తన అనుమతి లేనిదే వైసీపీకి చెందిన ఏ ఒక్కర్నీ నగరిలో అడుగు పెట్టనివ్వనని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా స్పష్టం చేశారు. ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను ఆమె బయట పెట్టారు. అంతేకాదు, నగరిలో తలదూర్చాలని భావిస్తున్న సొంత పార్టీ నేతలకు రోజా ఘాటు హెచ్చరిక చేశారు.
ఆ మధ్య రోజాకు తెలియకుండా కొందరు ముఖ్య నేతలు నగరిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత స్వయంగా జగన్ జోక్యం చేసుకోవడంతో అంతా సర్దుమణిగింది.
ఈ నేపథ్యంలో రోజా మరోసారి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మంత్రి పదవి రాకపోవడానికి సొంత జిల్లాలోని కొన్ని శక్తులు అడ్డుకున్నాయనే ప్రచారంపై ఏమంటారని రోజాను ప్రశ్నించారు. రోజా స్పందిస్తూ ….అలాంటిదేమీ లేదని రోజా కొట్టి పారేశారు.
పదేళ్లుగా జగన్‌తో పాటు నడుస్తున్నట్టు తెలిపారు. ప్రతి సందర్భంలోనూ జగన్‌కు అండగా ఉండడం వల్ల సహజంగానే పార్టీ అధికారంలోకి రాగానే ఫలానా వాళ్లకు మంత్రి పదవులొస్తాయని జనం ఫిక్స్ అయ్యారన్నారు.
ఇందులో భాగంగా కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్‌తో పాటు తన పేరు కూడా ప్రచారంలోకి వచ్చిందన్నారు. చివరికి మంత్రి పదవి దక్కకపోయే సరికి …ఎవరో ఏదో చేసి ఉంటారని అనుకుంటారన్నారు. అయితే ఒకే జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు.
తన జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని కాదని, తనకు ఇవ్వడం సాధ్యం కాదని రోజా చెప్పుకొచ్చారు.
అయితే తనకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారన్నారు. జగన్ మనసులో తనకు చోటు ఉందని, భవిష్యత్‌లో అంతా మంచే జరుగుతుందని రోజా చెప్పుకొచ్చారు. ఏ అసెంబ్లీలో, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత వరకూ చెప్పని విధంగా అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ రోజా తన చెల్లి అని, ఆమె ఏ తప్పూ చేయలేదని చెప్పారన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
ఆ మాట కోసమైనా తాను జీవితాంతం జగన్‌కు రుణపడి ఉండాలనే భావన తనలో కలిగినట్టు రోజా తెలిపారు. నగరిలో అడుగు పెట్టాలంటే రోజా పర్మీషన్ కావాలా? అని యాంకర్ సూటిగా ప్రశ్నించారు.
రోజా కూడా అంతే సూటిగా … కచ్చితంగా అని స్పష్టం చేశారు. తాను ఇతర నియోజకవర్గంలోకి అడుగు పెట్టనని, తన నియోజకవర్గంలో అనవసరంగా డిస్ట్రమెన్స్ చేస్తే వదిలి పెట్టనని రోజా తేల్చి చెప్పారు. ఆ విషయంలో తాను గెలిచిన తర్వాత మొట్ట మొదటి రోజే జగన్‌కే తేల్చి చెప్పినట్టు రోజా మరోసారి స్పష్టం చేశారు.
జగన్ కూడా అనేక సందర్భాల్లో, అనేక కేబినెట్ మీటింగుల్లో ఇదే విషయాన్ని స్పష్టంగా పార్టీ ప్రజాప్రతినిధులకు చెప్పినట్టు రోజా తెలిపారు. ఏ జిల్లాలోనైనా ఆయా నియోజకవర్గాల్లో సంబంధిత ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండా వెళ్లకూడదని, తెలియ కుండా ఏ పనిచేయకూడదని జగన్ చెప్పారన్నారు.
ఎందుకంటే నియోజకవర్గ బాధ్యతలు ఒకరికి అప్పగించిన తర్వాత ఎవరు పనిచేస్తారు, ఎవరు పనిచేయరు, పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో ఎమ్మెల్యేలకే తెలుస్తుందన్నారు. పార్టీకి అన్యాయం చేసిన వాళ్లకు ఎవరో వచ్చి తమ బంధువులనో, తమకు ఇంపార్టెన్స్ ఇచ్చారనో, తమ గ్రూపనో పదవులు ఇస్తే ఎవరూ ఒప్పుకోరు కదా అని రోజా ఎదురు ప్రశ్నించారు.
అది తానే కాదు, 13 జిల్లాల్లో ఏ ఎమ్మెల్యే కూడా ఒప్పుకోరన్నారు. కానీ రోజా అనగానే సినిమా ఆర్టిస్ట్ కాబట్టి దానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల , నగరిలోనే ఏదో జరిగిపోతోందన్నట్టుగా ప్రచారం అవుతోందన్నారు. తాను డిప్యూటీ సీఎంగా ఎక్కడైనా తిరగొ చ్చని, రోజా దగ్గర పర్మీషన్ తీసుకోనవసరం లేదని నారాయణస్వామి అన్నారు కదా అని ప్రశ్నించగా … ఆ మాట జగన్‌కు చెప్పే ధైర్యం ఆయనకు ఉండాలి అని అన్నారు.
ఎందుకంటే జగనే జిల్లాలకు వచ్చేటప్పుడు … ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెప్పే వస్తారన్నారు. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రినని ఎక్కడికంటే అక్కడికి వెళ్లరు కదా అని అన్నారు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుందని రోజా సుతిమెత్తగా హెచ్చరించారు. డిప్యూటీ సీఎం తెలియక చేశారని తాను అనుకుంటున్నానని రోజా చెప్పారు.