ఇండియాలో కోవిడ్-19 పీక్ స్టేజ్ ను దాటేసిందని అంటోంది కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక. సెప్టెంబర్ నెలలో ఇండియాలో కోవిడ్-19 పతాక స్థాయికి చేరిందని, ఇక తగ్గుముఖం పట్టవచ్చనే అంచనాలను వేసింది ఆర్థిక శాఖ. ఎకానమీ కూడా రికవరీ బాట పట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయపడింది.
ప్రస్తుతం దేశంలో జనజీవనం దాదాపు సాధారణ స్థితికి వచ్చింది. థియేటర్లు, స్కూళ్లు, కాలేజీలు, ప్రజారవాణా, సాఫ్ట్ వేర్ ఆఫీసులను మినహాయిస్తే మిగతా వాటిల్లో 80 శాతం వరకూ తిరిగి యథాతథ స్థితికి వచ్చాయి. బస్సు ప్రయాణాలు కూడా చేయడానికి ప్రజలు క్షేత్ర స్థాయిలో పెద్దగా భయపడటం లేదు. ప్రధాన నగరాల మధ్యన ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నడుస్తున్నాయి.
థియేటర్లకు ఈ నెల మూడో వారం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే స్కూళ్లను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వదిలేసింది కేంద్రం. ఇలాంటి పరిణామాల మధ్యన కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక ఆసక్తిదాయకంగా ఉంది.
సెప్టెంబర్ తొలి పక్షంతో పోలిస్తే.. రెండో పక్షం నుంచి రోజువారీగా కోవిడ్-19 కేసుల యావరేజ్ తగ్గిందని ఆర్థిక శాఖ నివేదికలో పేర్కొన్నారు. సెప్టెంబర్ ప్రథమార్థంలో డైలీ యావరేజ్ కేసుల సంఖ్య 93 వేల వరకూ ఉండగా, ద్వితియార్థంలో రోజువారీ సగటు కేసుల సంఖ్య 83 వేల స్థాయికి తగ్గింది. పక్షం రోజుల పాటు ఆ మార్పు స్పష్టంగా నమోదైంది.
అలాగే యాక్టివ్ కేసుల లోడ్ కూడా క్రమంగా తగ్గింది. సెప్టెంబర్ ద్వితీయార్థంలో ప్రతి రోజూ కొత్త కేసుల కన్నా రికవరీ కేసుల సంఖ్య తప్పనిసరిగా ఎక్కువగా నమోదైంది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షల స్థాయి నుంచి 9 లక్షల స్థాయికి తగ్గాయి.