రాజధానిపై అధ్యయనానికి జగన్ సర్కార్ నియమించిన జీఎన్ రావ్ కమిటీ శుక్రవారం తన నివేదికను సీఎంకు సమర్పించింది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలుకు హైకోర్టు ఇవ్వాలని ఆ కమిటీ సిఫార్స్ చేసింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి శ్రీబాగ్ ఒప్పందంపై మళ్లింది. ఇంతకూ శ్రీబాగ్ ఒప్పందంలో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. శ్రీబాగ్ ఒడంబడిక ఏం చెబుతున్నదంటే…
మద్రాస్ ప్రెసిడెన్సిలో మనం ఉండేవాళ్లం. శ్రీకాకుళం మొదలుకుని కర్నూలు వరకు, అలాగే ఇప్పటి కర్నాటకలో ఉన్న బళ్లారి తదితర ప్రాంతాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండేవి. తమిళుల వివక్షకు గురవుతుండడంతో వారి నుంచి వేరుపడాలనే ఆలోచనలు తెలుగు వారిలో మొదలయ్యాయి. ముఖ్యంగా కోస్తా ప్రాంతం వారు తమిళనాడు నుంచి వేరు పడాలని పట్టుదలగా ఉండేవారు. ఈ నేపథ్యంలో రాయలసీమ వాసులను ఒప్పించేందుకు ప్రయత్నించారు.
అయితే కోస్తావారితో కలిసి ఉండడం రాయలసీమ నాయకులకు ఇష్టం లేదు. ఉంటే తమిళులతో కలసి ఉండడమా లేక ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంగా ఏర్పడాలని రాయలసీమకు చెందిన పప్పూరి రామాచార్యులు, కడప కోటిరెడ్డి తదితరులు ఆలోచించారు.
భాషా ప్రాతిపదికన రాష్ట్రంగా ఏర్పడాలంటే రాయలసీమ వాసులను కలుపుకుని పోవాల్సిన తప్పనిసరి పరిస్థితిని కోస్తా నాయకులైన పట్టాభిసీతారామయ్య, తదితరులు గుర్తించారు. దీంతో రాయలసీమ నేతలతో వారు ఓ ఒప్పందానికి వచ్చారు.
1937, నవంబర్ 16న మద్రాస్‌లోని కాశీనాధుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్‌లో కోస్తా, రాయలసీమ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య ఓ ఒప్పందం జరిగింది. దాన్నే శ్రీబాగ్ ఒడంబడిక అంటారు.
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం….
ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఒక కేంద్రం విశాఖపట్నంలోనూ, మరొక కేంద్రం అనంతపురంలోనూ ఏర్పాటు చేయాలి. నీటి పారుదల పథకాలలో పదేళ్లు లేదా అవసరమైన అంతకంటే ఎక్కువ కాలం గానీ రాయలసీమ జిల్లాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదుల నీటి వినియోగం కోసం ఉపయోగపడే భారీ పథకాలు ఈ జిల్లాల కోసమే కేంద్రీకరించాలి.
పై నదుల నీటి పంపకం విషయంలో వివాదం ఏర్పడినప్పుడు , రాయలసీమ జిల్లాల అవసరాలను మొదట తీర్చాలి. సమాన సంఖ్య ప్రాతిపదికన అసెంబ్లీ సీట్లు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర రాజధాని లేదా హైకోర్టులలో రాయలసీమ వాసులు దేనిని కోరుకుంటే దాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలి.
సంతకాలు చేసిన వారు
కడప కోటిరెడ్డి (చైర్మన్ కమిటీ), కల్లూరు సుబ్బారావు, హెచ్ సీతారామిరెడ్డి, బి. పట్టాభిసీతారామయ్య, కొండా వెంకటప్పయ్య, పప్పూరి రామాచార్యులు, ఆర్.వెంకటప్పనాయుడు
కర్నూలు రాజధానిగా...
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 29న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. డిసెంబరు 19న …పొట్టి శ్రీరాములు అమరుడైన నాలుగో రోజు పార్లమెంటులో నాటి ప్రధాని నెహ్రూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
చివరికి 13 జిల్లాల తెలుగు రాష్ట్రం మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఏర్పడింది. అదే ‘ఆంధ్రరాష్ట్రం’ గా అవతరించింది. శ్రీబాగ్ ఒడంబడిక మేరకే కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
నేటికీ సీమకూ అన్యాయమే
ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాజధాని అయ్యింది. నాటి నుంచి నేటి వరకు రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉందని ఈ ప్రాంత ప్రజల భావన. అందుకే శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని పదేపదే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఒకవైపు ముఖ్యమంత్రులంతా సీమవాసులే ఉన్నప్పటికీ, అభివృద్ధి, సాగునీళ్లు అన్నీ కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని సీమ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీఎన్ రావు కమిటీ సిఫార్సులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోసారి శ్రీబాగ్ ఒప్పందం, కర్నూలుకు హైకోర్టు అంశాలు తెరమీదకి వచ్చాయి.