ప్రీతి సూసైడ్ కు కారణమైన సైఫ్ ఎవరు?

ఆత్మహత్యకు యత్నించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీనియర్…

ఆత్మహత్యకు యత్నించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీనియర్ అయిన సైఫ్ వేధింపుల వల్లనే, ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించిందని పోలీసులు నిర్థారించారు. ఇంతకీ సైఫ్ ఎవరు?

సైఫ్ కు గట్టి బ్యాక్ గ్రౌండ్ ఉందని సోషల్ మీడియాలో వరుసగా కథనాలు వచ్చాయి. అతడికి పొలిటికల్ సర్కిల్ ఉందని కూడా కొన్ని చోట్ల వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఎలాంటి నిజం లేదు. సైఫ్ ఓ సాధారణ కుర్రాడు. ఇంకా చెప్పాలంటే పేద విద్యార్థి. ఈ విషయాల్ని వరంగల్ సీపీ రంగనాధ్ వెల్లడించారు.

సైఫ్ తండ్రి రైల్వేస్ లో ఫిట్టర్ జాబ్ చేస్తుంటాడు. అతడ్ని పెంచి పోషించిన వ్య‌క్తి ఓ వ్యవసాయ కూలీ. అతడికి ఎలాంటి రాజకీయ నేపథ్యం, భారీ పలుకుబడి లేవు. ఈ విషయాన్ని పోలీసులు నిర్థారించారు. సైఫ్ బ్యాక్ గ్రౌండ్ పై వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు.

కావాలనే ప్రీతిని టార్గెట్ చేస్తూ సైఫ్ వేధించాడనే విషయాన్ని పోలీసులు నిర్థారించారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతిని టార్గెట్ చేస్తూ, సైఫ్ చాలా కామెంట్స్ చేశాడని, ఆమెకు తలబిరుసు ఎక్కువైందని, ఎలాంటి సహకారం అందించొద్దంటూ పోస్టులు పెట్టాడని వెల్లడించిన పోలీసులు.. కేవలం ప్రీతిని మాత్రమే సైఫ్ టార్గెట్ చేసినట్టు స్పష్టం చేశారు.

సైఫ్ వ్యవహారశైలిపై ప్రీతి కూడా స్పందించింది. తనను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయొద్దంటూ సైఫ్ కు పర్సనల్ గా మెసేజ్ పెట్టింది. అయినప్పటికీ సైఫ్ తగ్గకపోవడంతో ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ క్రమంలో చాలామంది స్టూడెంట్స్ దగ్గర డ్రగ్స్ ఉన్నాయంటూ జరిగిన ప్రచారాన్ని కూడా పోలీసులు తిప్పికొట్టారు. ప్రతి వైద్య విద్యార్థి దగ్గర డ్రగ్స్ కిట్ ఉంటుందని, దాన్ని మాదకద్రవ్యాలు అనుకోవడం తప్పని అన్నారు.

మొత్తమ్మీద ప్రీతి ఆత్మహత్య వ్యవహారం దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ర్యాగింగ్ ను మించి సైఫ్ వ్యవహరించిన విషయాన్ని పోలీసులు నిర్థారించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు సైఫ్.