1954, మే నెలలో విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. రాజధానిపై అధ్యయనానికి జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం నివేదికను సీఎంకు సమర్పించింది. అనంతరం నివేదిక వివరాలను జీఎన్ రావు మీడియాకు వివరించారు. అమరావతిలోనే అసెంబ్లీ, రాజ్‌భవన్, విశాఖలో సచివాలయం, క్యాంప్ కార్యాలయం, వేసవి అసెంబ్లీతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినట్టు ఆయన వెల్లడించారు.
విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయనున్న నేపథ్యంలో ఆ నగరానికి ఇప్పుడు మరింత ప్రాధాన్యం పెరిగింది. విశాఖకు, పరిపాలనకు సంబంధించి ఏవైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయేమోననే వెతుకులాట ప్రారంభమైంది. దీంతో చాలా మంది చరిత్ర పుస్తకాలను తిరగేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విశాఖకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. 1954 మే నెలలో ఆంధ్రా విశ్వవిద్యా లయంలో నాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశ్‌పంతులు వేసవి కాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని తెలిసింది.
దేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చాక ఐదేళ్లకు మొట్ట మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పటి వరకు మనం సంయుక్త మద్రాస్ రాష్ట్రంలో ఉన్నాం. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం మొదలుకుని రాయలసీమలోని కర్నూలు జిల్లా వరకు అంతా మద్రాస్ రాష్ట్రంలోనే. తెలంగాణ ప్రాంతమంతా హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేది. దాంట్లో కర్నాట, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు కలిసి ఉండేవి. అంటే మనకు, తెలంగాణకు ఎలాంటి సంబంధాలు లేవు.
మనకు తమిళులతోనే అనుబంధం. మొదటి సార్వత్రిక ఎన్నికల సమయానికి కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉండేది. ఢి అంటే ఢీ అని సాగిన ఎన్నికల పోరులో ఆంధ్రా ప్రాంతంలో కాంగ్రెస్‌కు 40, కమ్యూనిస్టులకు 41 స్థానాలు దక్కాయి. అలాగే ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు నాయకత్వంలోని కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీకి 20, రైతు నాయకుడు ఎన్జీ రంగా ఆధ్వర్యంలోని కృషికార్ లోక్‌పార్టీకి 15 స్థానాలు దక్కాయి.
తెలుగు మాట్లాడేవారికి రాష్ట్రం కావాలనే డిమాండ్‌పై ఉద్యమం సాగింది. ఉద్యమంలో భాగంగా పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 29న ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు. డిసెంబర్ 19న ఆయన అమరుడయ్యారు. ఆ తర్వాత నాలుగు రోజులకు పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 13 జిల్లాలతో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటైంది. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. దీనికి కర్నూలు మొట్టమొదటి రాజధాని.
కాగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీ, టంగుటూరి ప్రకాశం పంతులు ఏకాభిప్రాయానికి వచ్చారు. కాంగ్రెస్ సహకారంతో ప్రకాశం పంతులు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కర్నూలు రాజధాని అయినప్పటికీ 1954 మే నెలలో ఆంధ్రా విశ్వవిద్యా లయంలో వేసవి కాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ రాజధాని కానున్న విశాఖకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన చరిత్ర ఉందన్న మాట.