ఇటీవలే దివంగతులైన విశ్వనాథ్ గారి గురించి రాయమని చాలామంది పాఠకులు అడిగారు. ఆయన గురించి అనేక పేపర్లలో రాశారు, టీవీల్లో చూపించారు. ఆయన తన సినిమాల గురించి విపులంగా చెప్పుకున్న యింటర్వ్యూలు చలామణీలో ఉన్నాయి. ఆయనతో పనిచేసిన వారు ఆయన మరణం తర్వాత ఆయన పని తీరు గురించి, సినిమాల గురించి మాట్లాడారు. ఇంతమంది మాట్లాడాక మళ్లీ అవే విషయాలు నేను చెప్తే ఏం బాగుంటుందనే ఆలోచనలో పడ్డాను. తరచి చూసి అందరూ కొన్ని సినిమాల గురించే మాట్లాడారని గమనించాను. ఇప్పుడే కాదు, యింతకు ముందు కూడా ఆయన చేసిన కమ్మర్షియల్ సినిమాల గురించి మాట్లాడేవారు కాదు. ఫెయిలయిన సినిమాలు ఎందుకు పోయాయో రాసేవారు కాదు. కొన్ని సినిమాల గురించి ఒక పుస్తకం రాయడానికి సరిపోయేటంత సమాచారం దొరుకుతుంది. కొన్నిటి గురించి అస్సలు దొరకదు.
‘‘విశ్వనాథ్ విశ్వరూపం’’ అని 2021లో ఓ పుస్తకం వస్తే దానిలో యివన్నీ రాశారేమో కొందామనుకున్నాను. ప్రఖ్యాతచిత్రాల గురించే రాశారని విని, కొనలేదు, చదవలేదు. దర్శకుడు విశ్వనాథ్ గారి పునాది ఆదుర్తి మార్క్ కమ్మర్షియల్ సినిమాల్లో పడింది. ఆదుర్తి అసిస్టెంటుగా ఆయన పాత్ర ఎంత ఉంది, స్క్రిప్టు వర్క్ ఎంత బాగా చేశారు అవి ఎవరైనా వివరంగా రాయాలి. ఎంతసేపూ శంకరాభరణం నుంచి, మహా అయితే సిరిసిరిమువ్వ నుంచి మొదలుపెడితే ఎలా? ఎప్పుడూ చూసినా ఆయన సినిమాల్లో నృత్యసంగీతసాహిత్యాల గురించే చెప్తారు తప్ప కథాకల్పన, హాస్యం, చమత్కారం గురించి చర్చించరేం? కళాతపస్వి అని ఓ కిరీటం పెట్టేసి, ఒక తరహా సినిమాలు తప్ప మరో రకమైనవి ఆయన తీయలేదన్న అపోహ కల్పిస్తారు.
నిజానికి ప్రతి సినిమాకారుడికి సినిమా తీయడం తపస్సే. ‘‘మోసగాళ్లకు మోసగాడు’’ సినిమా కూడా తీసేవాడికి తపస్సే. దానిలోనూ కళ ఉంది. శాస్త్రీయ కళలను ప్రధానవస్తువుగా పెట్టి సినిమాలు తీసిన విశ్వనాథ్ గారికి తప్ప మరొకరికి దాన్ని వాడితే అపచారం అన్నంత బిల్డప్ వచ్చేసింది. ఈ వ్యాసం టైటిల్‌లో కళాతపస్వి లేనందుకు కొందరు నొచ్చుకుని ఉన్నా నేనాశ్చర్యపడను. ఆయన పోయిన తర్వాత యీ బిరుదుపై వివాదం లేవనెత్తారు కొందరు దళిత మేధావులు. ఆయన కళాతపస్వి కాదు, కులతపస్వి అంటూ యాగీ చేశారు. వ్యక్తిగతంగా ఆయనకు కులాభిమానం లేదని, ఆయన దగ్గర వివిధశాఖల్లో పనిచేసినవారు చెప్పారు. ఆయన సినిమాల హీరోహీరోయిన్లు, సాంకేతికగణం, నిర్మాతలలో అన్ని కులాల వారూ ఉన్నారు. పోనీ తన సినిమాల్లో కులవాదాన్నీ, ఛాందసవాదాన్ని ప్రమోట్ చేశారా అంటే అదీ లేదు. హరిజనులను కించపరిచాడా అంటే వాళ్లను హీరో, హీరోయిన్లుగా చూపించాడు. ఇవన్నీ చెపితే ‘అబ్బే, ఆయన దళితులకు అనుకూలంగా సినిమాలు తీసినా ఆ పాత్రలు బ్రాహ్మణ భాష మాట్లాడాయని వాదించారు కొందరు.
ఇదో పిచ్చివాదన. నాటకాల్లో, సినిమాల్లో వివిధ కులాలకు చెందిన పాత్రలన్నీ దాదాపుగా ఒకే రకమైన భాష మాట్లాడుతాయి, ప్రత్యేకసందర్భాల్లో యాస పెడితే తప్ప! పత్రికల వ్యాసాల్లో, టీవీ చర్చల్లో దాదాపు అందరూ ఒకే తరహా భాష మాట్లాడతారు. వేదిక ఎక్కబోతూ ‘పొద్దుగాలే లెగిచి వచ్చేశా..’ అనే వాళ్లు కూడా వేదిక ఎక్కాక ‘పొద్దున్నే లేచి’ అని ప్రసంగిస్తారు. సినిమా అనేది అన్ని ప్రాంతాల వారికీ, అన్ని వర్గాల వారికీ చేరవలసిన మీడియం. అందరికీ అర్థమయ్యే స్టాండర్డ్ భాష వాడాలి. ఇది అర్థం చేసుకోకుండా దళితులకున్న ప్రత్యేకత చూపలేదని విమర్శించడం అర్థరహితం. ఇక దళిత మేధావులని చెప్పుకునే వారి గురించా? వారి కొలబద్దలు వారికే తెలియాలి. దళితుల గురించి ఎంత వాస్తవికంగా, ఎంత గొప్పగా రాసినా అది వారి దృష్టిలో దళితసాహిత్యం కాదు. రచయిత దళితుడిగా పుడితే తప్ప దానికి వాళ్లు తాతాచార్యుల ముద్ర వేయరు. అందుచేత వారి లోకంలో వాళ్లని ఉండనిచ్చి, ప్రేక్షకలోకం ఏమనుకుంటోందో అది మాట్లాడుకుంటే చాలు.
మొదట విశ్వనాధ్ ప్రత్యేకత గురించి సంక్షిప్తంగా కొంత చెప్పుకుని, తర్వాత తక్కిన విషయాలపై మాట్లాడుకోవచ్చు. దర్శకులలో ఆయనకున్న ప్రత్యేక స్థానం ఆయనంతట ఆయన స్వయంగా సంపాదించుకున్నది, భిన్నప్రయోగాలతో నిర్మించుకున్నది. మొదట ఆయనా ఎస్టాబ్లిష్డ్ తారలతో కమ్మర్షియల్ సినిమాలే తీశారు. తీయడం కూడా పద్దతిగా తీశారు. కమ్మర్షియల్ ఎలిమెంట్స్ పెట్టినా, కథకు న్యాయం చేస్తూ, నూతనధోరణిలో చెప్పారు. సెంటిమెంటల్ సబ్జెక్ట్‌లను కూడా అదుపు తప్పకుండా, పాత్రధారుల చేత ఓవరాక్షన్ చేయించకుండా నిభాయించారు. అది ఆదుర్తి సుబ్బారావుగారి స్కూలు ప్రభావం అనుకుంటే, ఆ తర్వాత, కాస్త నిలదొక్కుకున్నాక తన తారాబలంతో సంబంధం లేని స్కూలు ప్రారంభించారు. కథ, కథనం, డైరక్షన్‌లే ప్రధానం. కథాంశాలు కొత్తవి, యితరులు చేపట్టనివి. ఆర్ట్ సినిమాలివి అని హడలగొట్టకుండా, వాణిజ్యపరమైన సినిమాలను రమ్యంగా చెప్పడం వలన వాటికి కళాత్మకచిత్రాలు అని పేరు వచ్చింది.
ఆయన తీసిన సినిమాలలో చాలాభాగం మానవీయ సంబంధాలు, వ్యక్తిత్వ వికాసం, మనిషిలో దాగున్న మంచితనం చుట్టూ తిరిగాయి. గురుశిష్యుల సంబంధం ఎలా వుండాలో ‘‘శంకరాభరణం’’లో చెప్పారు. ఎలా వుండకూడదో, దారి తప్పిన గురువు గతి ఏమవుతుందో ‘‘స్వాతికిరణం’’లో చెప్పారు. ప్రదర్శనకు నోచుకోని గురువుగారి కళ శిష్యుడిద్వారా జీవించి వుంటుందని, యింకో తరానికి ప్రసరిస్తుందని ‘‘సాగర సంగమం’’లో చెప్పారు. విశ్వనాథ్ పదే పదే చెప్పేది వ్యక్తిత్వ వికాసం గురించి! ‘‘స్వయంకృషి’’లో కష్టపడి పైకి రావడం గురించి చూపితే ‘‘శుభోదయం’’లో అలా చేయకపోతే ఏమవుతుందో చూపుతూ జీవితంలో అడ్డదారులు లేవని హెచ్చరించారు.‘‘'ఓ సీత కథ’’లో దారుణ పరిస్థితుల్లో పడిన స్త్రీ ఎలాటి సాహసం చేసి విలన్ని ఎలా ఎదుర్కుందో చూపారు. వైవాహిక బంధం సరిగ్గా సాగకపోతే మొగుణ్ని విడిచిపెట్టినా తప్పులేదని ప్రబోధించారు ‘‘మాంగల్యానికి మరోముడి’’లో. ప్రతీ మనిషి తన స్వధర్మాన్ని గుర్తించి, ఆ రంగంలో రాణించాలని అద్భుతంగా ఉపదేశించారు ‘‘స్వర్ణకమలం’’లో!
విశ్వనాథ్ గారి సినిమాల్లో రికరింగ్ థీమ్ – మానవత్వం! కుటుంబంతో సంబంధం లేని వ్యక్తి ఎవరో వచ్చి, కలగజేసుకుని వ్యవహారాలు చక్కదిద్దుతాడు. అది ‘‘సిరిసిరిమువ్వ’’లో చంద్రమోహన్ కారెక్టరు కావచ్చు. ‘‘స్వాతిముత్యం’’లో, ‘‘శుభముహూర్తం’’లో కమలహాసన్ కావచ్చు, ‘‘ఆపద్బాంధవుడు’’లో, ‘‘శుభలేఖ’’లో చిరంజీవి కారెక్టరు కావచ్చు. ఆయన సినిమాల్లో విలన్లు పుట్టుకతోనే క్రూరులుగా ఉండరు. మన చేత బూతులు తిట్టించుకునేటంత దుర్మార్గంగా ప్రవర్తించరు. స్వార్థం కొద్దీ, అసూయ కొద్దీ, లోభం కొద్దీ అలా చేస్తున్నారంతే, అని మనకు తోచి వాళ్లనూ సింపతైజ్ చేస్తాం. ఆయన ఆలోచనలు ఉదారమైనవి. దృక్పథం విశాలమైనది. అని వర్గాల వారినీ, అన్ని తరహాల వారినీ కవర్ చేస్తాయి.
ఆయన సినిమాల్లో కారెక్టర్ యాక్టర్లే కాదు, హీరోలు కూడా పెద్ద కుటుంబాలవాళ్లు కారు. మామూలు కుటుంబాలవాళ్లు, బడుగుజాతుల వాళ్లు. గంగిరెద్దుల మేళం వాళ్లు ‘‘సూత్రధారులు’’లో కనబడతారు, చెప్పులు కుట్టేవాళ్లు ‘‘స్వయంకృషి’’లో కనబడతారు. సినిమాహాల్లో కసవు వూడిచేవాళ్లు ‘‘సీతామాలక్ష్మి’’లో కనబడతారు. ‘‘స్వాతికిరణం’’లో హీరో తలిదండ్రులు క్యాంటీన్ నడుపుతారు. ‘‘సిరిసిరిమువ్వ’’లో హీరో డప్పుకొట్టేవాడు. ‘‘సప్తపది’’లో, ‘‘సిరివెన్నెల’’లలో హీరోలు ఫ్లూటిస్ట్‌లు, ‘‘స్వర్ణకమలం’’లో హీరో సైన్‌బోర్డులు రాసేవాడు. ‘‘శుభలేఖ’’లో హీరో కేటరర్. ‘‘ప్రెసిడెంటు పేరమ్మ’’లో హీరోయిన్ చాకలి. ‘‘ఆపద్బాంధవుడు’’లో హీరో గొల్లవాడు. అవకరాలు పెట్టడానికి కూడా ఆయన జంకడు. ‘‘చెల్లెలి కాపురం’’లో హీరో నల్లటి అనాకారి. ‘‘సిరిసిరిమువ్వ’’లో హీరోయిన్ మూగదైతే ‘‘సిరివెన్నెల’’లో హీరో గుడ్డి, హీరోయిన్ మూగ. ‘‘చిన్నబ్బాయి’’లో హీరోకి నత్తి, ‘‘స్వాతిముత్యం’’లో హీరో మందబుద్ధి.
కళను అన్ని కోణాల్లో దర్శించారు విశ్వనాథ్. కళాకారుడిలో రాజీపడని ధోరణిని ‘‘శంకరాభరణం’’లో చూపిస్తే, వైఫల్యాన్ని స్వీకరించలేని అభాగ్యుణ్ని ‘‘సాగరసంగమం’’లో చూపించారు. నైతికంగా పతనం చెందిన కళాకారుడు ‘‘శ్రుతిలయలు’’లో కనబడతాడు. తనలోని కళాభిరుచిని తెలుసుకోలేని హీరోయిన్ను ‘‘స్వర్ణకమలం’’లో చూపిస్తే, అడ్డదారుల్లో పైకి వచ్చేద్దామని చూసే కళాకారిణిని కవిత పాత్రద్వారా ‘‘సిరిసిరిమువ్వ’’లో చూపారు. అంతేకాదు, కళను మార్కెట్ చేసే దళారుల గురించి ‘‘శ్రుతిలయలు’’లో, కళాకారిణి చుట్టూ జనం చేరి, ఆత్మీయులకు సైతం దూరం చేసే వాళ్లని ‘‘సీతామాలక్ష్మి’’లో చూపించారు. సినిమాల్లో కళకు పట్టిన దౌర్భాగ్యం గురించి ‘‘సాగరసంగమం’’ లో, ఆధునికత పేరుతో శాస్త్రీయసంగీతాన్ని భ్రష్టు పట్టించడాన్ని ‘‘శంకరాభరణం’’లో చూపించారు.
ఆయన సినిమాలో శృంగారమూ వుంటుంది, అదీ జీవితంలో ఓ భాగం కాబట్టి! అయితే లలితంగా, తెరపై హీరోయిన్ స్నానం చేసినా చూడడానికి యిబ్బంది పెట్టనట్టుగా ఉంటుంది. ‘‘సప్తపది’’ విడుదలయ్యాక ఫోకస్ అంతా కులం మీద పడింది కానీ దాని అసలు థీమ్ లిబిడో సమస్య. హీరోయిన్ ప్రేమించినవాడు హరిజనుడు కాకుండా వాళ్ల కులస్తుడే అనుకుని సినిమాను ఊహించండి. భర్త భార్యలో అమ్మవారిని చూస్తూ పక్కన చేరనంటే భార్య ఏం చేయాలి? పట్టుబట్టి, దగ్గరుండి వివాహం జరిపించిన పెద్దలు ఏం చేయాలి? ‘‘సుమంగళి’’లో భర్త ప్రమాదవశాత్తూ సంసారజీవితానికి పనికిరాకుండా పోతే వచ్చే సమస్యను చర్చించి, చివరకు మెలోడ్రమటిక్‌గా హీరోయిన్ని చంపేశారు. ఇక్కడా అదే చేయాలా? ఈ బంధాన్ని తెంపేసి, వేరేవాడికిచ్చి కట్టబెట్టకూడదా? ఆ వేరేవాడు ఆమె ప్రియుడు, వేరే కులంవాడు కావడం డ్రామాను పెంచిందంతే.
ఆ సినిమాను విశ్వనాథ్ కాక ఏ శ్యామ్ బెనగల్లో తీస్తే ఆహాఓహో అనేవారు. కానీ ‘‘శంకరాభరణం’’లో సోమయాజులు పాత్ర ద్వారా బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టిన విశ్వనాథ్ యిలాటి సినిమా తీసి అదే నటుడి చేత కులానిది ఏముంది అనిపించడమేమిటి’ అని ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారు. నిజానికి ‘‘శంకరాభరణం’’లో కూడా శంకరశాస్త్రి కర్ణాటక సంగీతం భ్రష్టు పట్టిందని ఆవేదన పడ్డాడు తప్ప బ్రాహ్మణత్వం గురించి పట్టుబట్టలేదు. వేశ్య కూతురైన మంజుభార్గవి చేత వండించుకుని తిన్నాడు. ఆమెకు ఆశ్రయం యిచ్చాడని ఊల్లో బ్రాహ్మణులు వెలి వేస్తే ఖాతరు చేయలేదు. మంజుభార్గవి బలాత్కారానికి గురై ఒక విషపుపురుగుని ప్రసవిస్తే దాన్ని తీర్చిదిద్ది శంకరుడికి ఆభరణంగా అమర్చాడు. ‘‘శుభోదయం’’ మంచి థీమ్ ఉన్న సినిమా కాబట్టి దాని హిందీ రీమేక్ బాగా ఆడింది. కానీ అది యిక్కడ ‘‘శంకరాభరణం’’ తర్వాత రావడంతో అంత సీరియస్ సినిమా తర్వాత యిలాటి కామెడీ ఏమిటి అని జనం పెద్దగా ఆదరించలేదు. ఇవన్నీ యిమేజి సమస్యలు. అవి ఒక మనిషిని చట్రంలో బిగించేస్తాయి.
‘‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’’ తీశాక శాంతారాంను కళ అంటే పడి చచ్చే దర్శకుడు అని పట్టం గట్టేశారు. దాంతో ఆయన అప్పటినుంచి సాంగ్ అండ్ డాన్స్‌పై పడ్డాడు. సినిమాలన్నీ వాటి చుట్టూనే తిరిగాయి. ‘‘దో ఆంఖే బారహ్ హాత్’’ ఒకటి తీసి, తర్వాత ‘‘నవ్‌రంగ్’’, ‘‘జల్ బిన్ మఛలీ..’’, ‘‘లడ్కీ సహ్యాద్రికీ’’.. యిలా! నిజానికి ఆయన దశాబ్దాలపాటు తీసిన సినిమాలన్నీ సోషల్ థీమ్స్ మీదే! వరకట్న సమస్య, హిందూ-ముస్లిము సమస్య, జాతీయ సమైక్యత, ఖైదీల సంస్కరణ యిలా అనేకవాటి గురించి తీశారు. కానీ అవన్నీ వెనకబడి కళ.. కళ.. కళ అంటూ వేళ్లాడారు. శాంతారం వీరాభిమాని ఐన విశ్వనాథ్ కూడా అలాటి మాయలో పడ్డారు. దాని గురించి తర్వాత చెప్తాను.
అనేక రకాల ప్రయోగాత్మక కథాంశాలను ప్రజలకు సులభంగా అందించడానికి విశ్వనాథ్ ఎన్నుకున్న దారి, హాస్యం, సంగీతం! ఆయన సినిమాల్లో హాస్యం కథను హాయిగా నడిపిస్తుంది. కానీ వాటిని హాస్యచిత్రాలని అనరు. ఎందుకంటే ఆయన సినిమాల్లో కమెడియన్లు అంటూ విడిగా వుండి వెకిలిచేష్టలు చేయరు. మామూలు పాత్రల్లోంచే, కథాపరమైన సన్నివేశాల్లోంచే హాస్యం పుడుతుంది. హాస్యపాత్రలను కారెక్టర్ రోల్స్ అని కూడా అనవచ్చు. ‘‘శంకరాభరణం’’లో అల్లు రామలింగయ్యది హాస్యపాత్ర అంటామా? హీరోతో ఎంపతైజ్ చేసే స్నేహితుడి పాత్ర అంటామా? అల్లు మాటలకు ఓ పక్క నవ్వూ వస్తుంది. ఇంకోపక్క సోమయాజులు గురించి పడే తపనకు బాధా వేస్తుంది. విశ్వనాథ్ సినిమాల్లో హాస్యం గురించి ఓ పుస్తకమే రాయవచ్చు.
ఇక విశ్వనాథ్ తెలుగు సినిమా చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించుకున్నది తన సినిమాల్లోని గీతసంగీతాల ద్వారానే అనడంలో అతిశయోక్తి లేదు. ‘‘శంకరాభరణం’’ తర్వాత మ్యూజిక్ స్కూల్స్, ‘‘సాగరసంగమం’’ తర్వాత డాన్సు స్కూళ్లు పెరిగాయన్నది నిజం. ఇది ఆయన ఆలోచనలను, సినిమాల ధోరణిని తర్వాతి రోజుల్లో పరిమితం చేసిందని నా అభిప్రాయం. ఆయన సినిమాల్లో కథ మెయిన్‌గా ఉంటూ సంగీతం అనుబంధంగా ఉండేది. చివరకు వచ్చేసరికి ఆయన కథలన్నిటినీ సంగీతం, నృత్యం చుట్టూనే తిప్పనారంభించారు. ఆ సినిమాల్లో క్లయిమాక్స్ ఎలా ఉంటుందో ముందే ఊహించగలం. అందుచేత మూస ధోరణి వచ్చేసి, సినిమాలకు ఆదరణ తగ్గింది. ‘‘స్వరాభిషేకం’’ (2004), ‘‘శుభప్రదం’’ (2010) అందుకనే ఆడలేదు.
‘‘స్వరాభిషేకం’’ టీవీ సీరియల్‌లా ఉందని జనాలు అనుకున్నారు. అవార్డులు వచ్చాయి కానీ సినిమా సక్సెస్ కాకపోవడంతో మరో ఆరేళ్ల వరకు సినిమా ఛాన్సు రాలేదు. ఆయన చివరి హిట్ ఆయన 65వ ఏట వచ్చిన ‘‘శుభసంకల్పం’’ (1995). సంగీతంతో టెర్రరిజాన్ని రూపుమాపడం అనే థీమ్ మీద కూడా కథ రాసుకున్నారంటే ఇక ఆయన ఆలోచనలు సంగీతపు సుడిగుండంలో ఎలా చిక్కుకుపోయాయో ఊహించుకోవచ్చు. మొదట్లో ఆయన వివిధ వృత్తుల్లో వారిని హీరోలుగా ఎలా చూపించారో పైన రాశాను. తర్వాతి సినిమాలు కూడా లెక్కలోకి తీసుకుని చూస్తే ఆయన సంగీత, నృత్యరంధిలో ఎలా పడ్డారో అర్థమౌతుంది. ‘‘శంకరాభరణం’’, ‘‘శ్రుతిలయలు’’, ‘‘స్వాతికిరణం’’, ‘‘స్వరాభిషేకం’’, ‘‘శ్రుతిలయలు’’లలో హీరోలు గాయకులు. ‘‘సిరిసిరిమువ్వ’’, ‘‘సప్తపది’’, ‘‘సిరివెన్నెల’’, ‘‘సూత్రధారులు’’ లలో హీరోలు వాద్యకారులు. ‘‘సీతామాలక్ష్మి’’, ‘‘సిరిసిరిమువ్వ’’, ‘‘స్వర్ణకమలం’’లలో హీరోయిన్లు డాన్సర్లు. ‘‘సాగరసంగమం’’లో హీరో డాన్సర్. ఈ ఓవర్‌డోస్ వల్లనే గత పాతికేళ్లగా ప్రేక్షకులు ఆయన్ను పట్టించుకోవడం మానేశారని అనుకోవచ్చు.
మొదట్లో ఆయన యితరుల కథలు తీసుకున్నా, పోనుపోను తన కథలనే నమ్ముకున్నారు. వాటి పరిధిని కుదించేశారు. ఆయన సినిమాలన్నీ ఒక ఫ్రేమ్‌వర్క్‌లోనే ఉంటాయనే విమర్శ ఉంది. ఆయన సృష్టించిన పాత్రలు కూడా ఆయనలాగానే ఆలోచిస్తాయని, అలాగే మాట్లాడతాయని, ఆయన గీసిన గిరిలోనే తిరుగుతాయని అనడంలో అతిశయోక్తి లేదు. కలక్టివ్ విజ్‌డమ్‌పై ఆయనకు నమ్మకం లేదు. పాత్రధారులందరికీ ఆయన నటించి చూపించి, అలాగే చేయమని ఒత్తిడి చేస్తారని, పాత్ర అర్థం చేసుకుని నటించే స్వేచ్ఛను నటీనటులకు యివ్వరని చంద్రమోహన్ బాహాటంగా చెప్పారు. విశ్వనాథ్ మలి దశలో డైలాగ్ రైటర్‌గా పని చేసిన ఒకాయన డైలాగు రైటర్‌కు కూడా స్వేచ్ఛ నీయరని, ఆయనే అన్నీ డిక్టేట్ చేస్తారనీ వాపోయారు. ఈ కంట్రోల్ ఫ్రీక్ మనుషులు అన్నీ తామే చేయడంతో వెరైటీ లేకుండా పోతుంది. కొత్త మిలీనియం వచ్చేసరికి వీళ్లంతా యితరులకు దారి యిచ్చేయాల్సి వచ్చింది. బాలచందర్‌కూ అదే సమస్య వచ్చింది.
ఏతావతా విశ్వనాథ్ ఒక తరం ప్రేక్షకులకే నచ్చారు. అదీ కొన్ని సినిమాల వరకే పరిమితం అయింది. ఆయన విజయవంతమైన సినిమాల గురించి అందరూ రాశారు కానీ ఫ్లాప్స్ గురించి ప్రస్తావించలేదు. జయాపజయాల గురించి నాకు తెలిసిన సమాచారం యిస్తున్నాను. తప్పులుంటే సవరించండి. ఇక్కడే ఒక విషయం రాయాలి. తను అనుకున్నట్లుగా తీయడానికి సిద్ధపడే నిర్మాతలనే విశ్వనాథ్ ఎంచుకునేవారు, వాళ్లు సినీరంగానికి కొత్తవాళ్లయినా సరే! ఈయన సినిమాలతో రిస్కు ఉన్నా, కళాకారుల, సాంకేతిక నిపుణుల పారితోషికాలు తక్కువ కనక, భారీ సెట్టింగుల జోలికి పోరు కనుక, చిన్న బజెట్‌లో తెమిలిపోతుందని, ఆడకపోయినా మరీ నష్టం రాదని ఆ నిర్మాతలు ముందుకు వచ్చేవారు. అందువలన నష్టపోయినవాళ్లు మరీ భారీగా నష్టపోలేదు. ఓ మాదిరిగా ఆడినవాటికి డబ్బు యించుమించుగా వచ్చేసి ఉంటుంది.
ఆయన 1965లో దర్శకుడిగా కెరియర్ మొదలుపెడితే 1970 వరకు వచ్చిన ‘‘ఆత్మగౌరవం’’, ‘‘కలిసొచ్చిన అదృష్టం’’, ‘‘ఉండమ్మా బొట్టు పెడతా’’, ‘‘నిండు హృదయాలు’’ హిట్స్. ‘‘ప్రైవేటు మాస్టారు’’ ఓ మాదిరి. 1971-80 దశకంలో ‘‘చెల్లెలి కాపురం’’, ‘‘చిన్ననాటి స్నేహితులు’’, ‘‘కాలం మారింది’’, ‘‘నేరము-శిక్ష’’, ‘‘శారద’’, ‘‘ఓ సీత కథ’’, ‘‘జీవనజ్యోతి’’ ‘‘సిరిసిరిమువ్వ’’, ‘‘సీతామాలక్ష్మి’’, ‘‘శంకరాభరణం’’, సిరిసిరిమువ్వ హిందీ రీమేక్ ‘‘సర్‌గమ్’’ హిట్స్. ‘‘ప్రెసిడెంటు పేరమ్మ’’, ‘‘శుభోదయం’’ ఓ మాదిరి. ‘‘అమ్మమనసు’’, ‘‘చిన్ననాటి కలలు’’, ‘‘మాంగల్యానికి మరోముడి’’, ‘‘ప్రేమబంధం’’, ‘‘జీవననౌక’’, ‘‘కాలాంతకులు’’, ‘‘అల్లుడు పట్టిన భరతం’’ ఫ్లాప్స్.
1981-90 దశకంలో శుభోదయం రీమేక్ ‘‘కామ్‌చోర్’’, ‘‘శుభలేఖ’’, ‘‘సాగరసంగమం’’, ‘‘స్వాతిముత్యం’’, ‘‘శ్రుతిలయలు’’, ‘‘స్వర్ణకమలం’’, జీవనజ్యోతి హిందీ రీమేక్ ‘‘సంజోగ్’’ హిట్స్. ‘‘సప్తపది’’, శుభలేఖ హిందీ రీమేక్ ‘‘శుభ్‌కామ్‌నా’’, శంకరాభరణం రీమేక్ ‘‘సుర్ సంగమ్’’ ఓ మాదిరి. ‘‘జననీ జన్మభూమి’’, సప్తపది హిందీ రీమేక్ ‘‘జాగ్ ఉఠా ఇన్సాన్’’, ‘‘సంగీత్’’ అనే హిందీ సినిమా ఫ్లాప్. 1991-2000 దశకంలో ‘‘శుభసంకల్పం’’ హిట్. ‘‘స్వయంకృషి’’, స్వాతిముత్యం హిందీ రీమేక్ ‘‘ఈశ్వర్’’, ‘‘ధన్‌వాన్’’, ‘‘సూత్రధారులు’’ ఓ మాదిరి. ‘‘స్వాతికిరణం’’, ఓ సీత కథ హిందీ వెర్షన్ ‘‘ఔరత్ ఔరత్ ఔరత్’’, ‘‘చిన్నబ్బాయి’’ ఫ్లాప్. ‘‘సిరిమువ్వల సింహనాదం’’ అనే సినిమా పూర్తయినా రిలీజు కాలేదు. 2001 తర్వాత తీసిన ‘‘స్వరాభిషేకం’’, ‘‘శుభప్రదం’’ ఫ్లాప్. దీని ప్రకారం విశ్వనాథ్ ఒక మూడు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుల మనసులు దోచారని తెలుస్తోంది.
ఆయన ఒక యింటర్వ్యూలో తను యితర భాషాచిత్రాలను చూడనని, తన కథలన్నీ తన మెదడులోంచే పుట్టాయని చెప్పుకున్నారు. కానీ ఆయన వద్ద అసిస్టెంటు డైరక్టరుగా పనిచేసిన గీతాకృష్ణ తాము ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కలిసి వెళ్లేవారమని చెప్పారు. ‘‘ఉండమ్మా బొట్టు పెడతా’’ సినిమాకు ‘‘థాంబ్ లక్ష్మీ కుంకు లావ్‌తే’’ అనే మరాఠీ సినిమా ఆధారం అని అందరికీ తెలుసు. ‘‘కాలం మారింది’’ బిమల్ రాయ్ ‘‘సుజాతా’’కు రీమేక్. ‘‘శారద’’కు మూలం కన్నడ సినిమా అని, క్రాంతి కుమార్ చాలా మార్చారని విన్నాను. ‘‘సీతామాలక్ష్మి’’ సినిమా ‘‘మల్లీశ్వరి’’ (1951)కి మోడర్న్ వెర్షన్ అని నిర్మాత మురారే చెప్పారు. ‘‘మాంగల్యానికి మరో ముడి’’కి బీజం ‘‘డాల్స్ హౌస్’’లో ఉందని దేవదాస్ కనకాల చెప్పారంటూ ఈ మధ్యే చదివాను. కథ మార్చుకుంటూ మార్చుకుంటూ పోతే యీ సినిమా అయిందని దేవదాస్ చెప్పారట.
‘‘స్వాతికిరణం’’ కథకు మూలం మాత్రం ‘‘అమడియాస్’’ (1984) అని చెప్పవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారుడు మొజార్ట్ గురువుగారు సలేరీ, తన శిష్యుడి ప్రతిభ చూసి అసూయతో అతనిపై విషప్రయోగం చేయబోయాడన్న పుకారు ఉంది. ఆ అంశంపై తీసిన యీ సినిమాలో గురువు ఆత్మహత్యా ప్రయత్నం చేసి, మతి చలించి, మొజార్ట్‌కు తను చేసిన ద్రోహాన్ని ఫ్లాష్‌బ్యాక్‌లో వెల్లడిస్తాడు. అఫ్‌కోర్స్, తెలుగులో విశ్వనాథ్ గారు, మధ్యలో పెంపుడుతల్లిగా రాధిక పాత్రను పెట్టి, పిల్లవాడే ఆత్మత్యాగం చేసినట్లు మార్చారు. కానీ చిన్నపిల్లాడి చావుని ప్రేక్షకులు తట్టుకోలేక పోయారు.
ఇటీవలే హృషీకేశ్ ముఖర్జీ గురించి రాశాను. ఆయన లాగానే యీయనా మధ్యతరగతి చుట్టూనే తిరిగారు. జానపదాలు, చారిత్రాత్మకాలు, పౌరాణికాలు అంటూ వేరా జానర్లకు వెళ్లలేదు. బాలచందర్ లాగ అధోజగత్తు కారెక్టర్లతో తీయలేదు. ఆయనలా టూ మచ్ మెలోడ్రామా పెట్టలేదు. ‘‘ఓ సీతకథ’’ను తమిళంలో ‘‘మూన్రు ముడిచ్చు’’గా రీమేక్ చేసినప్పుడు బాలచందర్ ఎమోషన్స్ హెచ్చు మోతాదులో పెట్టి, ఒరిజినల్ కంటె పెద్ద హిట్ కొట్టారని విమర్శకుడు భరద్వాజ అన్నారు. స్వతహాగా మర్యాదస్తుడైన విశ్వనాథ్ మనల్ని షాక్‌కు గురి చేయని గౌరవప్రదమైన సినిమాలే తీశారు. తెలుగువాళ్లు గర్వంగా చెప్పుకునే సినిమాలు తీశారు. ఇక నటుడిగా ఆయన ఎక్సలెంట్. వ్యక్తిగా ఆయన క్రమశిక్షణకు, నిగర్వానికి చేతులెత్తి నమస్కరించ వలసినదే. టాలెంట్‌ను గుర్తించడంలో, ప్రోత్సహించడంలో ఆయనకు ఆయనే సాటి. నా అభిమాన దర్శకులలో ఒకరైన విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2023)