ఈ ఏడాది సమ్మర్ కు అక్కినేని అఖిల్ ఏజెంట్ ఒక్కటే సినిమా లా కనిపిస్తోంది. మిగిలినవి పోస్ట్ సమ్మర్ దిశగానే వెళ్లేలా వున్నాయి. ఇదిలా వుంటే ఆగస్టు ఫస్ట్ వీక్, అలాగే 11 తేదీల మీద చాలా మంది కళ్లు పడ్డట్టు కనిపిస్తోంది. వాస్తవానికి ఈ డేట్ ను మహేష్-త్రివిక్రమ్ సినిమా కోసం లాక్ చేసారు. మరి ఆ సినిమా రెడీ కాదేమో అన్న అనుమానాలు ఏమైనా వున్నాయో, ఏమిటో, మొత్తం మీద చాలా మంది అధికారికంగా ప్రకటించకపోయినా, ఆ దిశగా తమ సినిమాలను రెడీ చేస్తున్నారు.
రవితేజ-అభిషేక్ అగర్వాల్ సినిమా టైగర్ నాగేశ్వరరావు సినిమా దృష్టి ఈ డేట్ మీద వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్-సాయి ధరమ్ తేజ్ లతో సముద్రఖని చేస్తున్న సినిమా కూడా అనుకున్నది అనుకున్నట్లు రెడీ అయితే ఆగస్టు కు రావాలనుకుంటున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మే నెలాఖరుకు కనుక రెడీ అయిపోతే ఇంకా ముందుగానే వచ్చే అవకాశం కూడా వుందని తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ-శివనిర్వాణ సినిమా జూలైలో విడుదల అని వార్తలు వున్నాయి. ఈ సినిమా తాజా షెడ్యూలు మార్చి లో ప్రారంభమవుతుంది. అందువల్ల కాస్త అటు ఇటు ఆలస్యం అయినా ఆగస్ట్ మీద పడే అవకాశం వుంది.
మహేష్ – త్రివిక్రమ్ సినిమా మరో షెడ్యూలు జరిగితే తప్ప సరైన క్లారిటీ రాదు. ఆగస్ట్ పక్కా అంటే మిగిలినవి అన్నీ పక్కకు వెళ్తాయి. లేదంటే పోటా పోటీగా రెండు మూడు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.