ఏపీలో వృద్ధాప్య పెన్షనర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ ను సిద్ధం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కొత్త సంవత్సరంలో తొలి నెలలోనే వృద్ధులు నెలనెలా అందుకునే పెన్షన్ మొత్తం రెండు వేల ఐదు వందల రూపాయలకు పెరగనుంది.
ఇప్పటి వరకూ ఏపీలో రెండు వేల రెండు వందల యాభై రూపాయల మొత్తాన్ని పెన్షన్ గా అందిస్తున్నారు. దానికి రెండు వందల యాభై రూపాయల మొత్తాన్ని పెంచనుంది ప్రభుత్వం.
తాము అధికారంలోకి వస్తే పెన్షన్ మొత్తాలను ప్రతి యేటా రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుతామని ఎన్నికల హామీల్లో జగన్ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల ఏడాదిలో పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేశారు.
ఎన్నికలకు మూడు నాలుగు నెల సమయంలో వెయ్యి రూపాయలుగా ఉన్న పెన్షన్ ను రెండు వేలకు పెంచారు. తద్వారా ఓట్లకు గాలం వేసే ప్రయత్నం జరిగింది.
అయితే అంతకు ఐదేళ్ల కిందట ఇచ్చిన హామీని ఎన్నికల చివరి సంవత్సరంలో అమలు చేసిన చంద్రబాబును ప్రజలు విశ్వసించలేదు. చిత్తుగా ఓడించారు. పెన్షనర్ల ఓట్లపై అప్పట్లో టీడీపీ బాగా ఆశలు పెట్టుకుని కనిపించింది. అయితే అవి కూడా పడినట్టుగా లేవు.
ఇక తాము అధికారంలోకి వస్తే ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తామన్న మాటకు తగ్గట్టుగా వైఎస్ జగన్ ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే మెనిఫెస్టోలోని 90 శాతం హామీలను వైఎస్ జగన్ అమల్లో పెట్టారు. వృద్ధాప్య పెన్షన్ మొత్తాన్ని కూడా రెండోసారి పెంచారు.