తిరుపతిలో అలజడి సృష్టించేందుకు జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. అమరావతి పాదయాత్ర చివరి రోజు తిరుపతికి చేరింది. ఈ సందర్భంగా తిరుపతి నగరంలో అమరావతి రైతులు నడుచుకుంటూ అలిపిరికి ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో వారి పాదయాత్రను స్వాగతిస్తూ, ఇదే సందర్భంగా రాయలసీమ ఆకాంక్షలను ఆవిష్కరిస్తూ తిరుపతి ప్రజలు ఫ్లెక్సీలను పెట్టారు.
మీతో మాకు గొడవలు వద్దు…మీకు మా స్వాగతం. మాకు 3 రాజధానులే కావాలి, అలాగే అమరావతి పెద్దలారా ఒక సారి ఆలోచించండి… నాడు రాయలసీమలో పరిపాలన రాజధాని , మీకు హైకోర్టు ఉండేవి. నేడు రాజధాని తీసుకున్న మీరు మాకు హైకోర్టు వద్దనడం ధర్మమా అంటూ తిరుపతి ప్రజలు వినయపూర్వకంగా విన్నవిస్తున్న ఫ్లెక్సీలు అడుగడుగునా కనిపించాయి.
తమకు హైకోర్టు కావాలని సీమ ప్రజలు కోరడమే నేరమైనట్టు… జనసేన కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. లక్ష్మీపురం సర్కిల్, గాంధీవిగ్రహం సర్కిళ్లలోని ఫ్లెక్సీలను మీడియా సాక్షిగా జనసేన నాయకులు, కార్యకర్తలు చించి, రౌడీయిజాన్ని ప్రదర్శించారు. జనసేనను ముందుపెట్టి, వెనుక నుంచి కొందరు ఆడిస్తున్నారని సీమ సమాజం ఆగ్రహంగా ఉంది.
ఎంతో సహృదయతతో అమరావతి రైతుల పాదయాత్రను స్వాగతించామని, కానీ వాళ్లు మాత్రం కుట్రపూరితంగా సీమ ఆకాంక్షలను ప్రతిబింబించే ఫ్లెక్సీలను చించేసి దాష్టీకానికి పాల్పడ్డారని తిరుపతి ప్రజలు మండిపడుతున్నారు. ఇదేనా పవనిజం అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాళ్ల చేతికి అధికారం ఇస్తే …తాలిబన్లను మరిపించేలా ఉన్నారని సీమ సమాజం మండిపడుతోంది.