ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో దళిత యువతిపై జరిగిన సామూహిక హత్యాచారంపై యావత్ దేశం స్పందించింది. బాధితురాలి పక్షాన బాలీవుడ్ నటీనటులు, దర్శకనిర్మాతలు నోరు తెరిచి అన్యాయంపై నిరసన గళం వినిపించారు. అయితే టాలీవుడ్ మాత్రం మాటమాత్రమైనా కనీసం ఇది అన్యాయమని అన్న పాపాన పోలేదు.
ఈ నేపథ్యంలో మొట్ట మొదటి సారిగా హాథ్రస్ దుర్ఘటనతో పాటు అత్యాచారాలు, హత్యాచారాలపై టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నోరు తెరిచారు. మహిళలపై లైంగిక దాడులను ఎవరూ పట్టించుకోకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా ‘పూరీ మ్యూజింగ్స్’లో ఆయన తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పూరీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘మనందరం నిజాలు మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. భారత్‌లో ప్రతి 15 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోంది. ప్రతిరోజూ 100 అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయి. మహిళలపై రోజూ నాలుగు లక్షలపైగా దాడులు జరుగుతున్నాయి.
ఇటీవల హాథ్రస్‌లో సామూహిక అత్యాచారం. వాళ్లు అత్యాచారం చేయడం మాత్రమే కాదు.. అతి కిరాతంగా హింసించారు. మహిళలకు అన్యాయం జరిగితే న్యాయం జరగడం పక్కన పెట్టండి.. న్యాయం కోసం పోరాటం చేయాల్సి వస్తోంది ఈ దేశంలో.. ఏంటీ ఖర్మ! ఈ దేశంలో ఆడవాళ్ల కోసం ఆడవాళ్లే ఫైట్ చేయాల్సి వస్తోంది. మగవాళ్లు మాత్రం పట్టించుకోవడం లేదు’అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
‘ఆడవాళ్ల కోసం నిలబడండి. పోరాటం చేయండి. తెలంగాణలో దిశాకు జరిగిన న్యాయం ఈ దేశంలో ప్రతి అమ్మాయికి జరగాలి. మొన్న ఆగస్టు 15న మనందరం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం. అదేరోజు ఓ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా?’ అని పూరీ భావోద్వేగంతో ప్రశ్నించారు.
పాలకులపై పొగడ్తల వర్షం కురిపించడానికి సినీ నటులు ముందుంటారనే అభిప్రాయం జనాల్లో ఉంది. ఇదే పాలకుల అన్యాయంపై ప్రశ్నించడానికి మాత్రం వాళ్ల నోర్లు రావనే విమర్శలు బలంగా ఉన్నాయి. హాథ్రస్ ఘటనపై టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చూశాం. తాజాగా పూరీ జగన్నాథ్ ఈ మాత్రమైనా మాట్లాడినందుకు అభినందించాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండడం విశేషం.