విశాఖ అంటేనే అందాల ప్రదేశం. సిటీ ఆఫ్ డెస్టినీగా చెబుతారు. విశాఖ బీచ్ అందాలు ఒక వైపు పచ్చని కొండలు మరో వైపు జనాలను ఆకట్టుకుంటాయి. విశాఖకు ఒకసారి అయినా రావాలని అంతా అనుకుంటారు. అటువంటి విశాఖలోనే వర్క్ చేయాలంటే ఎలా ఉంటుంది. ఇపుడు ఆ కోరిక జగన్ పుణ్యమాని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీరబోతోంది. విశాఖలో పరిపాలనా రాజధాని తొందరలోనే రాబోతోంది.
దానికి సంబంధించిన భూములను కూడా వైసీపీ సర్కార్ గుర్తించేపనిలో పడింది. విశాఖలో దండీగా ప్రభుత్వం భూములు ఉన్నాయి.అందులో ఏకంగా సిటీకి కేవలం 15 కిలోమీటర్ల దూరమలో ఉన్న కాపులుప్పాడలోనే నాలుగు వేల ఎకరాల భూమి ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి.
ఈ భూమిలో సచివాలయం, ఉద్యోగుల క్వార్టర్లు నిర్మించడమే కాదు, భవిష్యత్తు అవసరాలకు కూడా ఎంతైనా వాడుకోవచ్చు. కాపులుప్పాడలో కనుక సచివాలయం ఏర్పాటు అయితే అటు విజయనగరం, ఇటు శ్రీకాకుళానికి కూడా దగ్గర అని భావిస్తున్నారు. అదే విధంగా భోగాపురంలో రాబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఈ సచివాలయం కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండబోతోంది.
దాంతో ప్రభుత్వ స్థలం అధికంగా ఉన్న కాపులుప్పాడ ప్రాంతాన్నే సచివాలయానికి అనుకూలంగా ఎంపిక చేస్తారని అంటున్నారు. ఇక కాపులుప్పాడ ప్రాంతం చూసుకుంటే ఇది సాగర తీరానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ బాగా అభివ్రుధ్ధి చెందిన బీచ్ రోడ్ ఉంది. వాటర్ కనెక్టివిటీ, కరెంట్ వంటివి కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడంతా సిటీ వాతావరణం ఉంటుంది. దాంతో ఇక్కడే ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
అదే సమయంలో విశాఖ జిల్లా సబ్బవరం వద్ద కూడా నాలుగువందల ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ జాతీయ న్యాయ కళాశాలతో పాటు, మరిన్ని విద్యాలయాలు ఉన్నాయి. అయితే ఇప్పటికి అక్కడ స్థలం సరిపోయినా భవిష్యత్తు అవసరాల ద్రుష్ట్యా నాలుగు వందల ఎకరాలు సరిపోవు అంటున్నారు. పైగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు దగ్గరగా ఉండాలంటే కాపులుప్పాడ కరెక్ట్ అంటున్నారు.