ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానని, ఒకవేళ ఎవరైనా కాదు, కూడదంటే మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సిందేనని రాయలసీమ ఉద్యమనేత, మాజీ మంత్రి మైసూరారెడ్డి తేల్చి చెప్పారు.
వైఎస్ జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ ప్రకటనపై ఆయన పలు మీడియా సంస్థలతో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు.రాష్ట్ర ప్రజలంతా పన్నులు కట్టగా వచ్చే ఆదాయంతో కేవలం అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తామంటే కుదరదని హెచ్చరించారు.
రాజధానికి భూమిలిచ్చాం కాబట్టి క్యాపిటల్, సచివాలయం, ఇతర కార్యాలయాలు, సంస్థలన్నీ తమ వద్దే ఉండాలని కోరడం సబబు కాదన్నారు. రాజధానికి ఉత్త పుణ్యానికే భూములు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ఎవరైనా భూములిస్తే డెవలప్ చేసి ఇవ్వడం సహజంగా జరిగే ప్రక్రియ అని ఆయన కొట్టి పడేశారు.
అయితే అమరావతిలో రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ చేయడం చంద్రబాబు చేసిన తప్పిదమన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం తమ ప్రాంతంలో రాజధాని, హైకోర్టులలో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని డిమాండ్, భావోద్వేగాలు రాయలసీమ వాసుల్లో బలంగా ఉన్నాయన్నారు.
రాజధాని రైతులు భూములిచ్చి త్యాగం చేశారని, కాబట్టి ప్రతిదీ తమకే కావాలని కోరుకోవడం స్వార్థపూరిత చింతనే అని విమర్శించారు. అయితే భూమిలచ్చారు కాబట్టి రాజధాని, సచివాలయం, హైకోర్టు, ఇతర కార్యాలయాలు తమ వద్దే ఉంచుకోవాలనుకుంటే ఎవరూ అభ్యంతరం చెప్పరని, అయితే తమకూ అలాంటి అభిలాషలే ఉన్నాయని, కావున మా రాష్ట్రం మాకు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకుని గ్రేటర్ రాయలసీమ రాష్ట్రంగా ఏర్పడితే…ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకొని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని మైసూరా చెప్పారు.రాజధాని అమరావతి లేకపోతేనో, వాళ్లతో కలిసి ఉంటే తప్ప రాయలసీమ వాసులు బతకలేని దుస్థితిలో లేరని ఆయన అన్నారు.
అమరావతిని రాజధానిగా ప్రకటించడానికి ముందు చంద్రబాబు కనీసం మాట మాత్రమైనా ఎవరితోనూ చర్చించలేదని మైసూరా అన్నారు. నార్త్‌కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు కూడా తమ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదనే అసంతృప్తితో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కావున అన్నీ తమ ప్రాంతంలోనే ఉండాలనే డిమాండ్‌తో మూడు రాష్ట్రాల విభజనకు దారితీసే పరిస్థితులను తీసుకురావద్దని ఆయన హితవు పలికారు.