కమిటీ నివేదిక ఇచ్చారు, ఇప్పుడేం చెప్తావ్ పవన్..!

అసెంబ్లీలో మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే పవన్ కల్యాణ్ ట్విట్టర్లో యాక్టివ్ అయ్యారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని నాశనం చేస్తారా, అమరావతిలో భూములిచ్చిన రైతుల్ని అన్యాయం చేస్తారా.. అంటూ…

అసెంబ్లీలో మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే పవన్ కల్యాణ్ ట్విట్టర్లో యాక్టివ్ అయ్యారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని నాశనం చేస్తారా, అమరావతిలో భూములిచ్చిన రైతుల్ని అన్యాయం చేస్తారా.. అంటూ చెలరేగిపోయారు. వరుస ట్వీట్లతో జగన్ పై తనకున్న అక్కసునంతా వెళ్లగక్కారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గారనుకోండి. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చాక మాట్లాడతానంటూ పవన్ వేచి చూశారు.ఆ నివేదిక రానే వచ్చింది. రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా చేస్తామని, మూడు రాజధానుల్లో పాలన సాగించవచ్చని జి.ఎన్.రావు కమిటీ నివేదిక సారాంశం.

మరి కమిటీ సభ్యుల మీడియా సమావేశం అయిపోయినా పవన్ ఇంకా స్పందించలేదెందుకో. పొరపాటున కమిటీ నివేదికను అధ్యయనం చేయడానికి మరో సబ్ కమిటినీ వేశారా ఏంటి అని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.జగన్ ని విమర్శించడానికి గంటల వ్యవధిలో అంతెత్తున లేచిన పవన్, కమిటీ నివేదికపై కనీసం స్పందించేందుకు కూడా ఎందుకు రాలేదో ఆయనకే తెలియాలి.

మరోవైపు రాజధాని ప్రాంతంలో రైతుల కష్టాలు తెలుసుకోడానికి నాదెండ్ల మనోహర్ ని, నాగబాబుని పంపిన పవన్.. రాయలసీమ, ఉత్తరాంధ్రకు మరో బృందాన్ని పంపిస్తారా. ఆయా ప్రాంతాల వాసులు తమ సంతోషాన్ని చెప్పుకోవాలనుకుంటున్నారు. అది కూడా వింటారా. ఈ ప్రయత్నం చేసిన పవన్, ఆ ప్రయత్నం కూడా చేయాలి కదా. అప్పుడే ఆయనకి మూడు ప్రాంతాలపై అభిమానం ఉన్నట్టు లెక్క. 

మొత్తమ్మీద పవన్ రాజధానిపై చాలా ఆవేశంగా, ఆత్రంగా స్పందించి అప్రతిష్ట మూటగట్టుకున్నారు. మరోసారి అలాంటి అపవాదులొస్తాయనే కమిటీ నివేదికపై ఆయన మౌనం వహిస్తున్నారు. లేకపోతే కచ్చితంగా ఈపాటికి స్పందించేవారే. రాజధాని విషయంలో పవన్ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచక్కలా మారింది.