్నాడు. 'అజ్ఞాతవాసి' తర్వాత నాని రేంజ్ హీరోలతో చేస్తున్నాడనే టాక్ వినిపించినా కానీ పలు కాంప్రమైజ్‌లతోనే స్టార్ హీరోలతో అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాలు చేసాడు.
అల వైకుంఠపురములో తర్వాతి చిత్రం కూడా ఎన్టీఆర్‌తో చేయడానికి త్రివిక్రమ్ కమిట్ అయ్యాడు. అలాగే మహేష్, చరణ్ ఇద్దరితోను చెరో చిత్రం చేస్తానని మాట ఇచ్చాడు. ఈ నేపథ్యంలో వెంకటేష్‌తో త్రివిక్రమ్ అనేది ఇప్పట్లో సాధ్యం కాదనే అనుకోవచ్చు.