పనికిరాని అధ్యక్ష పదవి …పార్టీ మారాడు ఎమ్మెల్సీ అయ్యాడు!

రాజకీయాల్లో సిద్ధాంతాలు, పార్టీకి విధేయంగా ఉండటం, ఎదిగేందుకు అవకాశమిచ్చిన పార్టీని వదిలేయడమా అనే గుంజాటన ఇలాంటివన్నీ రాజకీయ నాయకులకు పనికిరావు. ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నవారికి పదవులు దక్కవు. సమయం వచ్చినప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకున్నవాడే…

రాజకీయాల్లో సిద్ధాంతాలు, పార్టీకి విధేయంగా ఉండటం, ఎదిగేందుకు అవకాశమిచ్చిన పార్టీని వదిలేయడమా అనే గుంజాటన ఇలాంటివన్నీ రాజకీయ నాయకులకు పనికిరావు. ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నవారికి పదవులు దక్కవు. సమయం వచ్చినప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకున్నవాడే నిజమైన రాజకీయ నాయకుడు.

రాజకీయాల్లో కామన్ సెన్స్, టైం సెన్స్ చాలా ముఖ్యం. ఇవి ఉన్నవారికి అదృష్టం కలిసి వస్తుంది. కొందరికి రాకపోవొచ్చు కూడా. ఇదంతా తలరాతను బట్టి ఉంటుంది. తెలంగాణా టీడీపీగా అధ్యక్షుడిగా ఉన్న బీసీ నాయకుడు ఎల్. రమణ మొదటి నుంచి టీడీపీని అంటిపెట్టుకొని ఉన్నాడు. అలా ఉన్నందుకు ఆయనకేమీ అన్యాయం జరగలేదు. మూడు దశాబ్దాల పాటు టీడీపీతో ప్రయాణించిన రమణ  ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా తెలుగుదేశం పార్టీ హయాంలో పనిచేశారు.

ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి మొన్నటి వరకూ రమణ టీడీపీలోనే ఉన్నారు. రాష్ట్ర విభజనకు జరగక ముందు చివరిగా 2009 లో ఆయన జగిత్యాల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసినా గెలవలేదు. రాష్ట్ర విభజన జరిగిన 2014 తర్వాత ఎల్.రమణను చంద్రబాబు టీడీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని చేశారు. పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా రమణకు రాజకీయంగా ప్రయోజనం కలగలేదు.

టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది కాబట్టి ఎలాంటి పదవీ దక్కలేదు. పార్టీ అధ్యక్షుడిగా ఈగలు తోలుకోవడం తప్ప ఆయన చేసే పనేమీ లేదు. తెలంగాణలో ఇక ముందు కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేదు. రమణ టీడీపీ అధ్యక్షుడిగా ఉంటూ గోళ్లు గిల్లుకుంటున్న సమయంలోనే టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ మీద వేటుపడటం రమణకు కలిసి వచ్చింది.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీని నరుక్కుంటూ వస్తున్న కేసీఆర్ కు రమణ కళ్లబడ్డాడు. అందులోనూ బీసీ నాయకుడు. రాజకీయంగా తనకు ఉపయోగపడతాడని అనుకున్నారు కేసీఆర్. టీడీపీ అధ్యక్షుడిగా నువ్వు చేసే పనేందయ్యా …ఈగలు తోలుకోవడం తప్ప. 

టీఆర్ఎస్ లోకి వస్తే ఎమ్మెల్సీని చేస్తా అన్నారు కేసీఆర్. వెంటనే జ్ఞానోదయమైన రమణ గులాబీ కండువా కప్పుకున్నాడు. అక్కరకు రాని చుట్టాన్ని వదిలేయాలని సుమతి శతకకారుడు అన్నట్లుగానే అక్కరకు రాని పార్టీని కూడా వదిలేయాలి.

ఆ పనే చేశాడు రమణ. చివరకు ఎమ్మెల్సీ అయ్యాడు. ఆరేళ్లపాటు హాయిగా పదవి అనుభవించవచ్చు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆయన చట్ట సభల్లోకి అడుగు పెడుతున్నారు. పార్టీ మారడమే ఆయనకు వరంగా మారింది.