నో డౌట్.. స్కూల్స్ లేనట్టే

సామాజిక దూరం పాటిస్తున్నా, శానిటేషన్ చేయిస్తున్నా.. కరోనా మహమ్మారి పిల్లల్ని వదల్లేదు. అంతా భయపడినట్టే.. విజయనగరం జిల్లా గంట్యాడలో 27మంది స్కూల్ పిల్లలకు కరోనా సోకింది. వీరంతా 9, 10 తరగతి విద్యార్థులే. ఈ…

సామాజిక దూరం పాటిస్తున్నా, శానిటేషన్ చేయిస్తున్నా.. కరోనా మహమ్మారి పిల్లల్ని వదల్లేదు. అంతా భయపడినట్టే.. విజయనగరం జిల్లా గంట్యాడలో 27మంది స్కూల్ పిల్లలకు కరోనా సోకింది. వీరంతా 9, 10 తరగతి విద్యార్థులే. ఈ ఘటనకు రెండు రోజుల ముందే గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరులో ఓ ట్యూషన్ టీచర్ ద్వారా ఏకంగా 30మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు.

ఈ రెండు ఘటనలతో అటు ప్రభుత్వం, ఇటు తల్లిదండ్రులు కూడా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా.. విద్యా దీవెన కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో నవంబర్ 2 నుంచి పిల్లలకు తరగతులు ప్రారంభించడం కూడా కష్టసాధ్యమేనని చెప్పాలి. అవును.. పసిపిల్లల ప్రాణాలు పణంగా పెట్టి వారికి పాఠాలు బోధించాల్సిన అవసరం లేదు. విద్యా సంవత్సరం వృథా అయినా పర్లేదు కానీ, ఒక్క పిల్లవాడు కూడా నిర్లక్ష్యం కారణంగా కరోనాకి బలికావడానికి వీల్లేదు.

ఇదే నియమంతో.. ఇన్నాళ్లూ స్కూల్స్ తెరవకుండా ఆంక్షలు విధించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇకపై కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. కరోనాకు వ్యాక్సిన్ వచ్చి పరిస్థితులు చక్కబడిన తర్వాతే పిల్లలను పాఠశాలల్లోకి అనుమతించాలి.

రాష్ట్రంలో రోజుల వ్యవధిలో జరిగిన సంఘటనలతో తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇంట్లో ఉంటే పిల్లల చదువు పాడైపోతోందని, అన్నీ మరచిపోతున్నారని, పూర్తిగా సెల్ ఫోన్ గేమ్స్ కి బానిసలుగా మారుతున్నారనే కారణంగా తల్లిదండ్రులు కొన్నిచోట్ల ధైర్యం చేసి ట్యూషన్లకు పంపిస్తున్నారు. 9, 10 తరగతి పిల్లల్ని స్కూల్ కి కూడా పంపించేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి స్కూల్ పిల్లలకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు కూడా వెనకడుగేస్తున్నారు.

స్కూల్ లో పిల్లల మధ్య సామాజిక దూరం అనే నియమం పూర్తిగా పెద్దవారి అమాయకత్వమే అవుతుంది. పసితనంలో స్నేహితుడిని దూరంగా పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. కాకి ఎంగిళ్లు తినడం, భుజంపై భుజం వేసి నడవడం, ఒకరి వాటర్ బాటిల్స్ మరొకరు తీసుకోవడం, పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు మార్చుకోవడం.. లాంటివి చేయకుండా పిల్లలపై ఆంక్షలు పెట్టడం అసాధ్యం.

అందుకే ముందు జాగ్రత్తగా పిల్లల్ని స్కూళ్లకు పంపించకుండా ఉండటమే మేలు. ప్రభుత్వం కూడా ఈ దిశగానే ఆలోచిస్తుండటం వల్లే విద్యాదీవెన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. నవంబర్ నుంచి స్కూల్స్ ప్రారంభించే కార్యక్రమంపై కూడా పునరాలోచనలో పడింది. 

జడ్జిమెంట్స్ పై నాకు ఎంతైనా మాట్లాడే హక్కుంది