వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీలో టీఆర్ఎస్, బీజేపీకి చెందిన కొందరు నాయకులు చేరారని వార్త. షర్మిల పాదయాత్ర ప్రభావమే వీరి చేరికలకు కారణమంటున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా షర్మిల పాదయాత్ర కొంతకాలం ఆగింది. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది. అది మొదలయ్యేలోగా రెండు పార్టీలకు చెందిన కొందరు షర్మిల పార్టీలో చేరారు.
ఎవరయ్యా వీళ్ళు అంటే …హైదరాబాద్ లోని మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు ఎడమ మోహన్ రెడ్డి తన అనుచరులతో కలిసి వైయ్యస్సార్ తెలంగాణ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మలక్ పేట్ బీజేపీ నాయకుడు, ట్రేడర్ సెల్ సిటీ అధ్యక్షుడు నవీన్ రావు, మలక్ పేట్ బీజేపీ సీనియర్ నాయకుడు రవికుమార్ చౌకి తమ అనుచరులతో కలిసి వైయ్యస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు.
వైయస్ షర్మిల వారందరికీ పార్టీ కండువా వేసి వైయ్యస్సార్ తెలంగాణ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు వైఎస్సార్ పరిపాలనను, అప్పట్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ప్రశంసించారు. కేసీఆర్ ది నిరంకుశ పరిపాలన అన్నారు. షర్మిల పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి తమవంతు కృషి చేస్తామన్నారు.
చాలాకాలం తరువాత షర్మిల పార్టీలో కొందరు చేరినందుకు సంతోషమే. కానీ ఈ నాయకులకు ప్రజల్లో పలుకుబడి ఉందో లేదో తెలియదు. పార్టీని ఎంతవరకు బలోపేతం చేస్తారో తెలియదు. పార్టీని ముందుకు తీసుకుపోవడంలో వీరి ప్రభావం ఎంతో తెలియదు. పార్టీలో చోటా నాయకులు చేరితే లాభం లేదు. మోటా నాయకులు అంటే లావుగా ఉన్న వారు కాదు. ప్రజల్లో ప్రభావం చూపించగల నాయకులని అర్ధం.
అంటే రాజకీయంగా పేరున్న, పలుకుబడి ఉన్న నాయకులు చేరాలి. ఈ రోజుల్లో నాయకుడని చెప్పుకోవడానికి కొలబద్దలు ఏమున్నాయి? పలుకుబడి, ప్రజాదరణ, రాజకీయ అనుభవమే కొలబద్దలు. అవి ఉన్నవారు షర్మిల పార్టీలో ఇప్పటివరకు ఎవరూ చేరలేదు. పాపం …షర్మిల ప్రజా సమస్యల మీద స్పందిస్తూ నిరాహార దీక్షలు చేస్తూనే ఉంది. పాదయాత్ర కూడా మొదలు పెట్టింది.
ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో అధికారానికి వస్తాం అంటూ అప్పుడప్పుడూ హుంకరించడమే బాగా లేదు. అలా హుంకరించే ముందు తన బలమేమిటో కూడా చూసుకోవాలి కదా. షర్మిలను అధికారంలోకి తేవాలని జనం అనుకోవాలి. అలా అనుకోవాలంటే పార్టీ ఆ స్థాయికి ఎదగాలి. దానికి ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది.