ప్రేక్షకుడిని పట్టించుకోకుండా, సినిమాలో పాత్రలు తమతో తాము మాట్లాడుకుంటూ ఉంటాయి, కథంతా ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది, కానీ జరగబోయేది ఏమిటో ప్రేక్షకుడికి థ్రిల్.. ఒక పది నిమిషాల్లో చెప్పదగిన కథతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయాలంటే రాసే వాడికి నేర్పుండాలి, తీసేవాడి చేతిలో మంత్రజాలముండాలి!
ఆ రెండూ కలిగిన వాడు క్వెంటిన్ టరంటినో. తన రెండో సినిమాతోనే హాలీవుడ్ సినీ చరిత్రనే మార్చేశాడు. ప్రపంచ సినిమాపై తన ముద్రను వేశాడు. వాస్తవానికి అతడు అప్పటికే ఒక సినిమా తీశాడని చాలా మంది ప్రేక్షకులకు తెలియదు.
'రిజర్వాయర్ డాగ్స్' అనే ఇండిపెండెంట్ సినిమాతో క్వెంటిన్ టరంటినో దర్శకుడిగా మారాడు. అంతకు ముందు బోలెడన్ని సినిమాలకు పని చేసిన రచయిత అతను. 'పల్ప్ ఫిక్షన్' తో ఆశ్చర్యపరిచిన తర్వాత అతడి తొలి సినిమా 'రిజర్వాయర్ డాగ్స్' పై అందరి దృష్టీ పడింది. రెండో సినిమా క్లాసిక్ అయ్యాకా, మొదటి సినిమాకు అదే స్థాయి హోదా లభించింది.
1994… హాలీవుడ్ కు సంబంధించి ఒక సంచలన సంవత్సరం. హాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్స్ వచ్చాయి ఆ సంవత్సరంలో. ప్రపంచ సినీ ప్రియులందరినీ శాశ్వతంగా అలరించే సినిమాలు వచ్చాయి ఆ సంవత్సరంలో. జురాసిక్ పార్క్, ది లయన్ కింగ్, ది షాషాంక్ రిడెంప్షన్, ఫారెస్ట్ గంప్..వాటికి తోడు పల్ప్ ఫిక్షన్. 1994 అక్టోబర్ నాటికి ఈ ఐదు ఆల్ లైమ్ క్లాసిక్స్ థియేటర్లో ఉన్నాయి. వాటిల్లో దేన్ని చూడాలో నిర్ణయించుకోవడమో ప్రేక్షకుడికి పెద్ద పజిలే.
ఆ పాత ఆర్టికల్స్ చదివితే.. ఒక సినిమాకు మించి మరోటి రావడంతో.. కొన్ని సినిమాలకు తగినంత ఫేమ్ రావడం లేదని కొంతమంది క్రిటిక్స్ బాధపడిపోయారు. ఒక సినిమా గొప్పదనం మరుగున మరో సినిమా గొప్పదనం పడిపోతోందని వారు బాధపడిపోయారు. కానీ.. అవన్నీ ఆ తర్వాతి కాలంలో శాశ్వత కీర్తిని పొందాయి.
ఇంటర్నెట్ మూవీ డాటా బేస్ లో 1998 నుంచి 'షాషాంక్ రిడెంప్షన్' నంబర్ వన్ ప్లేస్ ను కొనసాగిస్తూ ఉంది. 'లయన్ కింగ్' ప్రపంచాన్ని ఇప్పటికీ అలరించే సినిమాగా నిలుస్తోంది. సింబా ప్రపంచానికే ఫేవరెట్ అయ్యాడు. 'ఫారెస్ట్ గంప్' సంగతి సరేసరి, ఇప్పుడు దాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారంటే దాని ఇన్ ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి ఆ క్లాసిక్స్ సినిమాలన్నింటి కన్నా విభిన్నమైనది 'పల్ప్ ఫిక్షన్'. ఫారెస్ట్ గంప్ కావొచ్చు, లయన్ కింగ్ కావొచ్చు.. ప్రేక్షకుడు సంతృప్తిగా ఇంటికెళ్లేందుకు తీసిన సినిమాలనిపిస్తాయి. 'షాషాంక్ రిడెంప్షన్' అయితే హీరోయిజం తరహా సినిమా. ఇలాంటి వాటి మూడ్ లో పల్ప్ ఫిక్షన్' వచ్చాకా..ఆ ఏడాది బెస్ట్ సినిమా విషయంలో ఫారెస్ట్ గంప్ ను కూడా మినహాయించవచ్చు అని కొంతమంది క్రిటిక్స్ కుండబద్ధలు కొట్టారంటే ఈ సినిమా కల్ట్ ఇమేజ్ ను అర్థం చేసుకోవచ్చు.
కథ అంటూ ఇది అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా, ఆ సినిమా కథేమిటో ప్రేక్షకుడే ఊహించుకోవాల్సి పరిస్థితిని కల్పించే సినిమా పల్ఫ్ ఫిక్షన్. నాన్ లినియర్ నెరేషన్ తో ప్రేక్షకుడికే ఒక పజిల్ ను ఇచ్చి పంపిస్తాడు దర్శక, రచయిత టరంటినో. జరిగిపోయిన కథను చూస్తుంటాం, కానీ జరిగేదేమిటో ఎగ్జయిట్ మెంట్. లెంగ్తీ సీన్లు.. వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూనే ఉంటారు.. ఏం జరిగిందనే దాని గురించి తమ మాటల్లో కొన్ని క్లూస్ ఇస్తూ ఉంటారు!
ముని వేళ్లపై నిలబెట్టే థ్రిల్లర్ కాదు, భయపెట్టే హారర్ కాదు, నవ్వించే కామెడీ కాదు.. ఒక డ్రగ్స్ ముఠాకు సంబంధించిన కథ, ప్రత్యేకంగా ప్రేక్షకుడిని అలరించడానికి అంటూ కథలో మలుపులు లేవు. కథ చెప్పే విధానమే థ్రిల్లింగ్, కథలు కథలుగా కథను చెప్పడమే మలుపు!
ఇలాంటి సినిమా తీయాలనే ఆలోచన, సినిమాను ఇలా కూడా తీయొచ్చు అనే ఆలోచన.. అదే పాతికేళ్ల కిందట ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పల్ప్ ఫిక్షన్ ను క్లాసిక్ అయ్యేలా చేసింది. ప్రేక్షకుడి ఇగో ప్లజర్ కోసమో, ఏదో సందేశం ఇవ్వడం కోసమో కాదు. అమెరికన్ పాప్ కల్చర్ లో పరిస్థితులను అద్దంలో చూపించే ప్రయత్నం పల్ప్ ఫిక్షన్. తెరనిండా రక్తం, డ్రగ్స్ మత్తు.. పేరులో ఫిక్షన్ ఉన్నా ఫిక్షన్ కాదు. తెరకెక్కించిన మూడ్ తో పచ్చిగా వాస్తవాలను చూపించిన సినిమా.
ఒక హోటల్ డైనింగ్ టేబుల్ వద్ద ఒక జంట మాట్లాడుకోవడంతో సినిమా మొదలవుతుంది. తమ చేతిలో ఉన్న వెపన్స్ చూపించి అక్కడి వారిని దోచుకోవాలని ఆ బ్రిటిష్ జంట అక్కడకు వచ్చి ఉంటుంది. అది వారి జీవితంలో తొలి దొంగతనం. వారిద్దరు తమ వ్యక్తిగత విషయాల గురించి వాదులాడుకుంటూ.. ఉన్నట్టుండి గన్స్ తీయడంతో కథ మొదలవుతుంది.
అక్కడ కట్ చేస్తే.. డ్రగ్ డీలర్(వింగ్ రేమన్) సూట్ కేస్ మిస్ కావడంతో దాన్ని తస్కరించిన కుర్రాళ్ల దగ్గరకు వస్తారు ఆ డ్రగ్ డీలర్ అసిస్టెంట్స్. వారి పేర్లు విన్సెంట్ వేగా(జాన్ ట్రవోల్టా) జూల్స్ విన్ ఫీల్డ్ (శ్యామూల్ జాక్సన్). డ్రగ్స్ తో కూడిన సూట్ కేస్ ను వెదుక్కొంటూ అక్కడకు వచ్చిన వీళ్లు తమ వ్యక్తిగత విషయాలను మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈ డ్రగ్స్ , క్రైమ్ దందా నుంచి తను బయటపడాలనుకుంటున్నట్టుగా జూల్స్ తన సహచరుడికి చెబుతుంటాడు. అతడికి అప్పటికే తాత్విక చింతన మొదలై ఉంటుంది. ఆ చర్చను చాలించి వీరు తమ అపోనెంట్ గ్యాంగ్ కు చెందిన కుర్రాళ్ల రూమ్ లోకి తుపాకులతో చొరబడతారు. జూల్స్ బైబిల్ సూక్తులు చెబుతూ, అది డ్రగ్స్ సూట్ కేసు అయినప్పటికీ దొంగతనం ఎంత పాపమో చెబుతూ… కుర్రాళ్ల నుంచి బ్రీఫ్ కేసు ను తీసుకుంటారు, అనూహ్యంగా ఆ కుర్రాళ్లు కాల్పులు జరపడంతో వీరు వారిని కాల్చి చంపాల్సి వస్తుంది.
తమ బాస్ భార్యను డిన్నర్ తీసుకు వెళ్లాల్సి వస్తుంది విన్సెంట్ వేగా. 1950స్ థీమ్ రెస్టారెంట్ కు వెళ్లి, అక్కడ డాన్స్ తో అదరగొట్టి ప్రైజ్ ను సైతం పొంది ఇంటికి వస్తారు వాళ్లు. ఇంటికొచ్చాకా ఆమె హెరాయిన్ అని కొకైన్ తీసుకుంటుందో, కొకైన్ అని హెరాయిన్ తీసుకుంటుందో కానీ.. అపస్మారక స్థితిలోకి వెళ్తుంది.
ఏం చేయాలో తెలియక వేగా ఆమెను వెంటనే తమకు డ్రగ్స్ సప్లై చేసే వాడి వద్దకు తీసుకెళ్తాడు. ఆమె బతకడం కష్టమని.. డైరెక్టుగా గుండె వద్దకు ఇంజక్షన్ షాట్ ఇస్తే ఛాన్సెస్ ఉన్నాయంటూ.. ఆమె గుండెల్లోకి ఇంజక్షన్ చప్పున దించే సీన్ చూస్తే.. డ్రగ్స్ తీసుకోవాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే వారిని హడలు గొడుతుంది. అక్కడితో అప్పటికే జరిగిన ఒక షార్ట్ స్టోరీ ముగుస్తుంది.
ఒక బాక్సింగ్ మ్యాచ్ ను ఫిక్స్ చేస్తాడు డ్రగ్ డీలర్. అతడితో తను ఓడిపోవడానికి అనుగుణంగా ఫిక్సింగ్ కు డబ్బులు తీసుకుని.. అందుకు విరుద్ధంగా తన అపోనెంట్ ను మ్యాచ్ లోనే ఓడించి, చంపేస్తాడు ఒక బాక్సర్(బ్రూస్ విల్లీస్). దీంతో డ్రగ్ డీలర్ కు కోపమొస్తుంది. ఆ బాక్సర్ ను చంపడానికి తన అసిస్టెంట్ విన్సెంట్ వేగా ను పంపిస్తాడు.
అప్పటికే బాక్సర్ ఆ ఇంటి నుంచి పరార్ అయ్యి ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ ను ఒక హోటల్ లో ఉంచి, అక్కడ నుంచి సిటీ వదిలి పారిపోవడానికి రెడీ అవుతుంటాడు, ఆ ఏజ్డ్ బాక్సర్ కు ఒక వాచ్ సెంటిమెంట్ ఉంటుంది. వియత్నాం వార్ లో తన తండ్రి చనిపోగా, ఆర్మీ ఆ వాచ్ ను వెనక్కు తెచ్చి ఇచ్చి ఉంటుంది. ఆ వాచ్ ను తన ఇంట్లో మరిచిపోయిన విషయం ఆ బాక్సర్ కు గుర్తొస్తుంది. దీంతో తప్పనిసరిగా మళ్లీ ఇంటికి వెళ్తాడు.
ఇతడి కన్నా ముందే అక్కడకు చేరుకున్న వేగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన తుపాకీ బయట పెట్టి టాయ్ లెట్ కు వెళ్తాడు. ఉన్నట్టుండి బాక్సర్ ఇంటికొస్తాడు. బయట తుపాకీ చూసి, బాత్ రూమ్ లో ఫ్లష్ సౌండ్ విని.. లోపల ఎవరున్నదీ అర్థం చేసుకుని డోర్ తెరవగానే తుపాకీతో విరుచుకుపడతాడు. కాల్పుల్లో వేగా మరణిస్తాడు.
అక్కడ నుంచి పారిపోతూ..ఆ బాక్సర్ రోడ్డు దాటుతుంటే.. అనుకోకుండా, ఆ రోడ్డున వస్తాడు డ్రగ్ డీలర్. బాక్సర్ కనిపించే సరికి ఆవేశంతో అతడిని కారుతో ఢీ కొడతాడు. లేచి పారిపోబోయిన బాక్సర్ ను డ్రగ్ డీలర్ వెంబడిస్తాడు. వీరిద్దరూ ఒక స్టోర్ లోకి ప్రవేశిస్తారు. అక్కడ ఇద్దరు ఘటికులు వారిద్దరికీ సర్ధి చెప్పినట్టుగానే చెప్పి.. ఇద్దరినీ బంధిస్తారు.
గే మనస్తత్వంతో ఉండే వాళ్లు డ్రగ్ డీలర్ ను రేప్ చేస్తారు! నెక్ట్స్ తనే అని అర్థం చేసుకున్న బాక్సర్ ఎలాగో తప్పించుకుని.. ఆ రేపిస్టులను చంపేసి డ్రగ్ డీలర్ ను రక్షిస్తాడు. ఒకర్నొకరు కొట్టుకుంటూ లోపలికి వెళ్లిన వీళ్లు, తనను వాళ్లు రేప్ చేశారనే విషయాన్ని బయట ఎక్కడా చెప్పొద్దని డ్రగ్ డీలర్ ప్రాధేయపడటం, దానికి బాక్సర్ సమ్మతించడంతో రాజీ కుదిరి బయటకొస్తారు. అక్కడితో దాదాపు చెప్పాలనుకున్న కథ అయిపోతుంది, కానీ సినిమా అయిపోదు!
స్టార్టింగ్ సీన్లో రెస్టారెంట్ లో రోబరీకి ప్లాన్ వేసిన బ్రిటన్ జంట స్టోరీ అలాగే పెండింగ్ లో ఉంది కదా, అదే రెస్టారెంట్లో డ్రగ్ డీలర్ అసిస్టెంట్స్ (జూల్స్, వేగా) కూడా భోజనం చేసి ఉంటారు. ఆ బ్రిటీష్ జంట దొంగతనంలో అప్రాంటీసే అని వీళ్లకు అర్థం అవుతుంది. వారిని కంట్రోల్ చేయడం వీళ్లకు చిటికెలో పని అవుతుంది.
అయితే.. వారిని బెదిరించి కాకుండా, ఇలాంటి దొంగతనాలు, ఇలాంటి పనులు ముళ్ల బాట అని, అలాంటి పనులు వద్దని, వాటిని మానుకోమని హితబోధ చేసి, వారి ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపిస్తారు. సరిగ్గా ఈ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి, తమ బాస్ అయిన డ్రగ్ డీలర్ సూట్ కేసును జూల్స్, వేగాలు వెదకడం ప్రారంభించడంతో సినిమా ముగుస్తుంది.
ఆరంభంలో వచ్చే ఈ సీన్ క్లైమాక్స్ లో ముగియడంతో సినిమా ముగుస్తుంది. అసలు కథ ప్రకారం.. అది మధ్యలో ఎక్కడో ఉండాల్సిన సీన్. అప్పటికే విషాదంగా అయిన వ్యక్తుల జీవితంలో వారిలో ఒకరు చనిపోవడానికి ముందు వచ్చిన పరివర్తనను చూపిస్తూ సినిమా ముగుస్తుంది.
కథ మొత్తం పలు షార్ట్ స్టోరీస్ తరహాలో సాగుతుంది. వాటిల్లో కొన్ని షార్ట్ స్టోరీస్ గతంలో జరిగినవి, మరి కొన్ని వర్తమానం స్టోరీలు. అలాగని ఒక క్రమంలో సాగవు. వర్తమానం సీన్లను వెనుక, గతంలోని సీన్లను ఆ తర్వాత చూపిస్తాడు దర్శక రచయిత. ఫ్లాష్ బ్యాక్ సీన్ లోనే క్లైమాక్స్ పెట్టి ఒక సినిమాను ముగిస్తే ఎలా ఉంటుందో.. పల్ప్ ఫిక్షన్ ఆ తరహాలో ముగస్తుంది! కథ ఎత్తుగడే నాన్ లినియర్ తరహాలో ఉండటంతో.. ఫ్లాష్ బ్యాక్ సీన్ తో సినిమా ముగిసినా, అది కూడా ఒక గొప్ప క్లైమాక్స్ గా నిలుస్తుంది.
హాలీవుడ్ చరిత్ర తిరగరాయడం మొదలైంది ఈ సినిమాతోనే. పల్ప్ ఫిక్షన్ తో హాలీవుడ్ లోనే కాదు, ప్రపంచ సినిమాలోనే కొత్త ప్రస్థానం ప్రారంభం అయ్యింది. నియో-నార్ కథలతో, నాన్ లినియర్ రచన, దర్శకత్వాలతో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. భారతీయ సినిమాలోనూ, అందునా తెలుగు వాళ్లు కూడా నాన్ లినియర్ పద్ధతిలో సినిమాలను ఈ మధ్యనే అందుకున్నారు.
చందమామ కథలు, కేరాఫ్ కంచరపాలెం.. వంటి సినిమాలు వచ్చాయంటే.. వీటన్నింటికి పాతికేళ్ల కిందట టరంటినో వేసిన పల్ప్ ఫిక్షన్ అనే బీజమే కారణం! అయితే నాన్ లినియర్ పద్ధతిలో ఎన్నో కథలను చెప్పారు కానీ, మరో పల్ప్ ఫిక్షన్ స్థాయి సినిమా మాత్రం మరోటి రాలేదు. అలాంటి మరో సినిమాను తీయడం హాలీవుడ్ కే కాదు, ఆఖరికి టరంటినోకు కూడా ఇప్పటి వరకూ మళ్లీ సాధ్యం కాలేదు. ఆ తర్వాత టరంటినో మరెన్నో అద్భుతమైన సినిమాలను తీశాడు. పల్ప్ ఫిక్షన్ మాత్రం వన్ అండ్ ఓన్లీ!
-జీవన్ రెడ్డి.బి