పాలనలో మానవీయతను, ఆలోచనల్లో అభ్యుదయాన్ని, వివేకాన్ని, సృజనాత్మకను జోడించి ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ముందుగా ‘గ్రేటాంధ్ర’ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
1972, డిసెంబరు 21న ఆయన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మ దంపతులకు కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించారు. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాలను స్వీకరించి, ఆ తర్వాత స్వతంత్రంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు.
పాలనలో, వ్యూహాల్లో తండ్రిని మించిన తనయుడిగా పేరు పొందుతున్న యువ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ప్రత్యేక వ్యాసం.
వైఎస్ జగన్…ఎవరి మాట వినడు, జగమొండి. మనం తరచూ సీఎం గురించి తరచూ వినే మాటలు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా ఆయనకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే నమ్మకానికి, స్నేహానికి, అన్నిటికి మించి మానవత్వానికి ప్రతీకలుగా చెప్పుకుంటారు. ‘మాట తప్పడు, మడమ తిప్పడుర’ అనే నినాదం వైఎస్సార్ వ్యక్తిత్వం నుంచి పుట్టుకొచ్చింది.
తండ్రి విధానాలు, నినాదాలతో వైఎస్ జగన్ గత పదేళ్లుగా రాజకీయాలు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తండ్రికి మించిన తనయుడిగా ఆయన రోజురోజుకూ రాజకీయాల్లోనూ, పాలనలోనూ రాటుదేలుతున్నాడు. 2009లో తండ్రి ఆకస్మిక మరణం, నాన్న కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారిని ఓదార్చాలనే సంకల్పం, కాంగ్రెస్ పార్టీ అడ్డగింత, జగన్ ధిక్కారం…వెరసి జగన్ నేతృత్వంలో వైసీపీ ఆవిర్భవించింది.
కేంద్రంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ధిక్కరించిన జగన్…అందరూ ఊహించినట్టుగానే, వైఎస్ అభిమానులు భయపడినట్టుగానే అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఒకట్రెండు రోజులు కాదు, నెలలు కాదు…ఏకంగా 16 నెలల పాటు జగన్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అంతేకాదు సీబీఐ, ఈడీ కేసులు అతని మెడపై ఇప్పటికీ వేలాడుతూనే ఉన్నాయి.
వైఎస్ జగన్ రాజకీయాలను పరిశీలిస్తే అసమ్మతి నేతగా కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతూ వచ్చాడు. అయితే ఆయనకు రాష్ట్ర నాయకత్వంతో పేచీ తప్ప, ఢిల్లీ పెద్దలతో, అందులోనూ ఇందిరా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించేవారు. అందువల్లే అతి చిన్నవయస్సు (33)లో ఆయన్ను రాజీవ్‌గాంధీ పీసీసీ అధ్యక్షుడిగా చేశాడు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, ఎన్.జనార్దన్‌రెడ్డితో విభేదాల వల్ల మైనింగ్ వ్యాపారంలో వైఎస్సార్ దెబ్బతిన్నాడు. ఎన్ని కష్టాలొచ్చినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారే తప్ప సొంతపార్టీ పెట్టాలని ఆయన సాహసించలేదు.
ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ బొమ్మలతో ఆయన 2004, 2009 ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లాడు. అంతే తప్ప తనంటూ ప్రత్యేక జెండా, ఎజెండాతో ఎదగాలని ఆయన ఎందుకో అనుకోలేదు. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలన్నింటికి ఇందిరా, రాజీవ్ పేర్లే పెట్టారు.
ఇదే జగన్ విషయానికి వస్తే కాంగ్రెస్‌ను కాదని వచ్చి తాను ఎంపీగా, తల్లి విజయమ్మతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాడు. ఇద్దరూ ఉప ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించారు. ఆ తర్వాత తన కోసం కాంగ్రెస్‌ను కాదనుకుని వచ్చిన వారితో రాజీనామా చేయించి గెలిపించిన ధీరుడు వైఎస్ జగన్.
2014లో విజయం అంచుల వరకు వెళ్లి చతికిలపడ్డాడు. అయితే ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ లేచి నిలిచాడు, ఆ తర్వాత ముందుకు నడిచాడు. అతి చిన్న వయస్సులో నేరుగా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టి తండ్రి సహచరులతో ఢీ అంటే ఢీ అన్నాడు. అసెంబ్లీలోనూ, అసెంబ్లీ బయట రాజకీయంగా ఎన్నో రకాలుగా పాలక టీడీపీ నేతలు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. పైపెచ్చు మరింత రాటుదేలుతూ తనను తాను స్వతంత్ర భావాలున్న నేతగా తీర్చిదిద్దుకుంటూ ప్రయాణం సాగించాడు.
ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేల్లో 23 మందిని తమ వైపు తిప్పుకుని, అసెంబ్లీలో తన గళాన్ని వినిపించేందుకు చంద్రబాబు సర్కార్ అవకాశం ఇవ్వకపోవడంతో ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని జగన్ నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం, పట్టుదలే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మహాపాద యాత్ర చేసేందుకు కారణాలయ్యాయి. బహుశా దేశ చరిత్రలో 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వారు ఉండరేమో.
సామాన్యుల్లో సామాన్యుడిగా, ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా, మనుమడిగా అన్ని వర్గాలు, వయస్సుల వారి అభిమానాన్ని చూరగొన్నాడు. ప్రజాసంకల్ప యాత్రలో జన ప్రభంజనం వెల్లువెరిసింది. ఆ జన సునామీ టీడీపీ అధికారాన్ని కూకటివేళ్లతో పెకలించింది. 151 సీట్లతో అధికారాన్ని కట్టబెట్టింది. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నాడు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం తండ్రి వల్లే కాలేదు. అలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని కూడా జగన్ తీసుకుని తండ్రిని మరిపించాడు. తెలుగు బడుల్లో ఆంగ్ల మాధ్యమం మొదలుకుని నిన్నటి అసెంబ్లీలో మూడురాజధానుల ప్రకటన వరకు జగన్ పాలన ఓ ప్రభంజనం. అందుకే ఆయన్ను తండ్రికి మించిన తనయుడని పిలవడం.