ఇవి కలికాలం రోజులు. స్నేహాలు, బంధాలు అన్నీ కూడా క్రుతకం అయిన పాడు రోజులు. అయినా సరే కాల పరీక్షకు నిలిచిన కొన్ని బంధాలు నిలుస్తాయి, గెలుస్తాయి. అటువంటిదే వైఎస్సార్ ఫ్యామిలీతో ద్రోణంరాజు ఫ్యామిలీ అనుబంధం అని చెప్పాలి.
రాజా అంటూ వైఎస్సార్ని అప్యాయంగా పిలిచే చనువు ఉత్తరాంధ్రా టైగర్ ద్రోణంరాజు సత్యనారాయణది. అందరూ వైఎస్సార్ని సీఎంగా 2004లో చూస్తే ద్రోణంరాజు మాత్రం 1990 దశకాల్లోనే చూశారు. గట్టి మద్దతుదారునిగా నిలిచి ఆయనతోనే ముందుకు సాగారు.
వైఎస్సార్ కొలువులో మంత్రి కావాలనుకున్న ద్రోణంరాజు ఆశ తీరకుండానే కన్నుమూశారు. ఆయన కుమారుడు, రాజకీయ వారసుడు శ్రీనివాస్ ఉప ఎన్నికల్లో గెలిచి వైఎస్సార్ సర్కార్ లో ఎమ్మెల్యే అయ్యారు. అలా రెండవతరం వైఎస్సార్ కుటుంబంతో అనుబంధం పెనవేసుకుంది.
ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున శ్రీనివాస్ పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా ఆయనను గౌరవించి క్యాబినెట్ ర్యాంక్ పదవిని విఎమ్మార్డీయే చైర్మన్ రూపంలో జగన్ అందించారు.
రాజకీయంగా శ్రీనివాస్ కి ఇది అనుకూల కాలం. ఆయన్ని ఎమ్మెల్సీ చేస్తారని, ఏదో రోజు మంత్రి అవుతారని అభిమానులు అంతా ఆశిస్తున్న సమయంలో హఠాత్తుగా కరోనా బారిన పడి కన్నుమూశారు. ఏది ఏమైనా రెండు తరాల అనుబంధం, రెండు కుటుంబాల బంధం రాజకీయాలను కాలాలను దాటి విజేతగా నిలవడమే ఇక్కడ ప్రతీ ఒక్కరు గుర్తు చేసుకునే అంశం.