దిశ హత్యాచారం కేసులో కీలక నిందితులు నలుగురు ఎన్ కౌంటర్ కు గురైన విషయం తెలిసిందే. ఈరోజు దీనికి సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఎన్ కౌంటర్ లో మరణించిన నిందితుల మృతదేహాల్ని బంధువులకు అప్పగించాలా లేక మరోసారి రీ-పోస్టుమార్టం నిర్వహించాలా అనే అంశంపై ఈరోజు కీలక తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు.
ఎన్ కౌంటర్ పై అనుమానాలు వ్యక్తంచేస్తూ కొన్ని మహిళా సంఘాలు, మరికొంతమంది న్యాయవాదులు దీనిపై పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును హైకోర్టు పరిథిలోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు, ఈ కేసుకు అనుబంధంగా మరోసారి పోస్టుమార్టం చేయాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు.
అటు ప్రభుత్వం తరఫు న్యాయవాది మాత్రం మరోసారి పోస్టుమార్టం చేయాల్సిన అవసరం లేదని, హైకోర్టు నిబంధనల మేరకు ఇప్పటికే ఓసారి పోస్టుమార్టం నిర్వహించామని గుర్తుచేశారు.దీనిపై హైకోర్టు ఈరోజు కీలక తీర్పు ఇవ్వబోతోంది. హైకోర్టు ఆదేశిస్తే, ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు మరోసారి నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారు. అలా జరగని పక్షంలో మృతదేహాల్ని బంధువులకు అప్పగిస్తారు. ప్రస్తుతం వీటిని గాంధీ హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు.